అదితికి విష్ణువు అభయమిచ్చుట

అదితి కావించిన స్తోత్రంవిని భగవంతుడగు వాసుదేవు డితరులెవ్వరికి కనబడకుండా ఆమెకు మాత్రమే గోచరించి ఓ ధర్మజ్ఞురాలవగు అదితీ! నా అనుగ్రహంచేత నీ మనోరథాలన్నీ నెరవేరగలవు. నా దర్శనం విఫలం కాజాలదు. అందువల్ల నీ మనస్సులోని వరం (కోరిక) తప్పక సిద్ధిస్తుంది. ఈ అదితివనాన్ని స్మరించినవారలకే పరమపదం ప్రాప్తించగలిగి యుండగా, అక్కడ ఆవాసం చేయువారి విషయం చెప్పవలెనా? ఈప్రదేశాన భక్తి శ్రద్ధలతో ఐదుగురుకో, ముగ్గురుకో, ఇద్దరికో లేక ఒకరికైనా సరే భోజనం పెట్టి తృప్తి పరచువారలకు అక్షయ లోకప్రాప్తి కలుగును అని అన్నాడు. శ్రీమన్నారాయణుని ఆ మాటలువిని అదితి ఇట్లనెను. భక్తవత్సలా! దేవా! నా భక్తికి సంతసించినచో నా పుత్రుడగు ఇంద్రుడు త్రిలోకాధిపతి అగుగాక. అతడు కోలుపోయిన రాజ్యం యజ్ఞ భోగాలు నీ అనుగ్రహం వల్ల మరల నాపుత్రునకు లభించుగాక. రాజ్యం పోయినందుకు నా కుమారునకు చింతలేదు. శరణాగతులకు దాయభాగ విభ్రంశం కలగడమే నన్ను వేధించుచున్నది.

భగవానుడిట్లనెను, దేవీ! నీ మనోభీష్టము ననుగ్రహించితిని. ఇంక నా అంశతో కశ్యపుని ద్వారా నీ కడుపునపుట్టి శత్రులోకాన్నంతటినీ సంహరింతును. నీవు ఆనందంతో తిరిగి వెళ్ళుము. అనగా అందులకు అదితి ఓ దేవదేవ! విశ్వభావన! నన్నను గ్రహించుము. సమస్తలోకాలను బొజ్జలో ఉంచుకొన్న సర్వేశ్వరుడగు విశ్వగర్భునిని మోయలేను తండ్రీ! అని బదులుచెప్పెను. అందులకు భగవానుడు భయపడకు దేవీ! నేను నిన్నూ నన్నూకూడ మోయగలను. నీకెలాటి బాధయు కలుగనివ్వను. నీకు మేలగుగాక. నేను వెళ్లివస్తాను అని అన్నాడు.