బలి యజ్ఞదీక్ష

ఇలా రాక్షసులబాధకు వెరచి గౌతమాంగిరీసాదులగు మునులు తలొక దిశగా వెళ్లిపోయి తలదాచుకొనగా శుక్రాచార్యుడు భృగు వంశీయులగు తన విప్రుల నందరను ఆ యజ్ఞానికి రప్పించాడు. అమిత తేజోమయమైన ఆ మహాయజ్ఞవేది యందు భృగ్వాదులగు విప్రోత్తముల నడుమ శుక్రుడు విధ్యుక్తంగా ఆ బలి మహారాజును యజ్ఞ దీక్షితుని గావించాడు. శుభ్రమైన తెల్లనివస్త్రాలు ధరించిశ్వేత గంధానులేపనం మాలాధారణం గావించుకుని కృష్ణాజినంతో వీపును కప్పుకొని, శుక ధర్భాంకురాలతో కళకళలాడుతూ విశాలమైన యజ్ఞశాలలో, ఋత్విక్కులు, సదస్యులు, హయగ్రీవ, ప్రలంబ బాణ, మయాది దైత్య శ్రేష్ఠులచే పరివేష్ఠితుడై ఆ బలి దైత్యేంద్రుడు ఆసీనుడయ్యాడు.

వేయి మందిభార్యలలో నుత్తమురాలు ఋషి పుత్రి అయిన వింధ్యావళి ఆ బలి ధర్మపత్ని, పతితోబాటు యజ్ఞ దీక్ష స్వీకరించి భర్త ననుసరించినది. అంతట శుక్రుడు తెల్లని దేహ కాంతితో సర్వ లక్షితమైన యజ్ఞాశ్వాన్ని చైత్రమాసంలో భూమిని చుట్టి వచ్చుటకు వదలగా దాని రక్షణకై దైత్య వీరుడు, తారకాక్షుడు వెంటవెళ్లాడు. యజ్ఞాశ్వ విసర్జనతో ఊపందుకున్న యజ్ఞకర్మ మూడు మాసాలు హోమాదులతో విస్తరించింది. దైత్యులు పూజలందుకొంటూ ఉచ్ఛస్థితిలో నున్న ఆ సమయాన సూర్యుడు మిధునరాశిలో ప్రవేశించిన వేళ దేవమాత యగు అదితి వాసుదేవుని వామనాకారంలో పుత్రునిగా ప్రసవించింది. ఓ నారదా! ఆ లోకపతి అది పురుషుడు భగవంతుడగు నారాయణుడు అవతరించగనే బ్రహ్మర్షులతో కలిసి బ్రహ్మ ఆ విభుని సమీపించి, ఇలా స్తోత్రం చేశాడు.