వామన మహా పురాణము
చతుస్సముద్ర తీర్థం - ఇతర తీర్థాలు
లోమహర్షణుడన్నాడు, ప్రాచీన కాలంలో దర్వి నాలుగు సముద్రాలను వెలయించాడు. వానిలో ఒక్కొక్కదానిలో స్నానంచేసిన వానికి గోసహస్ర దానఫలం లభిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తములారా! ఆ తీర్థాలలో చేసిన తపస్సు ఎంత స్వల్పమైనను ఎంతటి దుష్టుడు చేసిననూ పరిపూర్ణ మవుతుంది. అక్కడే శతసాహస్రిక శతికతీర్థాలు కూడా ఉన్నవి. ఆరెంటిలో స్నానం చేస్తే వేయి ఆవులు దానం చేసిన ఫలం దక్కుతుంది. అక్కడే సరస్వతీ తీరాన ఉన్న సోమతీర్థంలో మునిగిన వాడు రాజసూయ యాగఫలం పొందుతాడు. రేణుకాశ్రమాన్ని సేవించిన శ్రద్ధాళువు జితేంద్రియుడు మాతృసేవ చేసిన ఫలం పొందగలడు. బ్రహ్మసేవితమైన ఋణమోచన క్షేత్రాటనం చేసిన పుణ్యుడు దేవర్షి పితృ ఋణాలనుండి ముక్తుడౌతాడు. ఓజస తీర్థంగా వినుతిగాంచిన కుమారాభిషేక తీర్థాన మునిగినవాడు యశస్వి అవుతాడు. అచ్చట శ్రాద్ధ మొనరించినచో కుమారపుర ప్రాప్తి కలుగుతుంది. అక్కడ చైత్రశుద్ధ షష్ఠినాడొనర్చిన శ్రాద్ధం గయాశ్రాద్ధ ఫలం ఇస్తుంది. అంతేకాదు. సన్నిహితక్షేత్రంలో సూర్యగ్రహణవేళ చేసిన శ్రాద్ధఫలం గూడ లభిస్తుంది. సందేహం లేదు. ఓజస క్షేత్రంలో చేసిన శ్రాద్ధం. అక్షయ ఫలమిస్తుందని పూర్వం వాయు దేవుడు చెప్పాడు. కనుక ఎలాగైనా ప్రయత్నించి అక్కడ చైత్రషష్ఠినాడు చేసిన స్నానం పితరులకు అక్షయమైన ఉదక ప్రాప్తి కలుగజేస్తుంది.
అక్కడ ముల్లోకాల్లో ఖ్యాతిగాంచి యోగమూర్తియైన మహాదేవ నివాసమైన పంచవట తీర్థముంది. అక్కడ స్నానంచేసి మహేశ్వరుని అర్చించినచో గాణపత్యం సిద్ధించి దేవతలతో కలిసి సుఖిస్తాడు నరుడు. ఓ బ్రాహ్మణోత్తములారా! అక్కడే భూమిదున్నుటకై కురురాజు ఘోర తపస్సు చేసిన కురుతీర్థం ఉంది. ఆయన చేసిన ఉగ్రతపస్సుకు సంతోషించి రాజర్షీ! నీ తపస్సుకు సంతోషించాను. ఈ కురుక్షేత్రంలో ఇంద్రయాగం చేసినవారు పాపరహితము లయిన సుకృత లోకాలను పొందుతారన్నాడు. అంతట నవ్వుతూ ఆ ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు. అలాగే ఇంద్రుడు నవ్వుతూ మాటిమాటికి వస్తూ వెళ్తూ కురుతో మాట్లాడుతూ గడిపాడు. చివరకు తీవ్రమైన తపస్సుచేసి కురు తనదేహం పవిత్రంగావించుకొనగా ఇంద్రుడు సంతోషంతో వచ్చి నీకేం కావలెనో కోరుకొనుమని ప్రేమతో అడిగాడు. అప్పుడు కురు విలా అన్నాడు. “ఈ తీర్థంలో శ్రద్ధా భక్తులతో నివసించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి కలగాలి. ఈ తీర్థంలో స్నానం చేసిన వారలెక్కడ ఏపాపాలు చేసినా పంచపాతకాలు చేసినాసరే, ముక్తులై పరమపదం పొంద వలెను.” కురుక్షేత్రంలోని తీర్థాలన్నింటిలో కురుతీర్థం పవిత్రమైనది. బ్రాహ్మణులారా! దాని దర్శన మాత్రాన్నే పాపముక్తులై పరమపదం పొందుతారు. కురుతీర్థంలో స్నానంచేసినవాడు ముక్తపాపుడై కురువు అనుగ్రహంతో పరమపదం పొందుతాడు.
తర్వాత శివ ద్వారంలో ఉన్న స్వర్గద్వారానికి వెళ్ళాలి. అక్కడ శివద్వారంలో స్నానంచేస్తే పరమ పదం లభిస్తుంది. అచటనుంచి ముల్లోకాల్లో పేరొందిన అనరకతీర్థాన్ని చేరుకోవాలి. అక్కడ తూర్పుదిక్కున బ్రహ్మ దక్షిణాన మహేశ్వరుడు, పశ్చిమాన రుద్రపత్ని, ఉత్తరంగా పద్మ నాభుడు అంటారు. మధ్యభాగాన అనరకమనే దుర్లభమైన తీర్థం ఉంది. అక్కడ స్నానంచేస్తే మహాపాతక ఉపపాతకాలన్నీ పోతాయి. వైశాఖ షష్ఠి మంగళవారం నాడచట స్నానంచేసి పాప విముక్తులు కాగలరు. అక్కడ నాలుగుపాత్రలలో అన్నము, అప్పాలతో నింపిన కలశాన్ని దేవతలకు ప్రీతిగా సమర్పించాలి. సర్వపాపనాశనానికి కలశదానంచేయాలి. ఈ విధంగా ఎవరు స్నానం చేస్తారో వారు సర్వపాపముక్తులై పరమ పదానికి వెళ్తారు. షష్ఠితో కూడిన మంగళవారంరోజున యితరత్రా కూడ ఈ విధంగాచేస్తే ముక్తి లభిస్తుంది. ఓ బ్రాహ్మణులారా! తీర్థాల్లో ఉత్తమమైన ఈ తీర్థంలో స్నానంచేసిన నరుడు సర్వదేవానుమతుడై పరమపదం పొందుతాడు. పుణ్యదాయి అయిన కామ్యక వనంలో ప్రవేశించినంతనే సర్వపాతకాలు నశించి మానవుడు ముక్తి పొందుతాడు. ఆ వనంలో సూర్యుడు పురుషుడనే పేరుతో విరాజిల్లుతున్నాడు. ఆయనను దర్శించి నంతనే ముక్తి కలుగుతుంది. ఆదివారంనాడచట స్నానంచేయు నరుడు విశుద్ధదేహుడై మనో రథాలన్నీ సఫలంగావించు కుంటాడు.