వామన మహా పురాణము
బ్రహ్మచారిచేసిన విష్ణు సారస్వత స్తోత్రం
ఓం ప్రణవ (ఓం) స్వరూపుడైన శ్రీహరికి కృష్ణునకు హృషీకేశునకు జగన్నాధుడగు వాసుదేవ జనార్ధనునకు నమస్కరించుచున్నాను. ఆయన నా పాపాలు పోగొట్టు గాక! చరాచరాలకు గురువు, నాథుడు, గోవిందుడు అయిన శేషశాయికి నమస్సులు. ఆయన నా పాపాలు నశింపజేయుగాక. శంఖ చక్ర శార్ ఙ్గ మాలాధరుడగు శ్రియఃపతికి నమస్సులు. నా పాపాలు పోనడచుగాక. విశాలనేత్రుడు, పుండరీకాక్షుడు, అచ్యుతుడు, ఆరాధ్యులచేత నారాధింప బడే ప్రభువుకు ప్రణామము. నా పాపాలు ఆయన పోగొట్టుగాక! నారాయణునకు నరునకు శౌరికి మాధవునకు మధుసూదనునకు జగదాధారునకు నమస్సులు. నా పాపాల నతడు హరించుగాక. కేశవుడు చంద్ర సూర్య నయనుడు కంసకేశి సంహారకుడు. అగు మహాభుజునకు నమస్సులు. ఆయన నా పాపాలను పోగొట్టుగాక! శ్రీవత్సాంకునకు లక్ష్మీపతికి శ్రీధరునకు శ్రీనివాసునకు శ్రీవల్లభునకు నమస్సులు. ఆ స్వామి నా పాపాలను నశింపజేయు గాక! యోగీశ్వరులు ధ్యానించే సర్వభూతేశ్వరునకు అక్షరునకు అనిర్దేశ్యస్వరూపియగు వాసుదేవునకు నమస్సులు. ఆయనకు శరణాగతుడనగుచున్నాను. తమ మనస్సులను ఇతర విషయాలనుండి మళ్ళించి యోగులై ప్రభువుపై నిలిపి ధ్యానింతురో అఠ్టి వాసుదేవుని శరణు వేడుచున్నాను. సర్వ జీవులకు ఆధారభూతుడు సర్వగమనుడునగు వాసుదేవుడు పరబ్రహ్మకు శరణాగతుడను. విజ్ఞులు తమ కర్మ క్షయానంతరం ఏ అవ్యక్త అక్షయతత్త్వాన్ని చేరుదురో అట్టి దేవునకు శరణాగతుడను. యోగులు పుణ్య పాపాల నుండి ముక్తులై ఏ ప్రభువును చేరి పునర్జన్మ రహితులయ్యెదరో అట్టి ప్రభువుకు శరణాగతుడను. చతుర్ముఖ బ్రహ్మ రూపాన దేవాసుర మానుషసహితమైన జగత్తునంతా సృష్టించే అచ్యుతునకు శరణాగతుడను. బ్రహ్మరూపాన ఎవని నోటి నుండి చతుర్వేదములు వెలువడినవో అట్టి వేద పురుషునకు శరణాగతుడను. సృష్టికార్యం నెరవేరుటకు బ్రహ్మరూపాన్ని ధరించిన జగన్మాతునకు, జనార్ధనునకు, సనాతనునకు ప్రణామములు. సృష్టి గావించినతర్వాత యోగియైనిలచిన రాక్షసాంతకుడగు అదిపురుషునకు విష్ణువునకు ప్రణామములు చేయుచున్నాను. భూమిని ఉద్ధరించి దైత్యుల వధించి దేవతల రక్షించిన ఆదివిష్ణువు జనార్ధనునకు ప్రణతుడను. విప్రులు ఏ దేవుని, యజ్ఞాల ద్వారా ఆరాధిస్తారో, యజ్ఞేశ్వరుడు యజ్ఞభావనుడు యజ్ఞపురుషుడు అగు ఆ సనాతన విష్ణు దేవునకు ప్రణతుడనగుచున్నాను.
పాతాళ వీధీ భూతాలను, లోకాలను లయింపజేయు అంతకుడగు రుద్రునకు సనా తనునకు నమస్కరించెదను. సృష్టింపబడిన ఈజగత్తు నంతనూ భక్షించి రుద్ర రూపాన తాండవ నృత్యంచేయు నా సనాతనుడగు హరికి నమస్సులు. సురాసురులు పితృ గణాలు దేవ గంధర్వ యక్ష రాక్షసులు ఏ ప్రభువు నుండి సంభవించుచున్నవో, ఆ సర్వ వ్యాపియగు సనా తనునకు నమస్సులు. సమస్త దేవ జాతులు, మనుష్య జాతులు ఎవని అంశాలో, ఆ సర్వ వ్యాపియగు ప్రభువుకు నమస్కరింతును. చెట్టుచేమలు పొదలు పశుమృగాదులు ఏ దేవుని అంశాలో, ఆ విష్ణువునకు నమస్కరించెదను. ఎవని కన్న ఇతరమైనది లేదో, ఏ మహాత్మునిలో అన్నీ ఇమిడి ఉన్నవో, ఎవడు అన్నింటికి మధ్యన, చివరన ఉండునో అట్టి దేవునకు నమస్కరించుచున్నాను. కొయ్యలో నిప్పువలె అన్నింటిలో విష్ణువు లీనుడై యున్నాడు. ఆ ప్రభువు నాపాపాలన్నీ మిగులకుండ నశింపచేయుగాక. రజస్సత్వతమో గుణ మయమైన నావలన, జన్మల శుభాశుభ కర్మల వల్ల గలిగిన, పాపాలన్నీ నశించుగాక! నేను మనోవాక్కాయ కృతములైన కర్మల ద్వారా, రాత్రులందు ప్రాతర్మధ్యాహ్నా పరాహ్ణ సమయాలలోను, సంధ్య వేళలలోను, మూటగట్టుకొనిన పాపములూ, లేస్తూ, నడుస్తూ, శయనిస్తూ, చేసిన అశుభకర్మలు; తెలిసీ తెలియక మదాతిరేకంతో గావించిన సకల పాపాలూ వాసుదేవ నామస్మరణ మాత్రాన్నే నశించిపోవుగాక! పరస్త్రీ పర ధనముల కాశించి పరులకు ద్రోహం తలపెట్టి పరహింసా నిందలుగావించి మహాత్ముల నవమానించి ఆర్జించిన పాపాలు భక్ష్య పేయ ((త్రాగుడు) చోష్య లేహ్యముల ద్వారా కూడబెట్టుకొన్న పాపాలూఅన్నీ నీళ్లలోఉంచిన ఉప్పునకు వలె కరిగిపోవు గాక! బాల్య కౌమార యౌవన వార్థక్యాలలో జన్మజన్మాంతరాలలో నేను చేసిన పాపసమూహం నారాయణ గోవింద హరి కృష్ణ ఈశ్వర సంకీర్తనం వల్ల నీళ్లలోని లవణ పాత్రలోని ఉప్పువలె కరిగిపోవు గాక! వాసుదేవా! విష్ణూ! హరీ! కేశవా! జనార్ధనా! కృష్ణా! భవిష్య నరకాంతకా! కంస నాశకా! అరిష్టకేశి చాణూరాది దేవశతృసూదనా నీకు నమస్సులు. మాటిమాటికీ ప్రణామములు. నీవు తప్ప బలిని వంచింపగల వాడెవడు? నీవు దక్క హైహయ నరపతి (కార్తవీర్యుని) బాహుబలదర్పం అణచగలిగిన ప్రభువెవడు?
మధునాశకా! మరొకరెవరు సాగరాన్ని బంధించి, మంత్రి పరివార సైన్య సమేతంగా దశకంఠుని వధించగలరు? ప్రభూ! నీవు దక్క మరెవ్వరు నంద గోకులంలో విహరిస్తూ ప్రలంబా సుర పూతనాది రాక్షసులను వధించగలరు? అదుపాజ్ఞలలో పెట్టగలరు? కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, ఈవిధంగా పవిత్రాలైన పుణ్యప్రదాలయిన విష్ణుని గుణగణాలు కీర్తిస్తే, మానవుడు ఏడు జన్మాల్లో తెలిసికాని తెలియకకానీ చేసిన మహాపాతక ఉపపాతకాలన్నీ నశించిపోతాయి: యజ్ఞలు, ప్రతాలు, తపోనిష్ఠలలో మునిగిఉండే యోగులు తమ పాపపుణ్య ఫలాలను అన్నింటినీ, నీళ్లలో పడవేసిన పచ్చి కుండవలె నశింపజేసుకుంటారు. ఈ స్తోత్రాన్ని ఒక పర్యాయం పఠిస్తే సంవత్సరం పాటు రోజూ పదహారుకుండలతో నువ్వులు దానం చేసినంత ఫలం కలుగుతుంది. బ్రహ్మచర్య దీక్ష చెడిపోకుండా మానవుడొక సంవత్సర కాలం ఈ స్తోత్రం జపిస్తే విష్ణు లోకం పొందుతాడు. ఇది నిజము. నేనిదంతా సత్యము చెప్పాను. ఇందులో లేశ మాత్రమైనా అబద్ధం లేదు. భయంతో వణికిపోతున్న నన్నీ రాక్షసుడు వదలివేయుగాక. నారదా! ఆ బ్రాహ్మణుడలా అనగానే రాక్షసుని బంధం విడిపోయింది. ముక్తుడైన అతడెలాంటి కోరిక లేకుండానే రాక్షసునితో ఇలా అన్నాడు. ఓ సౌమ్యుడా నాద్వారా నీకు చెప్పబడిన పాపనాశకమైన ఈ విష్ణు సారస్వత స్తోత్రాన్ని అగ్నిదేవుని పంపున వచ్చిన సరస్వతీదేవి నా నాలుకమీద నిలచి వివరించినది. ఇది ఎల్లవారలకు శాంతిని చేకూర్చుతుంది. ఈ స్తోత్రం జపిస్తూ ఆ జగన్నాథుని ఆరాధించినచో నీ శాపం తొలగిపోతుంది. కనుక ఓ రాక్షసా! దీనిని రాత్రింబవళ్లు జపిస్తూ అ హృషీకేశుని దృఢమైన భక్తితో పూజించుము. నీ పాపాలన్నీ పటాపంచలౌతాయి. స్తోత్ర ప్రియుడైన శ్రీహరి ఈ స్తోత్రంతో కీర్తించిన నరుల పాపాలన్నీ నశింపజేస్తాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నారదా! అంతట ఆ బ్రాహ్మణునకు మ్రొక్కి ప్రసన్నుని గావించుకుని ఆ మహిమాన్వితుడైన నిశాచరుడు తక్షణమే శాలగ్రామ క్షేత్రంలో తపస్సు చేసేందుకు వెళ్ళాడు. వాడు యింద్రియాల నదుపులో నుంచుకుని సర్వదా సారస్వత స్తోత్రాన్ని జపిస్తూ అత్యధికమైన ప్రీతితో దేవ కార్యాలు నెరవేర్చుకుంటూ జగన్నాధుని ఆరాధించాడు. చివర కాపురుషోత్తముని కృపతో సర్వపాపాల నుండి విడివడి విష్ణు లోకానికి చేరుకున్నాడు. ఈవిధంగా బ్రాహ్మణుని నోట వాగ్దేవి సరస్వతి ప్రవచించిన పవిత్ర విష్ణు స్తోత్రాన్ని నీకుచెప్పాను. వాసుదేవుని ఈ ఉత్తమోత్తమ స్తవాన్ని చదివిన మానవుడు సర్వ పాపాలు పోగొట్టు కుని మోక్ష పదవిని పొందగలడు.