దారువన విహారం

హరునిచే వరము పొంది ఆ పాంచాలికుడు సమస్త దేశాలలో పరిభ్రమించెను. కాలింజరానికి ఉత్తరాన, హిమవత్పర్వతానికి దక్షిణానగల పవిత్ర దేశంలో ఆయక్ష పుత్రుడు శివానుగ్రహం వల్ల పాంచాలికేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ముక్కంటి కూడ వింధ్య గిరికి పయనించెను. అయితే మదనుడాయన నచటకు గూడ వెంబడించి మరల ప్రహరించుటకు ఉద్యుక్తుడు కాగా హరుడచట నుండి పలాయి తుడయ్యెను. అట్లు పరుగిడి అనేకులు ఋషులకు తత్పత్నులకు ఆవాసమైన భయంకరమగు దారుకావనమున ప్రవేశించెను. అట్లు కామునిచే తరుమబడి తమ ఆశ్రమాలలో బ్రవేశించిన శివునిజూచి ఋషులు తమ తలలు వంచుకొనిరి. శివుడు వారలను భిక్షపెట్టుడని అడిగెను.

నారదా! అంతట ఋషులు మౌనంగా ఉండుట చూచి హరుడు వారల ఆశ్రమముల నంతట కలయదిరిగెను. అట్లు తిరుగుచున్న శివుని చూచి భార్గవ, ఆత్రేయ ఋషుల భార్యలందరు విమోహితలై నిగ్రహాన్ని కోల్పోయి కామార్తలై శివు డెచటకు పోయిన నచటకు వెంటబడి పోసాగిరి. అయితే పరమపతివ్రతలగు అరుంధతీ, అనసూయలు మాత్రము ఆ వికారమునకు లోనుగాకుండిరి. తమ ఆశ్రమాలు ఇండ్లు వదలి మదించిన ఏనుగు వెంబడించు ఆడ ఏనుగువలె పరమశివుని వెంట పరుగిడు తమ భార్యల చేష్టలు చూచి క్రోధోన్మత్తులైన అంగిరసాది ఋషులు శివుని లింగము నేలబడునట్లుగ శపించిరి. వెంటనే శివుని లింగము భూమిని బ్రద్ధలు చేయుచు నేలబడెను. అంతట త్రిశూలియగు శివుడంత ర్హితుడాయెను. అట్లు నేలబడిన లింగము భూమిని బ్రద్దలు చేసుకొని పాతాళానికి పైన బ్రహ్మాండాన్ని భేదించుకొని ఊర్ధ్వలోకాలకూ వ్యాపించెను. అంతట నదీనద సముద్ర పర్వతాలతో నిండిన భూగోళము కంపించెను. పాతాళాది భువనాలన్నీ ఘూర్లిల్లిపోయినవి, అట్లు సంక్షుభితాలయిన భువనాలను చూచి బ్రహ్మ విస్మితుడై క్షీరసాగరశాయి అయిన మాధవుని చూడబోయెను. అచట హృషీకేశుని చూచి భక్తితో స్తోత్రముచేసి, “ప్రభో! ఈ మహోపద్రవ మెట్టిది అని అడిగెను. అప్పుడు శ్రీహరి-విరించీ! మహర్షుల శాపకారణంగా ఈశ్వరుని లింగము ఊడివడినది. ఆ భారము వహించలేక భూమి కంపించి పోవుచున్నది అనెను. ఆ అద్భుతానికి విస్మితుడై బ్రహ్మ మనమచ్చటకు పోవుదమని విష్ణువును తొందర పెట్టెను. అంతట బ్రహ్మ విష్ణువులిద్దరు శివలింగము పడిన చోటుకు చేరిరి. తుద మొదలు కనుపించని ఆ లింగమును చూచినంతనే విష్ణువు గరుడునిపై నెక్కి ఆశ్చర్యంతో పాతాళానికి వెళ్ళిపోయెను. బ్రహ్మ పద్మ విమానాన్నెక్కి ఊర్ధ్వ లోకాలన్నీ గాలించాడు. కాని లింగపు కొన కనుగొనజాలక ఆశ్చర్య చకితుడై తిరిగి వచ్చాడు. అట్లే సప్త పాతాళాలను శోధించిన విష్ణువు కూడ లింగపు మొదలు కనుగొన జాలక తిరిగి వచ్చాడు. అంతట బ్రహ్మ విష్ణులిద్దరూ లింగమును సమీపించి చేతులు జోడించి ఆ మహాదేవుని