దుర్గ కోరిన ఓలి

మయ పుత్రుడు దుందుభి మాటలు విని కాత్యాయని వానితో ఇట్లనెను. నిజమే! మీ ప్రభువు దానవేశ్వరుడు దేవతలను యుద్ధంలో జయించిన మాట వాస్తవం. అయితే ఓ దైత్యపతీ! మా కులాచారం ప్రకారం ధర్మ శుల్కం అంటూ చెల్లించి కన్యను వివాహ మాడవలసి యున్నది. మీ మహిషుడది చెల్లించినచో వానిని తప్పక పెండ్లాడెదను. కాత్యాయని మాటలు విని దుందుభి-“పద్మనేత్రీ! ఆ శుల్కమేదో చెప్పుము. నీ కొరకై మా ప్రభువు తన శిరస్సునైనా సమర్పించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైన వివాహ శుల్కం ఏదియు యుండజాలదనెను. మయ పుత్రుని మాటలు విని కాత్యాయని పకాలున నవ్వి ఉచ్చై స్వరంతో చరాచర జీవులందరకు కళ్యాణము కలుగజేయు పలుకులు పలికెను. “ఓ రాక్షసా! మా కులకన్యను పెండ్లాడనెంచినవాడు ముందుగా ఆ కన్యను యుద్ధంలో జయించాలి. ఇది అనూచానంగా మా పెద్దల ఆచారము.”

పులస్త్యుడన్నాడు, నారదా! శ్రీదేవి మాటలు విని దుందుభి యథాతథంగా తన స్వామి మహిషుని వద్దకు వెళ్ళి చెప్పాడు. అంతట మహాతేజస్వి అయిన ఆ రాక్షసుడు తన సమస్త దైత్య సేనతో కాత్యాయనిని జయించుటకై బయలుదేరి వింధ్య పర్వత మూలమును జేరెను. సేనాధ్యక్షుడయిన చిక్షురుడు అమర దైత్యవీరుని సేనా ముఖాన నిలబెట్టెను. వాడు కూడ చతురంగ బలాలతో మరొకవైపు నుంచి దుర్గాదేవితో యుద్ధానికి తలపడెను. వాని ఉద్ధతికి వెరగుపడి బ్రహ్మ పురస్సరులైన దేవతలు దేవితో “అమ్మా! కవచం ధరించు తల్లీ!” అని విన్నవించిరి. అంతట నా దుర్గ దేవతలతో “కవచం నాకెందులకు? ఈ రాక్షస కీటకాలు నా యెదుట అసలు నిలబడగలవా?” అంటూ కవచం ధరించకుండానే విష్ణుపంజర స్తోత్రాన్ని స్మరించింది! ఆ స్తోత్ర ప్రభావంతో ఓ నారదా! ఆ తల్లి సర్వదేవతలకు నవధ్యుడైన ఆ మహిష దైత్యుని నేల బెట్టి కాల రాచి సంహరించింది. ఆ విధంగా పురాసమయాన దుర్గాదేవికి విష్ణు పంజర కవచాన్ని పరమ శివుడు పదేశించాడు. ఆమె దాని ప్రభావంతో సకల రాక్షస సంహారం గావించింది. విప్రోత్తమా! లోకంలోని సమస్త రక్షాకవచాలన్నింటిలోనికీ విష్ణు పంజరం సర్వోత్తమంగా కీర్తింపబడుతోంది. ఆ చక్రధారి విష్ణువును హృదయంలో ప్రతిష్ఠించుకున్న వానిని యుద్ధంలో ఎదుర్కొనగలవాడెవ్వడు?