వామన మహా పురాణము
దేవవతి కథ
దండుడు ఇలా అన్నాడు, ఓ అరజా! అచిత్రాంగద అక్కడ వీరుడైన సురథుణ్ని స్మరిస్తూ చాలాకాలం ఉండి పోయింది. దైవోపహతుడై విశ్వకర్మ మునిశాపంవల్ల భయంకరాకారంతో వానరుడై మేరుశిఖరాన్నుంచి భూమ్మీద శాలూకినీ నదీతీరాన శాల్వేయ పర్వతం వద్ద భయంకరారణ్యంలో పడిపోయాడు. అక్కడ కందమూల ఫలాలు తింటూ అనేక సంవత్సరాలు గడిపాడు. ఒక పర్యాయం కందరుడు దైత్యశ్రేష్ఠుడు దేవవతిగా ప్రసిద్ధిగాంచిన తనప్రియపుత్రికను వెంట బెట్టుకుని అక్కడకువచ్చాడు. తండ్రితో కలిసి వస్తూన్న ఆచంద్ర ముఖిని చూచి ఆ వానర శ్రేష్ఠుడు బలవంతంగా ఎత్తుకొనిపోయాడు. తన కుమార్తె నతడు హరించుకొని పోవుట చూచి మండిపడి ఆకందరుడు కత్తిదూసి వానిని వెంబడించాడు. తనమీదకు దూకుతున్న దైత్యునిచూచి ఆ కపిదేవ వతితో హిమాచలానికి పారిపోయాడు. అక్కడ యమునా తీరాన శ్రీకంఠేశ్వరుని అక్కడకు సమీపంలో ఋషి లేనటు వంటి శూన్యాశ్రమాన్ని చూచి ఆ పవిత్రాశ్రమం లోపల వేదవతిని ఉంచి తాను ఆ రాక్షసుడు చూస్తుండగా కాళిందీ జలాల్లో మునిగిపోయాడు. అంత నా దానవుడు వానరంతో బాటు తనకుమార్తెకూడా నదిలో మునిగి చనిపోయిందని భావించి నిరాశుడై తాను పాతాళానికి వెళ్లిపోయాడు. ఆవానరు డావిధంగా కాళిందీ ప్రవాహంలో కొట్టుకొనిపోయి సజ్జనుల కావాసమై “శివి” అనే దేశం చేరాడు. అక్కడ నీళ్ళల్లో నుండి బయటపడి దేవవతిని వదలి వచ్చినచోటకు వెళ్ళాలని త్వరగా బయలుదేరాడు.
అంతట అంజనుడను యక్షశ్రేష్ఠుడు తన కూతురు నందయతితో అటువైపు రావడం చూచి ఆమెయే దేవవతి యనుకొని తను నీళ్లలో దూకడం వ్యర్థమైనదని భావించాడు. అలా అనుకొని ఆమెను పట్టుకొనుటకు లంఘించగా నామె భయపడి హిరణ్వతీ ప్రవాహంలో దూకింది. అలా తనపుత్రిక నదిలో పడిపోవటం చూచి చాలాసేపు దుఃఖించి ఆయక్షుడు అంజనాద్రికి వెళ్లిపోయాడు. అక్కడ మౌనవ్రతంతో ఆ మహాతేజస్వి అనేక సంవత్సరాలు తపస్సులో ఉండి పోయాడు. హిరణ్వతి ప్రవాహంలో కొట్టుకొని పోయిన నందయతి మహాపుణ్యభూమి అయిన కోసల దేశంచేరింది. సాధువులకు నెలవైన ఆ భూమి మీద విలపిస్తూ పోయిపోయి ఆ సుందరి అసంఖ్యాకాలయిన ఊడలతో విశాల ప్రదేశంలో శివుని జటాభారంలాగా విస్తరించిన ఒక మర్రిచెట్టు మూలాన ఒక శిలా వేదిక మీద వెళ్ళికూర్చున్నది. ఆవటచ్ఛాయలో విశ్రమించిన ఆమెకు ఇలా కొన్ని మాటలు వినపడ్డాయి. “తపోధనుడైన నా తండ్రికి, నీ పుత్రుడు మర్రిచెట్టుకు బంధింపబడి ఉన్నాడని చెప్పగల పుణ్యాత్ములు లేరా! ఆ మాటలు విని ఆ సుందరాంగి క్రింద పైన ప్రక్కలా నలువైపులా కలయచూచింది. అంతట నామె ఆమర్రిచెట్టు చిటారుకొమ్మన, తన జడలతో చెట్టుకొమ్మకు గట్టిగా కట్టివేయబడిన ఐదేండ్ల బాలకుని చూచి చాలా దుఃఖించి బాబూ! ఏ పాపిష్ఠుడు నిన్నిలా బంధించాడు? అని అడిగింది. అంత నా బాలకుడు నందయతితో అన్నాడు. ఓ మహనీయురాలా! పరమ దుర్మార్గుడైన ఒక కపి నన్నిక్కడ జడలతో బంధించాడు. కేవలం తపోబలంతో బ్రతికి ఉన్నాను. మహేశ్వరున కావాసమైన పురౌన్మత్త పురంలో నా తండ్రి పరమ తపోరాశి ఋతధ్వజుడున్నాడు. ఆ మహాయోగి జపసమాధిలో ఉండగా సర్వశాస్త్ర విశారదుడనై తుమ్మెదలతో ఆవరింపబడి నేను జన్మించాను. అంతట నా తండ్రి నాకు జాబాలి అని నామకరణం చేసి ఇలా అన్నాడు. నీవు అయిదు వేలేండ్లు బాలుడివిగా ఉంటావు. పదివేలేండ్లు కౌమార్యం ఇరవై వేలేండ్లు యౌవనం, తర్వాత నలభై వేలయేండ్లు పైకాలం గడుపుతావు. ఇందులో బాల్యంలో అయిదు వందల ఏండ్లు దృఢ బంధనం అనుభవిస్తావు, కౌమారంలో వేయేండ్లు శరీర బాధతో కష్టపడతావు. యౌవనంలో రెండువేలేండ్లు పరమ సౌఖ్యాలు అనుభవిస్తావు.
ముసలితనంలో నాలుగువేలేండ్లు భూమ్మీద శయనిస్తూ దుష్టాన్నం భుజిస్తూ బాధలనుభవిస్తావు. ఇలా నాతండ్రి నావిషయం వివరించాడు. నేను అయిదేండ్ల బాలుడుగా నడుస్తూ స్నానానికై హిరణ్వతీనదికి వెళ్తుండగా ఆ కపివీరుడు చూచి, మూర్ఖుడా! మహాశ్రమంలో నేనుంచిన దేవవతిని తీసుకొని ఎక్కడికెళ్తున్నావని భయంతో గడగడలాడుతున్న నన్ను పట్టుకొని నా జడలతోనే ఈ వట వృక్షానికి గట్టిగాకట్టివేశాడు. ఆ దుష్టుడు నేను క్రిందపడకుండా తీగలతో త్రాళ్ళతో, క్రిందా పైనా నలువైపులా అభేద్యంగా బంధించాడు. ఇలా లతాయంత్ర బద్ధుణ్ణి గావించి ఆవానరుడు అమర పర్వతానికి వెళ్ళి పోయాడు. నేను చూచినదంతా యథాతథంగా నీకు చెప్పాను. ఇక ఓసుందరీ! నీవెవరు? ఎవరితోవచ్చి ఈమహారణ్యంలో ఒంటరిగా చిక్కు బడిపోయావు. నాకు చెప్పమని బాలు డడిగాడు. అందులకా నందయంతి, అంజనుడను యక్షునకు ప్రమ్లోచ వలన గలిగిన కుమార్తెను నేను. పేరు నందయంతి. ముద్గల మహర్షి నా జాతకం చూచి నేను నరేంద్ర మహిషి నయ్యెదనని జోస్యం చెప్పాడు. వెంటనే శుభాశుభ సూచకంగా దేవదుందుభులు మ్రోగాయి. పిడుగుల ధ్వనులూ వినిపించాయి. అంత ఆఋషి ఈ బాలిక రాజుభార్య కావడం తప్పదు. అయితే కన్యగా ఉన్న దినాల్లో ఆపదల్లో చిక్కు కుంటుందని తుది నిర్ణయం చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళకు మా తండ్రి నన్ను వెంటబెట్టుకొని పవిత్ర తీర్థానికి వెళ్తుండగా హిరణ్వతి నది తీరాన ఒక వానరం నామీద దూకింది. నేను భయంతో సాగరాభి ముఖంగా పోతున్న హిరణ్వతీ ప్రవాహంలో పడిపోయి నిర్మానుష్యమైన ఈ దేశానికి కొట్టుక వచ్చినాను అంటూ తన వృత్తాంతమంతా వినిపించింది. అదివిని జాబాలి ఆమెతో ఓ కోమలీ! నీవు యమునాతీరానగల శ్రీకంఠేశ్వర క్షేత్రానికి వెళ్ళు. ప్రతిదినం మధ్యాహ్నవేళకు అచటకు నా తండ్రి శివుని అర్చించుటకు వచ్చును. ఆయన కాళ్ళు పట్టుకొని ఆశ్రయిస్తే నీకు మేలు తప్పక కలుగుతుందని చెప్పాడు. అదివిని నందయంతి తన కష్టాలు పోగొట్టుకొనుటకై త్వరగా హిమాచలాన యమునా తీరానగల శ్రీకంఠక్షేత్రానికి బయలుదేరి చాలాకాలం కందమూల ఫలాలు తింటూ ప్రయాణం చేసి తుదకు శంకర నిలయానికి చేరుకుంది.
ఆమె లోకవంద్యుడగు శ్రీకంఠేశ్వరునకు ప్రణమిల్లి అచట వ్రాయబడిన శ్లోకం చదువుకొని అర్థం చేసుకుంది. అంతట నామె కళకళలాడే నవ్వు మొగముతో దాని క్రిందనే జాబాలి చెప్పిన శ్లోకం తాను వ్రాసింది. ఆ వెంటనే తన గాథను కూడ తెలిపే మరొక శ్లోకం కూడావ్రాసింది. ఈ విధంగా “ముద్గలుడు రాజపత్నివి అవుతావని నాకు జోస్యం చెప్పాడు. అయితే నేనీ దురవస్థలో ఉన్నాను. ఎవరో ఒక ప్రభువు నన్ను రక్షించుగాక. “ఆ శిలావేదిక మీద ఆ విధంగా వ్రాసి ఆమె యమునలో స్నానం చేయడానికి వెళ్ళింది. అక్కడ మత్తకోకిల నాదాలతో మారు మ్రోగుతున్న ఆశ్రమాన్ని చూచి ఆ ఋషివర్యుడు అక్కడ తప్పకుండా ఉన్నాడని అనుకుంటూ ఆ ఆశ్రమం లోపల ప్రవేశించింది. అయితే అక్కడ దివ్య కాంతిలో వెలుగుతున్న పవిత్రురాలు దేవవతి ముఖం ఎండిపోయి, కళ్ళలో ప్రాణం పెట్టుకొని వాడిన తామరపూవులా కనిపించింది. ఆ యక్షపుత్రి తనవైపు రావడం చూచి దైత్యకుమారి లేచి నిలబడి ఈమె ఎవరా, అని ఆలోచించ సాగింది. అంతటవారిద్దరు ఒకరినొకరు సమీపించి స్నేహపురస్సరంగా గాఢాలింగనాలు కావించు కున్నారు. ఒకరి నొకరు ప్రశ్నించుకొని పరస్పర వృత్తాంతాలు తెలుసుకున్నారు. అలా వారు కుశల ప్రశ్నలు వేసుకొనుచుండగా నాతత్వదర్శి అయిన మునిశ్రేష్ఠుడు స్నానార్థం శ్రీకంఠేశ్వరాలయానికి వచ్చి అక్కడ శిలాపట్టం మీద వ్రాయబడిన అక్షరాలు చదువుకొని ముహూర్తకాలం ధ్యానస్థుడై అంతా సాకల్యంగా తెలుసుకున్నాడు. అంతట నా ఋతధ్వజుడు త్వరగా స్వామిని అర్చించి ఇక్ష్వాకు చక్రవర్తిని చూచుటకు అయోధ్యకు చేరుకున్నాడు. ఆ రాజ శ్రేష్ఠుని చూచి ఆ తపస్వి ఓ నరశార్దూలా! రాజా! నా విజ్ఞప్తి వినుము. సర్వగుణోపేతుడు సర్వశాస్త్ర కోవిదుడైన నా కుమారుని ఒక వానరుడు నీ రాజ్యసీమలో బంధించియున్నాడు. అర్థ శాస్త్రనిధి అయిన నీ కుమారుడు శకుని తప్ప మరెవ్వరు ఆ బాలుని విడిపించజాలరన్నాడు.
ఓ సన్నని నడుముగల అరజా! ఆ మునిమాటలు విని నా తండ్రి తన ప్రియ తనయుడు శకునిని ఆయనవెంట వెళ్ళమని ఆదేశించాడు. అంతట మహాభుజుడైన నా సోదరుడు మునివెంట వెళ్ళి ఊడలతో దిశలన్నీ కప్పివేస్తూ ఉన్న ఆ బ్రహ్మాండమైన మర్రిచెట్టును సమీపించి వృక్షం చివర కట్టబడి ఉన్న మునికుమారుణ్ణి చూచాడు. ఆ బాలకుని నలువైపులా లతలు గట్టిగా బంధించి ఉన్నాయి. అతని జటలతోనే అతడు కొమ్మకు బంధింపబడి ఉన్నాడు. అంత నారాకుమారుడు విల్లెక్కుపెట్టి అతి నేర్పుతో బాలకునకు దెబ్బతగలకుండా చుట్టూ వానరుడు బిగించిన లతా బంధాలు తెగకొట్టాడు. కపి కట్టిన లతాపాశాలన్నీ అయిదు వందల సంవత్సరాల తర్వాత అ మహావీరుని బాణ ఘాతాలకు తెగిపోయాయి. వెంటనే ఆ ముని త్వరగా తెగిన లతలతో కప్పబడిన ఆ వట శాఖాగ్రానకు ఎక్కి కుమారుని చూడగా ఆ బాలకుడు జడలచే బంధితుడయి నందున శిరోనమ్రభావంతో తండ్రికి నమస్కరించాడు. పుత్ర స్నేహంతో ఋతధ్వజుడా జాబాలిని నుదురుపై మాటిమాటికి ముద్దుపెట్టుకున్నాడు. పూర్తిగా కట్లు విప్పడానికి తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా ఆ వీరుడు శకుని విల్లంబులతో చెట్టుమీద ఎక్కి తాను ప్రయత్నించాడు. అయినా బాలకుని కట్లు ఊడలేదు. అంతట నా వీరుడు మునితోకూడ చెట్టుమీదనుంచి క్రిందకు దిగి అతి లాఘవంగా బాణాలతో ఒక శరమండపాన్ని కట్టి అ కొమ్మను మూడు ముక్కలుగా ఖండించాడు. అంతట జాబాలి తలకుకట్టబడిన చిరు కొమ్మల బరువుతో, అబాణాల మెట్లమీద నుంచి మెల్లగా క్రిందకు దిగివచ్చాడు. అ విధంగా ధానుష్కులలో ముఖ్యడైన రాజకుమారుడు బంధ విముక్తుడిని గావించిన కుమారుడు జాబాలిని, తలమీద బరువుతోసహా, వెంట బెట్టుకొని ఆ ఋతధ్వజుడు యమునానదికి వెళ్ళాడు.
దండకుడన్నాడు, ఓ బాలా! ఆ లోపల యోగయోగీశ్వరుడైన కంఠేశ్వరుని దర్శనానికై ఆ యక్ష అసుర కన్యకలు ఆలయానికి వెళ్ళారు. అక్కడ వారలు వాడిపోయిన పూలు అక్షతాదులతో నిర్మాల్యంతో నిండియున్న స్వామి లింగాన్ని దర్శించారు. అది ఋతధ్వజుడు కావించిన పూజా నిర్మాల్యం. అంత ఆ కన్యలిద్దరూ నిర్మాల్యం తొలగించి విధిపూర్వకంగా అభిషేకం చేసి రాత్రింబవళ్ళు అర్చన గావించారు. వారక్కడ అలా ఉండగా నొకనాడు అవ్యక్తమూర్తియగు ఆ కంఠదేవుని దర్శించటానికి గాలవుడను మహర్షి వచ్చాడు. ఆ బాలికలిర్వురను చూచి ఆముని వీరెవ్వరి కుమార్తెలోయని అనుకుంటూ స్నానం చేయడానికి కాళిందిలో దిగాడు. స్నానానంతరం ఆ ముని పూజచేస్తూండగా ఆ కన్యలిరువురూ కమనీయంగా భగవంతుని గుణానుగానం చేశారు. వారి మధురగానం విని గంధర్వ కామినులని నిశ్చయించుకున్నాడు. జపతప పూజాదులు సక్రమంగా నెరవేర్చిన అనంతరం ఆ కన్యలిద్దరూ ఆ మునికి నమస్కరించారు. అంతట నాముని, శివభక్తి సమేతలై మీమీ వంశాలకు అలంకారాలుగా వెలిగే మీర లెవరి బిడ్డలమ్మా అని ప్రశ్నించాడు. అంతట ఓ చంద్రముఖీ! ఆ బాలికలు తమతమ గాథలు ఉన్నవి ఉన్నట్టుగా వివరించి చెప్పారు. అదివిన్న ఆ గాలవుడా రాత్రి అచటనే ఉండి మరునాడు ఉదయం మరల శివుని అర్చించి వారలతో నేను పుష్కరారణ్యానికి వెళ్తున్నానని చెప్పాడు. అంతట ఆ యక్షాసుర పుత్రికలు చేతులు జోడించుకొని మహాత్మా మీబోటి వారల దర్శనం దుర్లభం. పుష్కరానికి మీ రెందులకు వెళ్ళుతున్నారు అని అడిగారు. అందులకా తేజస్వి, రాబోవు నెలలో కార్తీక పూర్ణిమ పర్వం పుష్కరారణ్యంలో వైభవంగా జరుగుతుంది. అందుకోసం వెళ్తున్నానని చెప్పగా ఆ యువతులు మహానుభావా! మేము గూడా మీవెంట వచ్చెదము. దయచేసి కొని పొండు. మిమ్ము విడచి ఇక్కడ ఇక ఉండలేమని ప్రార్థించారు.