వామన మహా పురాణము
ప్రహ్లాద నారాయణ యుద్ధం
శార్ఙ్గధనువును ధరించి తనవైపు వచ్చుచున్న నారాయణుని చూచి, దానవేశ్వరుడు, తన గదను గిరగిర త్రిప్పి ఆ సాధ్యుని నెత్తిపై బలముగా మోదెను. అట్లు గదచే ప్రహరించబడిన ఆ ధర్మపుత్రుని నేత్రాల నుండి అగ్ని వృష్టివలె జలధారలు భూమిపై రాలెను. నారాయణుని నెత్తిమీద పడిన ఆ గదాదండం, కొండ శిఖరం మీదపడిన పిడుగునకు వలె నూరు ప్రక్కలుగా పగిలిపోయెను. అంతట వెనుదిరిగి, ఆ దానవ వీరుడు త్వరగా తన రథముపై నెక్కి కార్ముకము చేతగొని అమ్ములపొది నుండి బాణమును తీసికొనెను. క్రోధంతో నల్లబడిన మోముగల ఆ దానవేశ్వరుడు, గద్ద రెక్కలతో అలంకరింపబడిన బాణాలను వింట సంధించి ఆ సాధ్యునిపై గుప్పించెను.
ఇలా తనపైకి వచ్చుచున్న అర్ధ చంద్రబాణాలను తన శరపరంపరతో మధ్య మార్గాన్నే ఖండించి నారాయణుడా దానవుని నిశితమైన బాణాలతో గాయపరచెను. ఆ విధంగా ఆ వీరు లిరువురు ఒకరినొకరు తీవ్రములగు బాణములతో భేదించు కొనిరి. సాధ్య దైత్యుల ఆ భీకర సంగ్రామాన్ని తిలకించిన దేవతలు గగనతలాన నిలబడి దుందుభులు మ్రోగించుచూ ఆ వీరులపై పుష్పవృష్టి కురిపించిరి. ఆ విధంగా ఆకాశాన్నుంచి తిలకించుచున్న దేవతలకు ప్రీతివర్ధకంగా ఆ వీరులు అద్భుత సంగ్రామంచేశారు. వారి బాణాసనాల నుంచి వెడలిన, అసంఖ్యాక శరాలతో భూమ్యాకాశాలు అష్టదిక్కులు కప్పబడి నాయి. బ్రహ్మర్షే! అంతట నారాయణుడు తన ధనుస్సును బాగుగా వంచి అతి తీవ్రమైన బాణముతో ప్రహ్లాదుని మర్మ స్థానమున గొట్టెను. అలా సర్వమర్మ స్థానములందు ప్రహరింపబడి ప్రహ్లాదుడు ప్రచండమైన కోపంతో, నారాయణుని వక్ష స్థలమును బాహువులను ముఖమును అనేక బాణాలతో నింపివేశాడు.
అంతట నారాయణుడొక అర్ధ చంద్ర బాణంతో దైత్యేశ్వరుని చేతిలోని వింటిని ఖండించివైచెను. ఆ తరువాత దైత్యుడు వేరొక ధనుస్సు గైకొని అతిలాఘవంతో నారాయణునిపై బాణవృష్టి గురియించెను. సాధ్యుడగు నారాయణుడా బాణములను ఖండించి ఒక తీవ్రమైన శరంతో శత్రువు వింటిని రెండు తునకలు గావించెను. వెంటనే దైత్యుడు వేరొక ధనుస్సు గైకొనినంతనే దానిని గూడ నా పురుషోత్తముడు రెప్పపాటులో త్రుంచి వైచెను. ఈ విధంగా రాక్షసరాజు బాణాసనాల నెన్నింటినో ఖండించివేశాడు. తన కార్ముకాలన్నీ ఈ విధంగా ఖండింపబడుట చూచి క్రోధతామ్రాక్షుడై దైత్యపతి, అతి భయంకరం సుదీర్ఘం సర్వలోహమయమైన పరిఘ (గుదియ)ను గైకొనెను. ఆ ప్రచండమైన పరిఘనాతడు భయంకరంగా త్రిప్పుతుండగా దానిని నారాయణుడొక బాణముతో ముక్కలు గావించెను. పరిఘతునుకలు కాగా శ్రీమంతుడైన ప్రహ్లాదుడు ముద్గరము అనే ఆయుధాన్ని తీసికొని అతివేగంగా త్రిప్పి నారాయణునిపై విసరెను. మహామునీ! ఆ వచ్చుచున్న ముద్గరాన్ని నారాయణుడు పది బాణములతో శతధాభిన్నము గావించెను. ముద్గరం వ్యర్థంకాగా దైత్యుడు ప్రాసము అనే ఇంకొక ఆయుధాన్ని ప్రయోగింపగా దానిని కూడ ధర్మపుత్రుడు ఖండించి వేశాడు. అంతట దైత్యపతి శక్తి అనే వేరొక ఆయుధాన్ని ప్రయోగించగా దానిని గూడ తీవ్రబాణాలతో ఆ తపస్వి ఆపివేశాడు.
నారదా! ఆ శస్త్రాలు ఆవిధంగా వ్యర్థంకాగా ఆదానవుడు వేరొక మహాధనుస్సును తీసికొని నలువైపులా బాణములు గురిపించెను. అంతట జగద్గురువగు నారాయణుడొక బాణమున తానా దైత్యుని వక్షమును భేదించెను. అద్భుత కర్ముడగు నా తపోధనునిచే వక్షము విదీర్ణము కాగా నా దైత్యుడు రథముపై నొరగిపోయెను. వెంటనే సారథి అతనిని అచ్చట నుండి దూరముగా గొనిపోయెను. అచిరకాలంలోనే మూర్చనుండి తేరుకొని దానవపతి వేరొక దృఢచాపాన్ని తీసికొని మరల యుద్ధమునకు దలపడెను. అంతట నరాగ్రజుడతని జూచి-ఓ దైత్యేంద్రా! రేపు ప్రాతఃకాలమున మరల యుద్ధము చేయుదము. ఇంతట వెళ్ళి నిత్యాహ్నికములు నెరవేర్చు కొమ్మనెను. నారాయణుని మాటలువిని దైత్యనాథుడు నైమిశారణ్యమునకు వెళ్లి ఆహ్నిక కృత్యములు నెరవేర్చుకొనెను.
మునీ! నారాయణుడు గావించు సంగ్రామమును చూచి ప్రహ్లాదుడా రాత్రి -ఈ కపట మునిని నిర్జించుటెట్లాయని ఆలోచనలో పడెను. నారదా! వారిర్వురావిధంగా వేయి దివ్యవత్సరములు పోరాడిరి. అయితే దైత్యరాజా తపస్విని జయింపజాలడయ్యెను.