వామన మహా పురాణము
శేషపాప లక్షణాలు
ఇక శేషపాపాల లక్షణం చెబుతా విను. దేవతలకు ఋషులకు పితరులకు, విశేషించి మనుష్యులకు ఋణపడటం సర్వవర్ణ సాంకర్యం, ప్రణవ (ఓం) విసర్జనం, పాపకర్మిత్వం, మత్స్య భక్షణం, ఇతరులతో నిషిద్ధమైన మైథునకర్మ, నేయి విక్రయించడం, చండాలుర పరిగ్రహణము, తన దోషాలు కప్పిపెట్టుకొనుట, యితరుల దోషాలు బయట పెట్టుట, మాత్సర్యం, దుష్టభూషణం, క్రూరత్వం, టాకిత్వం (దుష్టుల పేర్లు ఉచ్చరించుట), తాళవాదిత్వం (దుష్టులతో మాటాడినందున వచ్చే పాపం) ఇలాంటి వాచాదోషాలు, అధార్మికత్వం దారుణత్వం, ఇవన్నీ నరకకారకాలయిన పాపాలు. ఈ పాపాలలో మునిగిన వాడు శంకరుని ప్రసన్నుని చేసుకున్నచో శంకరుడు అశేషజ్ఞానమూర్తి అగుటచే, ఓ ధర్మపుత్రా! శారీరికవాచిక, మానసికాలై, ఆ జన్మలో మాతాపితలు, సోదరబాంధవ ఆశ్రితులయిన వారెల్లరు కావించిన పాపాలుకూడా సర్వం, పుత్ర శిష్యుల ద్వారా పోగొట్టు కోవచ్చు. సుతులు శిష్యులు అందు సమర్థులు. అందుకు విపరీతంగా జరిగితే ఫలితాలు కూడ విపరీతంగా సంభవిస్తాయి. కాబట్టి ఓ సాధ్యా! జ్ఞాని అయినవాడు పుత్రులను శిష్యులను కలిగిఉండాలి. దీని ఆంతర్యం గ్రహించినచో శిష్యునికన్న పుత్రుడే శ్రేష్ఠుడని తెలుసు. పుత్రుడు సర్వపాపాలనుండి రక్షిస్తే శిష్యుడు శేషించిన పాపాల నుండి మాత్రమే కాపాడతాడు. పులస్త్యుడిలా అన్నాడు. నారదా! తపోధనుడైన ఆ సాధ్యుడు పితామహుని మాటల కలరి ప్రభూ! నేను ముమ్మాటికీ మీకు పుత్రుణ్ణి. దయచేసి నాకు యోగం తెలియ చేయండి అన్నారు. సనత్కుమారుని మాటలు విని పరమేష్ఠి - వత్సా! నీ తల్లి దండ్రులు నిన్ను నా కొసగినచో నీవునాకు పుత్రుడవు అవుతావనగా ఆ సాధ్యుడు దేవా దాయాదుడనగా ఎవరో ఆ పద్ధతి నాకు తెలుపమని అర్థించాడు. అంతట ఓ నారదా! పితామహుడు నవ్వి వత్సా! విను మని ఆ సాధ్యునితో ఇలా చెప్పాడు.
ఔరసుడు క్షేత్రజుడు దత్తుడు కృత్రిముడు గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు అని దాయాదులు ఆరు రకాలు. ఈ ఆరుగురకు ఋణ, పిండ, ధన, క్రియ, గోత్ర సామ్యం, కులవృత్తి, ప్రతిష్టలనేవి తల్లిదండ్రుల నుంచి సహజంగా సంక్రమిస్తాయి. వీరుగాక కానీసుడు, సహోఢుడు, క్రీతుడు, పునర్భవుడు, స్వయందత్తుడు పారశపుడనే అరురకాల దాయాదులున్నారు. అయితే వీరలకు మాత్రం ఋణ పిండ దాన క్రియా గోత్ర, కులవృత్తి ప్రతిష్ఠలనేవి సంక్రమించవు. వీరు పేరుకు మాత్రం పుత్రులే కాని కులగోత్ర సంభవులు కారు. బ్రహ్మ మాటలు విని సనత్కు మారుడు భగవాన్! వీరల తారతమ్యం విశేషాదులు దయతో చెప్పుమని అర్థించగా నా బ్రహ్మ ఇలా చెప్పాడు. పుత్రా! తనవల్ల తనభార్యకు కలిగినవాడు ఔరసపుత్రుడు. అతడు తండ్రికి ప్రతిరూపమైన వాడు. నపుంసకుడు లేక వ్యసనాలకులోనై దుర్బలుడైన భర్త అనుమతితో భార్య మరొకరి ద్వారా కనిన పుత్రుడు క్షేత్రజ్ఞుడు. తల్లిదండ్రులచే దత్తుగా ఇవ్వబడిన వాడు దత్తుడు. మిత్రుడిచ్చిన వాడు కాని మిత్రుని పుత్రుడుగాని క్రీతులని పెద్దలు నిర్ణయించారు. ఏ ఇంట ఎవనికి పుట్టినవాడో తెలియనివాడు గూఢకు డనబడతాడు. లేక బయటనుంచి తెచ్చి పెంచుకో బడినవాడు స్వయందత్తుడు. పెండ్లికి ముందు కన్యకు పుట్టినవాడు కానీనుడు. వివాహానికి పూర్వమే గర్భవతి అయిన భార్యకు కలిగినవాడు సహోఢుడు. మూల్యం చెల్లించి తెచ్చుకున్నచో వాడు క్రీతుడు. రెండు లక్షణాలు గలవాడు పునర్భవుడు అనగా ఒకరికిచ్చిన కన్యను బలాత్కారంగా అపహరించి తెచ్చి వివాహమాడిన తర్వాత పుట్టినవాడిని పునర్భవు ఉంటారు. కరువు కాటకాల్లో ఆకలితో అల్లాడుతూకాని ఇతర విపరీత పరిస్థితుల్లో కాని వచ్చి తన్ను తాను అర్పించుకునేవాడు స్వయందత్తుడు. బ్రాహ్మణునకు శూద్రాంగనవల్ల కలిగినవాడు పాఠశవుడు. ఈ కారణాలవల్ల ఓవత్సా! నీమాటమీద నిన్ను నేను పుత్రునిగా తీసుకోజాలను. కావున త్వరగా వెళ్ళి నీ తల్లిదండ్రులను పిలచికొని రమ్ము. నారదా! వెంటనే నాసాధ్యుడు తన తల్లిదండ్రులను స్మరించిన మాత్రాన్నే వారలు అచ్చటకు వచ్చిచేరారు. అలావచ్చిన ధర్ముడు అహింసాదేవి పరమేష్ఠికి ప్రణామంచేసి కూర్చున్నారు. అలా సుఖాసీనులైన తల్లిదండ్రులను చూచి సనత్కుమారుడిలా అన్నాడు.
తండ్రీ! యోగవిద్యను గ్రహించాలని నేను పరమేష్టి బ్రహ్మను అర్థిస్తే ఆయన నన్ను తన పుత్రుని కమ్మనినాడు. కనుక మీరలు నన్ను ఆయనకు ఇవ్వగలరు. కుమారుని మాటలు విని ఆ ధర్మాహింసలు పితామహునితో భగవాన్! ఈనాటి నుండీ మా ఈ కుమారుడు నీ పుత్రుడు కాగలడు అని వెంటనే తాము వచ్చిన చోటికాదంపతులు వెళ్ళి పోయారు. అంత పితామహుడు వినయభూషణుడైన ఆ సాధ్యపుత్రుడు సనత్కుమారునకు ద్వాదశపత్రక యోగం ఉపదేశించాడు. శిఖమీద ఓంకారం ఉంటుంది. దాని తలమీద మేషరాశి ఉంటుంది. దీనికి మాసం వైశాఖం. ఇది ప్రథమ పత్రకం. ముఖం మీద ‘న’ కారం, వృషభరాశి జ్యేష్ట మాసంతో కూడినది రెండవ పత్రకం. రెండు భుజాల మీద ‘మో’ కారం, మిథునరాశి ఆషాఢమాస యుక్త మైనది మూడవ పత్రకం. రెండు నేత్రాలమీద ‘భ’ కారం కర్కట రాశితో శ్రావణ మాసంతో కూడి ఉంటుంది. ఇది చతుర్థ పత్రకం. హృదయ దేశాన ‘గ’ కారంతో సింహరాశితో భాద్రపద మాసంతో యుక్తమై ఉంటుంది. ఇది పంచమ పత్రకం. ‘వ’ కారం కవచ నిష్టమై కన్యారాశితో అశ్వయుజ మాసంతో కూడి ఉంటుంది. అది అరవ పత్రకం. బ్రహ్మ అస్త్ర సమూహాన్ని ఆశ్రయించి ‘తే’ కారంతో తులారాశితో ఉంటుంది. కార్తీకమాసం కలిగిన ఈ పత్రకం ఏడవది. నాభితో కూడి ‘వా’ కారం ఉంటుంది. వృశ్చికరాశి మార్గశిర మాస సహితమైన ఈ పత్రకం ఎనిమిదవది. నడుమును ఆశ్రయించి ధనూరాశితో ‘సు’ కారం ఉంటుంది. మాసం పుష్యం. ఇది నవమ పత్రకము. ఊరువుల మీద ‘దే’ కారం మకరరాశి ఉంటాయి. మాసం మాఘం. పదవ పత్రకం. మోకాళ్ళమీద ‘వా’ కారం కుంభరాశి ఫాల్గుణ మాసాలతో ఏకాదశ పత్ర కంగా విలసిల్లుతుంది. ఇక పన్నెండవ పత్రకం పాదాల మీద మీనరాశితో చైత్రమాసంలో ఉంటుంది. ఇలా ద్వాదశ పత్రాత్మకమైన కేశవ వాసుదేవ పరమాత్మ చక్రం పన్నెండు అరలు (అంచులు) రెండు నాభులు కలిగి ఉంటుంది. మూడు మూర్తులలో కనిపించినా ఆపరమేశ్వరుడొక్కడే. ఆ సర్వేశ్వరుని రూపం ఈ విధంగా ద్వాదశాత్మకంగా ఉంటుంది. ఓ ముని శ్రేష్ఠా! దీనిని తెలిసిన వారలకు మరల మరణం అంటూ ఉండదు.
ఆ బ్రహ్మ రెండవ రూపం సత్వగుణ సంపన్నం. నాలుగు రంగుల్లో నాలుగు ముఖాలు నాలుగు బాహువులు చక్కని అంగ ప్రత్యంగాలతో పీతాంబరం ధరించి నయనా నందకరంగా ఉంటుంది. మూడవది తమో ప్రధానమైన శేషమూర్తి. ఆ లక్ష్మీ వరుడు సహస్ర ముఖాలు సహస్ర పాదాలతో ప్రజాప్రళయం చేస్తాడు. రజోగుణ సమ్మితమైన నాలుగవ రూపం ఎర్రటిరంగులో నాలుగు ముఖాలు రెండు చేతులతో ఒప్పు ఆ ఆది పురుషుడు మాలాధరుడై సృష్ఠి కార్యం నెరవేర్చుతుంటాడు. అవ్యక్త బ్రహ్మనుండి నిర్గమించిన ఈ మూడు వ్యక్త (ప్రత్యక్ష) రూపాలు. అంతట ఆ ప్రభువునుండి మరీచి మొదలయిన ఋషులు వేల సంఖ్యలో జన్మించారు. ఓ మునిశ్రేష్ఠా! ఈ విధంగా నీకు మతిపుష్టివర్ధకమైన పరమాత్మ పురాణ రూపాన్ని వివరించి చెప్పాను. అలాంటి చతుర్భుజ ప్రభువును అ దురాత్ముడగు మురుడు యముని మాట ప్రకారం సమీపించాడు. ఆ వచ్చిన వాడిని చూచి మధుసూదనుడు రాక్షసా! నీవెవరవు? ఎందులకు వచ్చావని అడుగగా వాడు నీతో యుద్ధానికి వచ్చానన్నాడు. అంతట నా రాక్షసాంతకుడు నాతో పోరాటానికి వచ్చిన వాడివైతే నీ గుండె భయంతో అలా దడదడ కొట్టుకుంటున్న దెందులకు? జ్వరార్తుల్లాగా వణికిపోయే పిరికివారలతో నేను యుద్ధం చేయను సుమా! అన్నాడు. అంతట వాడు, తన గుండెమీద చెయ్యి పెట్టుకొని, ఆc! ఆఁ! ఎవరి గుండె? ఎక్కడ ఎందుకు కొట్టు కుంటున్నది? అంటూ ఉండగా ఆ హరి అతి లాఘవంతో మృదువుగా తన చక్రాన్ని ప్రయోగించి చేతితోసహా వాడి వక్షఃస్థలాన్ని చీల్చి సంహరించాడు. దేవతలందరు తమ బాధలు తొలగి ఆ కమలనాభుని జయజయధ్వానాలతో కీర్తించారు. నారదా! ఈ విధంగా చక్రధరుడు యుక్తితో గావించిన మురదానవ సంహారకథ నీకు వివరించాను. ఇందువలననే ఆ నృసింహ విభుడు మురారిగా ఖ్యాతి వహించాడు.