వామన మహా పురాణము
పార్వతి కళ్యాణ వృత్తాంతము
అందులకు సంతుష్టులై పితృదేవతలు కుమారులకు హిమవంతునితో వివాహానికై తన కుమార్తె మేనాదేవిని అప్పగించారు. దేవతల ప్రసాద రూపంలో ఆ మేనాదేవిని స్వీకరించి ఆమెతో ఇష్టసుఖాలు అనుభవించాడు. ఆ మేనాదేవి ఆ శైలాధిపతికి దేవకన్యలతో సమానులైన ముగ్గురు అందమైన కుమార్తెలను కని యిచ్చినది.
పులస్త్యుడు చెప్పసాగాడు, ఆ మేనాదేవి గుణసంపన్నురాలయిన కుమార్తెలు మువ్వురను సునాభుడిగా పేరొందిన పుత్రుని ఒకనిని కనినది. వారలలో ఎర్రని కాంతిని కలిగి ఎర్రని నేత్రాలతో ఎర్రని వస్త్రాలు ధరించిన రాగిణియను పుత్రిక జ్యేష్ఠురాలు. ఓ మునీ! తామరాకుల్లాంటి నేత్రాలతో తెల్లని అంగకాంతితో నల్లని నొక్కుల జుట్టుతో తెల్లని వస్త్రాలు ధరించి పుట్టిన కుటిల రెండవది. నల్లని దేహకాంతితో నల్ల కమలాలు బోలిన కండ్లతో చక్కని పిరుదులతో సాటిలేని అందంతో పుట్టిన మూడవ కుమార్తె కాళీ. పుట్టిన ఆరేండ్ల తర్వాత ఆ ముగ్గురు బాలికలు తపస్సు చేయసాగారు. ఆ సుందరాంగులను దేవతలు చూచారు. చంద్రకిరణాల శోభతో వెలిగే కుటిలయను కన్యను ఆదిత్య వసువులు దేవలోకానికి గొనిపోయి బ్రహ్మకు చూపించి ప్రభూ! ఈమె మహిషాసురుని చంపగల పుత్రుని కనగలదా చెప్పుడన్నారు. అందుకు బ్రహ్మ ఈ తపస్విని శివవీర్యాన్ని ధరించ జాలదు. కనుక ఈ చిన్నదానిని వదలిపెట్టండి అని చెప్పాడు. బ్రహ్మ మాటలకు కోపించిన ఆ కుటిల ఓ నారదా! బ్రహ్మతో-భగవన్! నేను జనార్దనుని గూర్చి తీవ్రమైన తపస్సుచేసి శివవీర్యం ధరించగల శక్తి సంపాదించి శివుని పాదా క్రాంతుని చేసుకోగలను. అందుకు తీవ్రంగా ప్రయత్నించగలననెను. అది వినికోపించిన విరించి, ధూర్తయైన కుటిలతో ఇలా అన్నాడు.
బ్రహ్మ వచనం-పాపిష్ఠవైన కుటిలా! నాహిత వచనాన్ని ధిక్కరించినందుకు నిన్ను నా శాపాగ్నితో దహించివేస్తాను. నీవు ఈ క్షణమే నీరుగా మారిపోతావు. అలా నా బ్రహ్మ శాపానికి గురియై ఆ కుటిల నీరుగామారి బ్రహ్మలోకాన్ని ముంచివేయబోగా నా పితామహుడు ఋగ్యజుస్సా మాథర్వణ వేదాలతో నామెను గట్టిగా బంధించాడు. ఆమెయు అక్కడే బ్రహ్మదేవుని జటా మండలాన్ని తడుపుతూ ఉండిపోయింది. అంతట రాగిణియను బాలికను గూడ దేవతలు బ్రహ్మకడకు గొనిపోగా ఆయన ఆ బాలికగూడ శివవీర్య ధారణ కనర్హురాలన్నాడు. ఆమె కూడ బ్రహ్మతో వివాదపడి ఆయన శాపానికి గురియై సంధ్యగా నాటి నుండీ పిలువబడుతోంది. పర్వతం మీద కృత్తికగా గుర్తింపబడుతూంది. అలా తన కుమార్తె లిర్వురు చేతినుండి జారిపోవుట చూచిన మేనాదేవి మూడవ కుమార్తె కాళిని చూచి, “ఉ-మా” అమ్మా నీవు తపస్సు జేయవద్దని వారించింది. ఆనాటి నుండీ ఆ తల్లి ఆ బిడ్డను “ఉమా” అనే సంబోధించసాగింది. అంతట ఆ “ఉమ” అడవికి వెళ్ళి పోయి, అక్కడ తన మనస్సులో శూలపాణి, వృషభ కేతనుడు మహాదేవుడైన రుద్రుని సంధానించుకొని ఘోరమైన తపోదీక్షలో మునిగిపోయెను. అంతట బ్రహ్మ మరల హిమగిరి పుత్రికయైన ఆ కాళిని గొనితెమ్మని దేవతలను పంపగా ఆమె తపోగ్నికి భయపడి ఆమె దగ్గరకు కూడ వెళ్ళలేక పోయారు. ఆమె ముందర ఇంద్రుడు కూడ తన తేజస్సు కోల్పోయి అమె తేజస్సు బ్రహ్మతేజాన్ని గూడ మించినదని వక్కాణించాడు. అది విని బ్రహ్మ మిమ్ములనందరను తన తేజస్సుతో నిర్జించిన ఆ బాలికయే శంకరుని అర్ధాంగి. ఇది తథ్యం. కనుక యిక మీరు మీచింతలుమాని మీమీ నెలవులకు పొండ”ని ఆదేశించాడు. బ్రహ్మ వచనాలకు సంతసించి ఇంద్రాదిసురలు భయాందోళనలు వదలి తమతమ ఇండ్లకు వెళ్ళి పోయారు.
అంతట తపస్సు చేస్తున్న ఉమను కూడ పర్వతేశ్వరుడు వారించి భార్యతోవెళ్ళి ఇంటికి తీసికెళ్ళాడు. ఆ దినాలలో శంకరుడు నిరాశ్రయమనే కఠోర తపస్సులో మునిగి మేరువు మొదలయిన మహా శైలాల్లో తిరుగసాగాడు. అలా తిరుగుతూ ఒకసారి హిమవంతానికి రాగా హిమవంతుడు యథావిధిగా పూజించాడు. ఆ రాత్రి శివుడచటనే ఉండిపోయాడు. మర్నాడు హిమవంతు డాయనను ఆహ్వానించి తపస్సు సమయమంతా తనవద్దనే గడపమని అర్థించాడు. పర్వతేశ్వరుని ప్రార్థన మన్నించి హరుడు అచటనే ఉండ నిశ్చయించి తన నిరాశ్రయ వ్రతాన్ని వదలి అచటే నిలిచాడు. అచట ఒక ఆశ్రమంలో శూలపాణి యుండగా గిరికన్యకాళి తన సఖులతో కలిసి అచటకు వెళ్ళింది. వచ్చిన గిరికన్యను మరల జన్మించిన తన భార్య సతీదేవిగా గుర్తించిన శివుడామెకు స్వాగతంపలికి మరల తపస్సులో మునిగిపోయాడు. అంతట ఆ కాళి చేతులు జోడించుకుని సఖీ సమేతగా నా హరుని పాదములకు మ్రొక్కెను. అంత ఆ గిరికన్యను చాలాసేపు తదేక దృష్టితో చూచి శివుడు అలా చేయుట యుక్తంకాదని పలుకుచూ గణాలతో సహా అంతర్హితుడయ్యాడు. జ్ఞాన సంపన్నురాలయిన ఉమ శివుని ఆ తీవ్రవచనాలు విని దుఃఖించి తండ్రి వద్దకు వెళ్ళి ఇలా అన్నది. “తండ్రీ! పినాకపాణి, మహాదేవుడు శంకరుని అరాధించుటకై నేను మహారణ్యానికి వెళ్తాను.” అందులకు తండ్రి సమ్మతించగా, నా హిమవత్పర్వత మూలాన్నే లలిత అనే పేరుతో ఘోర తపస్సు చేయసాగింది. ఆమె సఖులు కంద మూలఫలాలు సమిధలు కుశలుతెచ్చి ఆమెకు సపర్యలు చేయసాగారు. పార్వతి వినోదానికై వారలు శూలపాణి శివుని మట్టి బొమ్మను అందంగా చేసి చూపారు. తేజోవంతమైన ఆ బొమ్మనుచూచి ఆమె ఆనందించి సఖులను దీవించెను. పూజా సమయాల్లో మాటిమాటికీ ఆ విగ్రహాన్నే చూస్తూ ఆరాధించేది. ఈ విషయాన్ని కనిపెట్టిన ఆ త్రిపురాంతకుడు సంతోషించి, పలాశదండం, ముంజమేఖల, కృష్ణాజినం కమండలువు ధరించి భస్మాంకిత విగ్రహంతో బ్రహ్మచారి వేషంలో పర్యటిస్తూ ఆమె ఆశ్రమానికి చేరాడు, నారదా! అలావచ్చిన హరునిచూచి ఆ కాళి సఖులతో లేచి స్వాగతం పలికి యథావిధిగా అతిథి మర్యాదలు చేసి ఇలా ప్రశ్నవేసింది.
ఉమ ఇలా అన్నది, ఓ భిక్షూ! మీరెచట నుండి వస్తున్నారు? మీ ఆశ్రమ మెక్కడ? ఎక్కడకు వెళ్ళుచున్నారు. త్వరగా చెప్పండి. అందులకా భిక్షు విట్లు చెప్పాడు. “ఓ సుందరీ! నా ఆశ్రమం వారణాసిలో ఉన్నది. దారిలో తీర్థయాత్రలు చేసుకుంటూ పృథూదక తీర్థానికి వెళ్తున్నాను.” అందులకా దేవి ఓ బ్రాహ్మణోత్తమా! పృథూదకంలో ఏమి పుణ్యమార్జించావు. దారిలో స్నానంచేసిన తీర్థాల ఫలమెట్టిది? అందులకా భిక్షువు ఇలా చెప్పాడు. మొట్టమొదట తీర్థ రాజం ప్రయాగలో స్నానం చేశాను. తర్వాత పవిత్రాలైన కుబ్జామ్రం, జయంతం, చండికేశ్వరం, బంధువృందం, కుర్కంధం, కనఖలం, అగ్నికుండం, భద్రా త్రివిష్టపం, కోనటం, కోటితీర్థం, కుబ్జకతీర్థాలలో స్నానంచేశాను. ఓ పవిత్రురాలా! నేనెలాంటి కోరికలేకుండానే ఈ తీర్థాలను సేవించి నీ ఆశ్రమానికి చేరాను. ఇక్కడ ఉండి నీతో మాటాడి తర్వాత పృథూదకానికి వెళ్ళగలను. నీవు కోపపడకపోతే ఒక విషయం అడుగుతాను. నేను చిన్నతనాన్నుంచీ ఇంద్రియాలను నిగ్రహించి తపస్సువల్ల శరీరాన్ని కృశింపచేసుకున్నానంటే, అందుకు బ్రాహ్మణుడనుగా నేను తగియున్నాను. అది నాయెడ శ్లాఘ్యమే. కాని నీవు ఈ చిన్నవయసునందే ఇంతటి కఠోరతపస్సు ఎందుకు పూనుకున్నావా? అని శంక కలుగుతున్న ఓసుందరీ! యౌవన దశలో స్త్రీలు భర్తలతోకలిసి చక్కని భోగాలు అనుభవిస్తారు. చరాచర జీవులు, అందం, పవిత్రత, ఐశ్వర్యాదులు కాంక్షించి తపస్సు చేస్తుంటారు. అయితే నీకు వాని లోటులేదు. అన్నింటిలో నీవు సంపన్నవు. మరి ఏ కారణంవల్ల ఇలా సర్వాలంకారాలు వదలి జటాధారిణిపై పట్టు చీరెలకు బదులు నారచీరలు ధరించి తపిస్తున్నావు? బ్రహ్మచారి మాటలకు ఉమాదేవి సోమప్రభ అనే చెలికత్తె ద్వారా భిక్షువుకు ఓనారదా! బదులు చెప్పింది. “ఓవిప్రేంద్రా! ఈనాసఖి కాళి పరమ శివుడగు హరుని భర్తగా పొందుటకై ఇలా తపస్సు చేస్తున్నది.” ఆ సోమప్రభ మాట విని, బ్రహ్మచారి శిరః కంపనంచేసి పకపకా నవ్వుతూ ఇలా అన్నాడు. ఓ పార్వతీ! నీకీ సలహా ఎవడిచ్చాడని అడుగుతున్నాను. చిగురుటాకులను వెక్కిందించే నీ మెత్తటి చేతులెక్కడ? వీటితో ఆ పాములచేతివాడి కరగ్రహణం ఎలా చేస్తావు? నీవో చీనిచీనాంబరాలు ధరిస్తావు. అతడో పులితోలు కప్పుకునే రుద్రుడు (భయంకరుడు). నీవు చందన లేపనంచేసుకుంటే అతడు బూడిద పూసుకుంటాడు. ఈ సంబంధం నాకేమాత్రం నచ్చలేదు!
పులస్త్యుడన్నాడు: అలా మాటాడుతున్న భిక్షువును వారిస్తూ పార్వతి “అలా అనగూడదు. హరుడు, ఓ భిక్షూ! సర్వ గుణాల్లో సర్వాధికుడు! అప్రభుడు మంగళరూపి కానీ భయంకరాకారుడు కానీ, ధనవంతుడుగానీ, దరిద్రుడు కానీ, సర్వాలంకారుడు కానీ, దిగంబరుడు కానీ ఆయనే నా భర్తకాగలడు! ఓ శశిప్రభా! ఈతని పెదవులు కదలుచున్నవి. ఇంకా ఏమో వదరబోతున్నా డీతనిని ఆపండి. ఇతరులను నిందించే వానికన్నా ఆనిందను వినే వారలు ఎక్కువ పాపం మూటగట్టుకుంటారు” అని తన నిశ్చయం వెల్లడిచేసినది. అలాపలికి అచటనుండి లేచిపోవ నుద్యమించిన ఆ వరదాయిని ఎదుట శివుడు తన నిజరూపంతో నిలచి ఇలా అన్నాడు. “ప్రియురాలా! సుఖంగా ఇంటికి వెళ్ళిపో, నేను త్వరలోనే నిన్ను పొందుటకై మహర్షులను నీ తండ్రి ఇంటికి పంపుతాను. నీవు పూజించిన ఈ మృణ్మయ వంకర ప్రతిమ నేటి నుండీ భద్రేశ్వరుడుగా లోకంలో ప్రసిద్ధమౌతుంది. దీనిని దేవదానవ గంధర్వ యక్షకింపురుష నాగమనుష్యాదులు పూజించి శుభాలు పొందుతారు.” హరుని మాటలకు అలరిన ఆ గిరికన్య వెంటనే ఆకాశమార్గాన తన నెలవుకు వెళ్ళిపోయినది. మహాతేజస్వీ అయిన శంకరుడు హిమవత్పుత్రిని వదలి పృథూదక క్షేత్రానికి వెళ్ళి యథావిధిగా స్నానం చేశాడు. అలా పృథూదక స్నానంతో పవిత్రుడై నందీశ్వరుడు మొదలగు గణాలతో కూడికొని ముందర మహాశైలానికి తరలివెళ్లాడు. అనంతరం ప్రమథగణాలు సప్తర్షులతో కలిసి తన ఇంటి కేతెంచిన ఆ త్రిపుర సంహరుని చూచి హర్ష సంభ్రమాశ్చర్యాలతో పులకించి ఆ నగాధిరాజు, ఆ దేవునికి స్వాగతం పలికి, కందమూల ఫలాలు దివ్యజలాలు సుగంధిత కుసుమాదులతో వారల నందరను ఘనంగా పూజించాడు.