వామన మహా పురాణము
విష్ణు పంజరస్తోత్రం
“ఓ పద్మనాభా! పద్మావతీ! మహాద్యుతీ! నీకు నమస్కారము! వికసించిన తామర రేకుల వంటి కన్నులవాడా! నీవేవిధంగా పరిపూర్ణుడవై సర్వత్రా నిండియున్నావో అలాగే నేను ఆచరించు ధర్మార్థ కామమోక్షాలు, అఖండంగా పరిపూర్ణత్వాన్ని కలిగియుండునట్లు అనుగ్రహించుము కేశవా!” ఈ విధంగా ఉపవాసియై ఇంద్రియ నిగ్రహంతో ఆ సంవత్సర వ్రతం నిర్వహిస్తే గృహస్తు సర్వ విషయాలలోను పూర్ణత్వాన్ని సిద్ధింప చేసుకుంటాడు. ఈవిధంగా వ్రతమాచరించినచో దేవతలందరు సంతోషించెదరు. అలాంటి వ్రతం చేసిన వానికి చతుర్విధ పురుషార్థాలు పూర్ణంగా సిద్ధిస్తాయి, నారదా! అర్థార్థులైన వారలకు నిర్ణయించబడిన వ్రతాలను నీ ఎరిగించితిని. ఇక సర్వమంగళకరమైన విష్ణుపంజర స్తోత్రం వినిపించెదను.
గోవిందా! నీకు నమస్కారం. నీకు శరణాగతుడను. సుదర్శన చక్రం ధరించి విష్ణా! నీవు నన్ను తూర్పున రక్షించుము. అమిత తేజస్వియైన పద్మనాభా! కౌమోదకి గదను ధరించి నన్ను దక్షిణ దిశన రక్షించుము. విష్ణో! నీకు శరణాగతుడను. నీకు నమస్కారము. పురుషోత్తమా! నమస్కారము. సౌనందహలాన్ని ధరించిన విష్ణూ! పశ్చిమ దిక్కున నన్ను రక్షించుము. నీకు శరణాగతుడను! పుండరీకాక్ష! ఉత్తమమైన నీ ముసలాయుధంతో ఉత్తరాన నన్ను రక్షింపుము. జగన్నాథా! నీకు శరణాగతుడను. ఓ రాక్షస నాశకా! శార్‌ఙ్గ ధనుస్సును నారాయణాస్త్రాన్నీ ధరించి నన్ను ఈశాన్య దిశన రక్షింపుము. నీకు శరణాగతుడను. ఓ విష్ణూ యజ్ఞ పురుషా! పాంచజన్య శంఖాన్ని అంతర్బోధ్య కమలాన్ని ధరించి నన్ను ఆగ్నేయ దిక్కున రక్షింపుము. ఓ నరసింహ ప్రభూ! దివ్యమూర్తీ! సూర్యశతమనే డాలును చంద్రమస ఖడ్గాన్ని ధరించి నైరృతి దిక్కున నన్ను రక్షింపుము. వైజయంతీమాలను శ్రీవత్సాంకాన్ని ధరించిన ఓ హయగ్రీవ ప్రభూ! వాయవ్య దిశన నన్ను రక్షించుము. నీకు నమస్కారము. జనార్దనా! గరుడ వాహనారూఢుడవై నన్ను అంతరిక్షంలో రక్షింపుము. అజితా అపరాజితా! నీకు సదా నమస్సులు! విశాలాక్షాన్ని అధిరోహించిన నన్ను పాతాళంలో రక్షించుము! అకూపారా! మహామోహ! నీకు నమస్కారము! అష్టబాహు పంజర రూపాన నా శరీరంలోని చేతులు, తల, పాదాలు, మడమలు మొదలగు వానిని రక్షింపుము. పురుషోత్తమ దేవా! నీకు నమస్కారము! ఈ విధంగా ఈ విష్ణు పంజర స్తోత్రం పూర్వం శివుడు రక్ష కొరకై కాత్యాయనికి చెప్పాడు. ఓ బ్రాహ్మణోత్తమా! దీని ప్రభావం వల్ల ఆ మహాదేవి మహిషాసురునీ, నమరుడు, రక్తబీజుడు తదితరులెందరో దానవులను, సురకంటకులను నాశనం గావించింది.