బ్రహ్మ సరోవర మహాత్మ్యం

కమలాసనాసీనుడైన బ్రహ్మకు లక్ష్మీసహితుడగు నారాయణునకు రుద్రదేవునకు నమస్కరించి బ్రహ్మ సరోవర మహిమను చెప్పుచున్నాను. బ్రహ్మ పూర్వం, రంతుకం నుంచి ఔజసం వరకు, పావనం నుంచి చతుర్ముఖ పర్యంతం వ్యాపించి సరస్సును సంనిహిత సరోవరమని చెప్పియున్నారు. ద్వాపరకలియుగాల మధ్యకాలంలో మహాత్ముడైన వ్యాసభగవానుడు సరోవర ప్రమాణం చెప్పియున్నాడు. అది వినండి. విశ్వేశ్వరం నుంచి అస్థిపురం వరకు జరద్గవి కన్యనుండి ఓఘవతి వరకు సన్నిహిత సరస్సు వ్యాపించి ఉన్నది. నేను వామనపురాణం నుండి తెలుసుకున్న ప్రమాణ వివరాలు పరమ పుణ్య ప్రదాలు. అవి కూడ వినండి. విశ్వేశ్వరం నుండి దేవవరం, నరపావనం నుండి సరస్వతి, వీనికి మధ్య విస్తరించిన అర్ధయోజన సరస్సే సంనిహితం. దాని నాశ్రయించుకొని దేవతలు ఋషులు తదితరులు స్వర్గమోక్షప్రాప్తికై ఆ పావన తీర్థాన్ని సేవిస్తారు. సృష్టి కార్యం సాగించుటకై యోగనిష్ఠుడై బ్రహ్మ దీనిని సేవించాడు. స్థితి కార్య నిర్వహణకై విష్ణువు యిచట తపస్సుచేశాడు. రుద్రుడీ సరోవర మధ్య భాగంలో ప్రవేశించి మహా తేజోవంతమైన స్థాణుపదాన్ని సంపాదించాడు. మొదట దానిపేరు బ్రహ్మవేది. తర్వాత రామహ్రదం. అనంతరం కురుమహారాజు దున్నినందున కురుక్షేత్ర మైంది. ఆ కురుక్షేత్రం తరంతుక అరంతుక, రామహ్రద చతుర్ముఖాల మధ్య భాగాన విస్తరించి ఉంది. దానినే కురుక్షేత్ర సమంత పంచకమనీ, బ్రహ్మ ఉత్తరవేది అనీ అంటారు. అని వారికి చెప్పగా