వామన మహా పురాణము
దేవతల పలాయనం
క్రోధతామ్రాక్షుడై వచ్చిన ఆ కపర్దిని చూచి విష్ణువు వెంటనే ఆ స్థానం వదలి ఒక కుబ్జాశ్రమంలో దాగికొనెను. అష్టవసువులు ఆ హరుని చూచినంతనే పలాయనము చిత్తగించిరి. వారు పారిపోయిన మార్గము సీతయనునది శ్రేష్ఠమయ్యెను. దానినే సరస్వతీయని పిలిచిరి. శంకరుని రాకతో త్రినేత్రులు వృషకేతనులగు నేకాదశరుద్రులు తమ స్థానములు వదలి పారిపోయిరి. విశ్వేదేవులు అశ్వినులు సాధ్యులు మరుత్తులు సూర్యాగ్నులు పురోడాశమును భక్షించిరి. నక్షత్రములతో గూడి చంద్రుడు రాత్రితో కూడి ఆకాశమున కెగిరి తన నెలవును పొందెను. శతరుద్రీయమును పఠించుచున్న కశ్యపాది మహర్షులు సంభ్రమముతో చేతులు జోడించుకొని నిలబడిరి. ఇంద్రాదులను మించి, బలప్రదర్శనము చేయుచున్న రుద్రుని చూచి దక్షపత్ని అతికరుణముగ విలపించెను. అప్పుడు క్రోధావేశముతో శంకరుడు ఎందరో దేవతలను చపేట ప్రహారములతో నేలపై పడగొట్టెను. కొందరను పాద ప్రహారము లతో కొందరను శూలాఘాతములతో ఇతర దేవతలను త్రినేత్రాగ్ని జ్వాలల్లో నాశనము చేశాడు. అంతట పూషుడు శంకరుడు చేసే దేవతా మారణాన్ని చూచి కోపంతో బాహువులు సాచి ఆయనపై లంఘించెను. తనపై దుముకుచున్న పూషుని రెండు చేతులు ఒక చేతితో నొడిసి పట్టి గట్టిగా పిండి అతని వ్రేళ్ళకొనల నుండి రక్తధారలు ప్రవహించునట్లు ఒనర్చెను. వెలుగులు వెదజల్లే ఆ దివాకరుని తన పిడికిలితో బంధించి లేడి పిల్లను సింహము త్రిప్పినట్లు గిరగిర త్రిప్పివైచెను. ఓ నారదా! అలా తీవ్రమైన వేగంతో త్రిప్పగా అంశు మంతుని దీర్ఘబాహువులు కుదించుకొని పొట్టివి అయ్యెను. ఎముకలు కీళ్ళు స్నాయువులు నుగ్గునుగ్గయి పోయెను. అంతట శివుడు సర్వాంగాలు రక్తసిక్తములై పడియున్న పూషుని వదలి మరొక వైపు వెళ్ళెను. అట్లు వెళ్ళుచున్న శంకరుని, పూషుడులేచి పండ్లిగిలించి నవ్వుచు, ఓ కపాలీ! పోపోకుము రమ్మని” మాటిమాటికి అదలించెను. దానితో రెచ్చిపోయి శంభుడా సూర్యుని మూతిపై గట్టిగా ప్రహరించగా అతని పండ్లన్నియు ఊడి నేలపై బడెను. అట్లు పండ్లూడి ముఖమంతయు రక్తపుముద్దకాగా స్పృహదప్పి వజ్రాహతి కొరగిన పర్వతమువలె నేలపై బడెను. అట్లు పూషుడు రక్తపు మడుగులో పడిపోవుట చూచి భగుడు భగ్గుమను చూపులతో శంకరుని చూచెను. మరుక్షణములో శంకరుడు ముష్టి ఘాతంతో భగుని కన్నుల క్రూరముగ నడచి నాతని మట్టికరపించెను, దానితో దేవతలు హాహాకార మొనర్చిరి. భయకంపితులైన ద్వాదశాదిత్యులు ఇంద్రుడు, మరుత్తులు, అగ్నులు తలకొక దిక్కుగా పారిపోయిరి. దేవతల పలాయనంతో ప్రహ్లాదుడు తదితర దైత్యులందరు శివునకు సాష్టాంగపడి చేతులు కట్టుకొని నిలబడిరి. శంకరుడు కన్నుల అగ్నిజ్వాలలు చిమ్ముచు యాగశాలనంతను భస్మీపటలము గావింపనెంచి కలయజూచెను. కొందరు వీరులా మహాదేవుని దృష్టి తప్పించుకొని దాగికొనిరి. కొందరు ప్రణమిల్లిరి. కొందరు పారిపోయిరి. కొందరు భయాతి రేకంతో యమలోకమును జేరిరి. దుఃసహతాపంతో త్రినేత్రాల్లో జ్వలించుచున్న త్రేతాగ్ని శిఖల వేడికి క్షణకాలంలో సర్వము మాడి బూడిద అయ్యెను.