వామన మహా పురాణము
వేనుని కథ
మార్కండేయుడు ఇట్లనెను: మహామునీ! స్థాణుతీర్థమహిమ సమగ్రంగా వినగోరెదను. అచట సర్వపాపాలు పోగొట్టే సిద్ధిని ఎవరు పొందారు? అందులకు సనత్కుమారుడిలా చెప్పదొడగెను. ఓ మార్కండేయ మహర్షీ! అత్యుత్తమమైన నీస్థాణు తీర్థమహిమ సాకల్యంగా వినవలసినది. దీనిని వినిన నరుడు సకలపాప విముక్తుడౌతాడు. మహాప్రళయ సమయాన ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తంతా నశించిపోగా అవ్యక్త జన్ముడైన ఆ విష్ణుమూర్తి బొడ్డునుండి కమలం పుట్టింది. దాని నుండి సర్వలోక పితామహుడగు బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన నుండి మరీచి జన్మించగా ఆయన కుమారుడుగా కశ్యపుడు పుట్టాడు. కశ్యపునకు సూర్యుడు కలుగగా ఆయనకు మనువు జన్మించాడు. ఆ మనువు తుమ్మగా ఆయన ముఖం నుంచి ఉద్భవించిన పుత్రుడు చతురంత భూమండలాని కంతకూ రాజైనాడు. మృత్యు ముఖాన్నుంచి కాలుని కుమార్తెగా జనించి భయాన్ని కల్గించే “భయా” అనునామె ఆ రాజు భార్య అయినది. ఆమెకు దుష్టుడు వేదదూషకుడైన వేనుడు పుట్టాడు. ఆ దుష్టుని ముఖం చూచినంతనే కోపంతో తండ్రి అరణ్యానికి వెళ్లిపోయాడు. కాలుని దౌహిత్రుడైన వేనుడు భూమికంతా పాలకుడై తన మాతామహ దోషం వల్ల వేదనిందకుడై రాజ్యంలో యిలా చాటింపచేశాడు. “నా రాజ్యంలో ఎవరూ దానాలు యజ్ఞ యాగాలు చేయరాదు. ఆహుతులు వ్రేల్చరాదు. నేనొక్కడనే వందనీయుడను. నన్నుమాత్రమే అందరూ పూజించాలి. ఇలా చేసి నా రాజ్యంలోని మీరంతా సుఖించగలరు. నా కంటె వేరైన దేవుడెవడూ లేడు.” అతని వాక్యాలకు చింతించి ఋషులంతా కలిసివెళ్ళి ఇలా హితం పలికారు. రాజా! వేదాలు ధర్మానికి మూలమైన ప్రమాణాలు. అవి యజ్ఞ కర్మను విధించినవి. యజ్ఞాలు చేయకపోతే దేవతలు పైరులకు అవసరమైన వర్షాలు కురిపించరు. ఆ విధంగా ఈ సృష్టి అంతా దేవతలు యజ్ఞాలమీద ఆధారపడి యున్నది.
ఋషుల మాటలు విని కోపంతో పిచ్చివాడై, దురాత్ముడగు వేనుడు యజ్ఞాలు చేయరాదు. దానాలు ఇవ్వకూడదు అంటూ మాటిమాటికీ గర్జించాడు. దానితో ఆ మునులందరూ కోపించి అభిమంత్రించిన వక్రోపమాలైన కుశలతో నా దుష్టుని ప్రహరించి సంహరించారు. అంతట రాజులేని ప్రజలంతా, దస్యులు తమను పీడించగా నానా బాధలకులోనై ఘోషిస్తూ మహర్షులను శరణువేడుకున్నారు. అంతట నా ఋషులా వేనుని ఎడమచేతిని మథించగా దానినుంచి ఒక మరుగుజ్జు పుట్టాడు. వారంతట నతనితో నీవిక్కడ కూర్చోమని చెప్పారు. ఆ పొట్టివానినుండి వేనుడి పాపఫలంగా నిషాదులు జన్మించారు. అంతట ఋషులు ఆవేనుని కుడిచేతిని మధించారు. దానినుంచి సాలవృక్షమంత పొడవుగలిగి దివ్య లక్షణాలతో కూడిన పురుషు డుద్భవించాడు. అతని చేతులలో ధ్వజ ధనుర్బాణ శంఖ చక్రాది రేఖలున్నవి. ఆ పురుషుని చూచి ఇంద్రుడు మొదలయిన దేవతలందరు, పృథ్వీపాలకునిగా అతనికి అభిషేకం చేశారు. అతడు ధర్మాత్ముడై భూమిని రంజింపచేశాడు. తన తండ్రి పెట్టిన బాధలకు క్షోభించిన పృథివిని అతడు తనపాలనతో రంజింపజేసి ‘రాజు’ అనే శబ్దాన్ని సార్థకంగావించాడు. ప్రజల నుంచి రాజ్యం స్వీకరించిన తదుపరి అతనిలా ఆలోచనలో పడ్డాడు. నా తండ్రి అధార్మికుడు. యజ్ఞ విఘాతకుడు. ఆయనకు ఉత్తమలోక ప్రాప్తి ఎలా కలుగుతుంది? అలా చింతావ్యాకులుడైన రాజు వద్దకు నారదమహర్షి రాగా ఆ రాజు తగిన ఆసనంయిచ్చి నమస్కరించి ఇలా ప్రశ్నించాడు-భగవన్! తమరు సర్వజ్ఞులు. శుభాశుభ కర్మల రహస్యం తెలిసినవారు. నా తండ్రి దుష్టుడు, వేదనిందకుడు, విహితకర్మలు చేయకుండానే మరణించాడు. అంతట దివ్య దృష్టితో అంతా గ్రహించి నారదుడిలా అన్నాడు. రాజా! నీ తండ్రి క్షయ కుష్టు రోగాలతో మ్లేచ్చులలో జనించాడు. మహాత్ముడగు నారదుని మాటలువిని ఆ రాజు చాలా దుఃఖించి తాను ఏమి చేయవలెనా అని ఆలోచనలో దిగాడు. పుత్రుడనగా పితరులను భయాల నుంచి రక్షించువాడే నన్న భావం ఆయనకు తోచింది. అంతట మరల అమహామునిని తన తండ్రి తరించుటకు తానేమి చేయవలెనో వివరించమని వేడుకున్నాడు.
అపుడు నారదుడన్నాడు, నీవు తీర్థాలన్నింటిని దర్శించి అచట నీళ్ళతో ఈతని దేహాన్ని శుద్ధి చేయుము. వానిలో సన్నిహిత సరోవరం దగ్గర ఉన్న స్థాణు తీర్థానికి గూడ వెళ్లుము. నారద మహర్షి వచనాలు విని ఆ రాజు తన రాజ్య భారాన్ని మంత్రుల కప్పగించి తాను బయలు దేరాడు. అచట నుండి ఉత్తర భూములకు వెళ్ళి అక్కడ మ్లేచ్చుల మధ్య కుష్ఠు, క్షయ వ్యాధులతో బాధపడుతున్న తండ్రిని చూచి చాలా దుఃఖించి అ మ్లేచ్ఛులతో ఇలా “ఓ మ్లేచ్ఛులారా! నేనీ పురుషునకు నమస్కరించి, ఈయనను ఇంటికి తీసికొనిపోయి రోగ ముక్తుణ్ణి చేసుకుంటాను. మీరనుమతి నివ్వండి” అన్నాడు. అందులకా మ్లేచ్ఛులంతా ప్రణామంచేసి అలాగే మీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చని అన్నారు. అంతట ఆరాజు పల్లకీ బోయీలకు ఇబ్బడి కూలి ఇచ్చి తన తండ్రిని ఒక శిబికలో ఎక్కించుకుని ఇంటికి తీసుకొని పోయినాడు. బోయీలా దయామయుని కోర్కె మన్నించి ఆ శిబిక నెత్తుకొని త్వరితగతిని కురుక్షేత్రంలోని స్థాణు తీర్థం వద్ద దించి వెళ్ళిపోయారు.
అంతట ఆ రాజు మధ్యాహ్న కాలాన అతనిని నదిలో స్నానం చేయించాడు. ఆ సమయాన ఆకసాన్నుంచి వాయువేతెంచి ఇలా అన్నది. వత్సా! తొందర పడవద్దు. తీర్థ పవిత్రతను కాపాడుము. ఇతన్ని మహా ఘోరమైన పాపాలు చుట్టుకొని ఉన్నవి. వేదనింద అనే పాపానికి నిష్కృతి లేదు. అలాంటి దుష్టుడు స్నానం చేస్తే తీర్థ పవిత్రత నశించి పోతుంది. వాయువు మాటలు విని మరింతగా దుఃఖిస్తూ, అయ్యో! ఈయన ఎంతటి భయంకర పాపాలకు నెలవైనాడని విలపించాడు. ఈ పాప పరిహారాని కేదైనా ప్రాయశ్చిత్తం ఉంటే నేనది తప్పక చేయగలను. దయతో దేవతలు సెలవియ్యండి అని అర్థించాడు. అంతట దేవతలందరు ఇలా సలహాయిచ్చారు. నీవు వరసగా ఒక్కొక్క తీర్థంలో స్నానంచేసి ఆ నీళ్ళతో ఈతణ్ణి అభిషేకించుము. ఇలా ఓజన తీర్థం నుంచి సరస్వతి కావలనున్న చులుక తీర్థం వరకు చేయుము. శ్రద్ధాళువు లిలా తీర్థ స్నానం చేస్తే ముక్తులౌతారు. ఇక ఇతడో, అతి స్వార్థపరుడు, దేవదూషకుడు. బ్రాహ్మణులు ఇతణ్ణి పరిత్యజించారు. అంచేత పవిత్రుడు కానేరడు. కనుక ఇతని నుద్దేశించి నీవు తీర్థాలలో మునిగి ఆ నీటితో మార్జనం చేస్తే శుద్ధుడౌతాడు.
ఆ మాటలు విన్న ఆ రాజు ఆయన కొకకుటీర మచ్చట నిర్మించి అందతని నుంచి, తాను మనస్సులో తండ్రి ముక్తిని కాంక్షిస్తూ తీర్థాటనానికి బయలుదేరాడు. ప్రతిరోజూ అయా తీర్థాల్లో మునిగి అందలి పవిత్రోదకాలు తెచ్చి తండ్రి మీద ప్రోక్షణం చేసేవాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళ కచట కొక కుక్క వచ్చింది. అది పూర్వ జన్మలో స్థాణుమఠంలో కాలస్వామియొక్క ద్రవ్యరక్షణా బాధ్యత అప్పగించబడిన అధికారిగా ఉండేది. మొదట్లో దేవద్రవ్య రక్షణ, పరిగ్రహం, వినియోగం మొదలయిన విషయాలలో చాలా నిక్కచ్చిగా, పవిత్రంగా ఉంటూ అందరి మన్ననలకు పాత్రుడైన అధికారి. కాలాంతరంలో బుద్ధి చెడిపోయి దేవద్రవ్య నాశనానికి కారకుడైనాడు. ధర్మదూరుడై మరణించిన అతడు పరలోకానికి పోగా యముడాతనిని చూచి తత్ క్షణమే వెళ్ళి కుక్కవై జన్మించమని శిక్షించాడు. అతడు మరుక్షణం సౌగంధిక వనంలో శునక జన్మయెత్తి అనేక శునకాలతో కలిసి తిరుగసాగాడు. కొన్నాళ్ళ కొక ఆడకుక్క (సరమ) చేత అవమానం పొంది ఎంతగానో దుఃఖించాడు. ఆ ద్వైతవనాన్ని వదలి ఒంటరిగా పవిత్రమైన సంనిహిత్య సరోవరానికి పారిపోయాడు. అక్కడ స్థాణ్వీశ్వరుని దయవల్ల విపరీతమైన దాహం తీర్చుకోవడానికి సరస్వతీనదిలో మునిగాడు. దాహశాంతికి నీళ్లలో మునిగిన ఆ కుక్క సకల పాపాల నుంచి విముక్తి పొందింది. స్నానం చేయగానే కరకర ఆకలి వేయడంతో ఆహారాన్ని వెతుక్కుంటూ అది రాజు తండ్రి ఉన్న గుడిసెలో దూరింది. రాజా కుక్కనుచూచి భయంతో మెల్లగా తాకాడు. వెంటనే స్థాణు తీర్థంలో మునిగాడు. వెనకటి తీర్థంలో మునిగిన శరీరాన్ని ఆ కుక్క విదిలించు కొనగా అవిరాజుమీద పడినాయి. కుక్క వంటిమీది నీటి బిందువులు తన మీదపడగా ఆ రాజు భయపడినాడు. స్థాణుతీర్థ మహిమవల్ల అవిధంగా కుమారుని మూలాన ఆయన తరించాడు. వెంటనే ఇంద్రియ జయంకలిగి దివ్యశరీరాన్ని పొందాడు. అంత మహానందంతో ఆ వేనుడు ప్రణమిల్లి స్థాణు భగవానుని స్తోత్రం చేయసాగాడు.