వామన మహా పురాణము
వామనునికి పూర్వం త్రివిక్రముడు ఉన్న వృత్తాంతం
“మహర్షీ! ఇదేమి? ప్రస్తుతం వామనదేవు డావిర్భవించి బలిని బంధించి ముల్లోకాలను ఆక్రమించ బోతూండగా, ఇంతకు పూర్వకాలాననే ఆ త్రివిక్రముడు వెలసినట్లు చెబుతున్నారే, ఇది ఎట్లా పొసగగలదు? అప్పుడు విష్ణుడెవరిని బంధించాడో తెలియచేయండి. నారదుని ప్రశ్నకు పులస్త్యుడు ఇలా చెప్పసాగాడు. వినవయ్యా చెబుతున్నాను. ఆ విష్ణువెవరో ఎప్పుడవతరించి ఎవనిని వంచించాడో వినుము. ధుంధుడు అనే కశ్యపముని ఔరసుడు దనుగర్భాన ఉద్భవించాడు. వాడు మహా బలవంతుడు. అతడు బ్రహ్మను తపస్సు ద్వారా మెప్పించి ఇంద్రాది దేవతలచేత చావు లేకుండా వరం పొంది విజృంభించి స్వర్గం మీదకు వెళ్ళాడు. నాల్గవ కలియుగారంభంలో వాడు అలా విజృంభించి ఇంద్రాది దేవతలను పారద్రోలి తనే ఇంద్రాసనం మీదకూర్చున్నాడు. అది హిరణ్యకశిపుడు జీవించిన సమయం. ఆ ధుంధుని ఆశ్రయించి ఆ హిరణ్యకశిపుడు విక్రమించి, మందరగిరి ప్రదేశాన సంచారం చేస్తూవుండగా దేవతలందరూ దుఃఖార్తులై బ్రహ్మ లోకానికి వెళ్ళిపోయారు.
అలా దేవతలు బ్రహ్మలోకంలో ఉంటున్నారని విని ఆ ధుంధుడు దైత్యులతో ఇలా అన్నాడు. మనం దేవతలను జయించుటకు బ్రహ్మ లోకానికి వెళ్లాము పదండి. ధుంధుని మాటలకు దైత్యులిలా బదులు చెప్పారు. ఓ దైత్యశ్రేష్ఠా! బ్రహ్మ సదనానికి వెళ్ళగలశక్తి మనకు లేదు. ఆ మార్గం చాలా దుర్గమమైనది. ఇక్కడకు అనేక వేల యోజనాలకు అవతల మహర్షులచే సేవించబడే మహర్లోకం ఉంది. అమహర్షుల దృష్టి సోకినంత మాత్రాననే దైత్యులు దగ్ధమైపోతారు. అక్కడ గోమాతలుఉంటారు. అగోవుల పాదరజం తాకినంతనే మనం భస్మమైపోతాము. అక్కడకు ఆరు కోట్ల యోజనముల దూరాన తపస్వులచే నిండిన తపోలోకం ఉంది. అక్కడ ఉండే సాధ్య దేవతల నిశ్వాస మారుతపు తీవ్రతను మనంభరించి బ్రతుకలేము. దాని కావల ముప్పదికోటి యోజనాల దూరాన వేయి మంది సూర్యుల ప్రభతో వెలిగే సత్యలోకం ఉంది. దాని అధిపతియే నీకు వరాలు ప్రసాదించిన బ్రహ్మ. అక్కడి వేదధ్వని తరంగాలకు దేవతలు వికసిస్తారు, దైత్యులు వారి లాంటి యితరులు ముడుచుకుని పోతారు. కాబట్టి ఓ మహావీరా! నీ సంకల్పం మానుకొనుము. వైరాజ భువన ప్రాప్తి నరులకు ఎప్పుడూ దుష్కరమే! వారల మాటలు విని ధుంధుడు మరల ఆ రాక్షసులతో నాకు బ్రహ్మ లోకానికి వెళ్లి దేవతలను జయించాలని పట్టుదలగా ఉంది. ఏ కర్మలు చేస్తే మన మక్కడకు పోగలము? సహస్రాక్షుడు దేవతలతో కలసి అక్కడకు ఎలా వెళ్ళగలిగాడు? ఆరహస్యం ఉపాయంచెప్పండనగా వారలది తమకుతెలియదని శుక్రాచార్యులు ఆ రహస్యం చెప్పగలరని అన్నారు. వెంటనే ధుంధుడు రాక్షస పురోహితుని పిలిచి, “గురుదేవా! ఏ కర్మ చేస్తే బ్రహ్మలోక గమనం సిద్ధిస్తుందని అడిగాడు. అందులకా శుక్రుడు! యిలా చెప్పాడు: “దైత్యేంద్రా! పూర్వకాలాన వృత్రాసుర శత్రువైన శక్రుడు పవిత్రమైన అశ్వమేధ యజ్ఞాలు నూరు ఆచరించాడు. ఆపుణ్య ప్రభావం వల్లనే అతడు బ్రహ్మ లోకానికి పోగలిగాడు.” శుక్రుని మాటవిని ఆమహావీరుడు నూరు అశ్వమేధాలు చేయాలని సంకల్పించుకున్నాడు. వెంటనే తన వారలందరనూ అసుర గురువును సమావేశ పరచి తన నిశ్చయం చెప్పాడు. “నేను దక్షిణలతో సహా నూరశ్వమేధాలు చేయ నిశ్చయించాను. మన మందరం భూలోకానికి వెళ్లుదాము పదండి. అక్కడి రాజులందరను ఓడించి అవసరమైన ధనరాసులు సేకరించుదాము. యక్షులను పిలిచి నవనిధులు తెప్పించుకుందాము. పవిత్రమైన దేవికాతీరానికి ఋషులనందరను పిలిపించండి. అనది పరమ పవిత్రమైనది. సర్వసిద్ధి ప్రదాయని. దానికి తూర్పుతీరాన అశ్వమేధ దీక్ష వహిస్తాను.”
దేవ శత్రువు (రాక్షసుని) మాటలు విని అసుర పురోహితుడు సంతోషించి తధాస్తని ధనరాసుల కోసం ఆదేశించాడు. యజ్ఞ సంభారాలు చేరగానే ధుంధు దైత్యుడు పాప వినాశని దేవికానదీ తూర్పు తటాన ఒక శుభ ముహూర్తాన భార్గవేంద్రుడైన శుక్రాచార్యుని చేత అశ్వమేధ యాగదీక్ష స్వీకరించాడు. ఆయజ్ఞంలో భార్గవుని వంశానికి చెందిన విప్రులే ఋత్విజులు సదస్యులుగా శుక్రుని అనుమతితో పాల్గొన్నారు. వారందరూ శుక్ర శిష్యులూ పండితులూనూ, రాహువు మొదలగు వారందరును శుక్రుని అనుజ్ఞతో ఆ రాక్షసేశ్వరుడు యజ్ఞాశ్వాన్ని వదిలారు. దాని రక్షణకై అసిలోముడను మహాదైత్యుడు వెంటవెళ్ళాడు. ఆ మహాయజ్ఞ కుండంలో నుంచి బయలు దేరిన ధూమ పటలాలు భూమి మీద పర్వత వనసరిత్ర దేశాల మీద పది దిక్కులా వ్యాపించి స్వర్గాన్ని ఉద్యమించినాయి. స్వర్గాన్ని ఆవరించిన ఆయజ్ఞ ధూమ వాసనలను వాయువు బ్రహ్మ లోకం దాకా కొనిపోయాడు. ఓ నారదా! ఆ యజ్ఞ గంధాన్ని ఆఘ్రాణించి దేవతలు దిగాలు పడి, అది హయమేధ దీక్షితుడైన ధుంధుని యజ్ఞశాలలోనిదని తెలుసుకున్నారు. చేయునది లేక భయవిహ్వలులై ఇంద్రునితో కలిసి సర్వలోకరక్షకుడైన జనార్ధనుని వద్దకు వెళ్లారు. వరదుడైన ఆపద్మనాభ దేవునకు ప్రణమిల్లి చేతులు జోడించుకుని డగ్గుత్తికపడిన స్వరంతో యిలా విన్నవించుకున్నారు: ఓ దేవదేవ! భగవన్! చరాచర రక్షకా! సురార్తి హరణా! విష్ణో మామొర వినండి! బ్రహ్మదత్త వరాలచే విజృంభించి బలవంతుడైన ధుంధుదైత్యుడు, దేవతల నందరను జయించి స్వర్గరాజ్యం అపహరించాడు. వాడి అభ్యుదయాన్ని పినాకపాణి శివుడు దక్క యితరులెవ్వరూ నిరోధించజాలకున్నారు. అందుచేత ఉపేక్షించబడిన రోగం వలె వాడింకా బలవంతుడై యిప్పుడు బ్రహ్మలోకవాసులను కూడ జయించే ఉద్దేశ్యంతో శుక్రాచార్యుని మంత్రణతో శతాశ్వమేధ దీక్ష వహించాడు. ప్రభో! ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ దుష్టుని యజ్ఞం పూర్తికాకుండా వెంటనే దానిని ధ్వంసం చేయు విధానం ఆలోచించండి, దానితో మా కష్టాలు తీరిపోతాయి.
దేవతల మాటలు విని మధుసూదనుడు వారల కభయమిచ్చి పంపాడు. దైత్యుడు అజేయుడు అగుటను ఎరింగిన ఆహరి మాయోపాయం చేత ఆధుంధుడిని, ధర్మనిష్ఠితుణ్ణి బంధించ వలెనని నిశ్చయించుకున్నాడు. అంతటతానొక మరుగుజ్జు రూపం ధరించి దేవికా నదీ జలాల్లో దేహ త్యాగంచేసి ఒకకొయ్యలాగా పడిపోయాడు. ఏఆధారం లేకుండా అలా ఆ నీళ్లల్లో మునిగి వీడిన వెండ్రుకలతో పైకి లేస్తూ మునుగుతూ మళ్లీ తేలుతూ యాదృచ్ఛికంగా ఆ యజ్ఞదీక్షితుడైన దైత్యుని కంటబడ్డాడు. వెంటనే ఇతర దైత్యులు ఋత్విక్కులూ అంతా చూశారు. అంతట ఆ మునిగి పోతున్న బ్రాహ్మణ కుమారుని రక్షించేందుకై యజ్ఞశాలవదలి ఆబ్రాహ్మణులూ, సదస్యులూ, యజమాని ధుంధుడూ అందరూ నదిలోకి పరుగెత్తి మునిగిపోనున్న ఆ వామన బ్రాహ్మణుణ్ణి బయటకులాగారు. అలా ప్రాణాలతో బయటపడిన ఆమరుగుజ్జునుచూచి సంతోషించి వారందరూ నీవెవరవు, ఎందులకు నీళ్ళలో పడిపోయావు. నిన్నెవరు నదిలో పడదోశారంటూ ప్రశ్నలు వేశారు. వారల మాటలువిని వడవడ వణికిపోతూ ఆ బ్రాహ్మణుడు ధుంధునీ ఇతరులను చూచి ఇలా అన్నాడు. ప్రభాసుడనే పేరు ప్రతిష్టలు గల గుణవంతుడైన బ్రాహ్మణుడు ఉండెడివాడు. ఆయన సకల శాస్త్రవిదుడు, వారుణ గోత్రీకుడు. ఆయనకు మందబుద్ధులూ దుఃఖభాజనులైన, పుత్రు లిద్దరు కలిగారు. వారిలో మొదటి వాడు నా అన్న. పేరు నేత్రభాసుడు, రెండవ వాడినైన నా పేరు గతిభాసుడు. ఓ రాక్షసేశ్వరా! సంపన్నుడై బంధువులతో చక్కని గృహంలో ఉండేవాడు. ఆయన దివ్య గుణాలు కలిగి చక్కగా అందంగా ఉండేవాడు. చాలా కాలం తర్వాత ఆయన గతించగా మేమిర్వురమూ అంతిమ సంస్కారాలు కర్మలు యథావిధిగా చేసి ఇంటికి చేరాము. అంతట నేను మా అన్నను చూచి తండ్రి వదలిన ఆస్తిని పంచుకుందామని కోరగా మా అన్న నీకు భాగం లేదు. కుబ్జులకు, వామను (మరుగుజ్జు)లకు, కుంటివారికి నపుసంకులకు, కుష్టువారికి, పిచ్చి, గ్రుడ్డివారలకు ఆస్తిలో భాగం ఉండదు. బ్రతికినన్నాళ్ళు తిండి తింటూ ఇంట్లో ఉండడమే నీ వంతు. కాబట్టి భాగం కోరే హక్కు నీకు లేదు పొమ్మన్నాడు. అందుకు నేను ఎదురుతిరిగి నాకెందుకు భాగం రాదు? ఏ న్యాయం ప్రకారం నాకు భాగముండదో చెప్పమని అడిగినంతనే మండిపడి, అశక్తుడనైన నన్నమాంతంగా ఎత్తి ఈ నదిలో పడవేశాడు. ఒక సంవత్సరంగా ఈ నదీ జలాల్లో కొట్టుకొనిపోతూ ఈనాడు మీచేత రక్షించబడ్డాను. ఇది నావిషాదగాధ. ఇంత కారుణ్యభావంతో ఆత్మీయులవలె నన్ను బయటకుతీసి రక్షించి ఆపద్భాంధవు లైన మీరెవరో చెప్పండి. అపర దేవేంద్రుడిలాగ వెలిగి పోతున్న ఈ మహాభుజుడెవరు? యజ్ఞ దీక్షలో నున్నాడు. మహా సంపన్నులుగా ఉన్న దయామయులు మీరంతా ఎవరైనదీ చెప్పి పుణ్యం కట్టుకొనుడు.
అంత నా వామనుని మాటలు విని భార్గవులయిన ఋత్విజులు “మేము భృగువంశీయులమైన బ్రాహ్మణులము. ఈ మహాతేజస్వి ధుంధుడను రాక్షస చక్రవర్తి. మహాభోగి, మహాదాత మహా వితరణ శీలి, యజ్ఞ దీక్షలో ఉన్నా”డని చెప్పారు. అంతట నా ద్విజులా దివ్య వామనునకు లాభకరమైన మాటలు ఆ ధుంధునితో యిలా చెప్పారు. “ఓ దైత్యేశ్వరా! ఈతనికి సర్వోపస్కరాలతో శ్రీమంతమైన ఆవాసం వివిధ రత్నాలు దాస దాసీ జనం ఇవ్వదగుదువు.” పురోహితుల మాటలు విని ఆ దైత్యవల్లభుడా వామనునితో బ్రాహ్మణోత్తమా! నీకు వలసిన దంతయు నిచ్చెదను. కోరుకొనుము. ఇవిగో ధనరాసులు, దాస, దాసీ, జనాలు, ఇండ్లు, స్వర్ణరాసులు, రథ, గజ, తురగాలు. ఇవన్నీ యిస్తున్నాను తీసికొను’ మని చెప్పాడు. దానవపతి వాక్యాలు విని భగవంతుడైన ఆ వామనుడు ధుంధునితో స్వార్థ సిద్ధికరాలైన మాట లీవిధంగా పలికాడు. తోడబుట్టిన సోదరుడు అపహరించిన ఆస్తిని కాపాడుకోలేని అసమర్థుడు నీవిచ్చే ఈ ధనరాసులను రక్షించుకోగలడా! వీటిని ఇతరులు అపహరించరా! దైత్యేంద్రా! ఈ దాస, దాసీలు, పరిజనం, గృహ, రత్న, వస్త్రాదులన్నీ సమర్థుడైనవిప్రోత్తమున కిమ్ము. నాశరీర ప్రమాణాన్ని దృష్టిలోనుంచుకొని అందులకు సరిపడునట్టుగా మూడడుగుల చోటు ఇమ్ము. అంతకుమించినది నేను రక్షించు కొనజాలను.
ఆ మహాత్ముని వచనాలు విని ఋత్విజులూ ఆ దైత్యపతి నవ్వుకున్నారు. అతడు మరే మియు గ్రహించనన్నందున ఆ ధుంధు రాక్షసుడు మూడడుగుల నేల ప్రదానం చేశాడు. ఆ మహాసురుడు, యశోధనుడు ఆ మూడడుగులు యివ్వగానే అనంత శక్తుడైన ప్రభువు మూడడుగుల విరాట్ స్వరూపాన్ని ధరించి, ముల్లోకాలూ అక్రమింపసాగాడు. ఆ రాక్షసులనందరను హతమార్చి ఋషులకు ప్రణామంచేసి మొదటి అడుగుతో, సముద్ర పర్వత పట్టణాలతో నిండిన భూమినంతనూ ఆక్రమించాడు. రెండవ అడుగుతో దేవతల నివాసమైన స్వర్గ సహితమైన భువర్లోకాన్నీ సూర్య చంద్రగ్రహ నక్షత్ర మండలంతో కూడిన నభో దేశాన్ని నింపి వేశాడు. అలా దివినీ భువినీ తొక్కిపెట్టి ఇస్తానన్న మూడో అడుగుకు చోటు లేకపోవటంతో భగవంతుడైన ఆ త్రివిక్రమ దేవుడు క్రోధాతిరేకంతో మేరు పర్వతం లాంటి తన శరీరంతో ఆ దానవవీరుని వీపుమీద పడిపోయాడు. నారదా! వాసుదేవుడలా దైత్యుని మీద పడిన వెంటనే ఆ ప్రదేశాన ముప్పది వేల యోజనాల మేరకు భూమిలో బ్రహ్మాండమైన గోయి ఏర్పడింది. అంతట నా దైత్యుని దేహాన్ని చీల్చి ఆ గోయిలోనికి విసరివేసి బ్రహ్మాండమైన ఇసుకను వర్షించి ఆ గుంటను పూడ్చి వేశాడు ఆసుర సంరక్షకుడు. తర్వాత జనార్దనుని ప్రసాదం వల్ల శతక్రతువు తాను కోలుపోయిన స్వర్గాధిపత్యాన్ని తిరిగి పొంది దేవతలతో కలిసి నిష్కంటకంగా పరిపాలించాడు. భగవంతుడగు నారాయణుడా విధంగా దైత్యేంద్రుణ్ణి ఇసుక సముద్రంలో పూడ్చివైచి ఆ ప్రదేశాన కాళిందీ రూపాన్ని (నదిగా) ధరించి అంతర్థానమై పోయాడు. మహర్షీ, ఈ విధంగా పూర్వ కాలంలో విష్ణుదేవుడు ధుంధు రాక్షసుని జయించుటకై త్రివిక్రముడైనాడు. అలాంటి పవిత్రాశ్రమానికా పుణ్యాత్ముడైన దైత్య నందనుడు (ప్రహ్లాదుడు) వెళ్లాడు.