వామన మహా పురాణము
శివుని సమర సన్నాహం
పులస్త్యుడిలా అన్నాడు: శంబర దైత్యుడు వెళ్ళిన పిమ్మట హరుడు నందిని పిలచి ఓ శిలాదనందనా! నీ యేలుబడిలో గల వారల నందరను వెంటనే పిలువుమని ఆదేశించాడు. మహేశ్వరుని మాట విన్నంతనే నంది ఆచమనం గావించి శివగణాల నాయకులందరిని స్మరించాడు. శ్రీమంతుడైన నందీశ్వరుడు స్మరించిన వెంటనే వేల సంఖ్యలో, అ గణనాయకులంతా ఎగిరివచ్చి ఆ దేవదేవునకు ప్రణమిల్లారు. నంది చేతులు జోడించుకుని పరమశివునకు ఆవచ్చిన వారలనందరును ఎరుకపరిచాడు. ప్రభో శంకరా! మూడు కన్నులతో జటాధారులైన ఈ వీరులు రుద్రులుగా ఖ్యాతిగాంచారు. వీరిసంఖ్య పదకొండు కోట్లు. ఇక శార్దూల విక్రమంగలిగి వానర ముఖాలతో కనిపించే ఈ యశోధనులు నా పేరుతో విరాజిల్లే శూరులు. ఈ రుద్రులు ద్వార పాలకులు. శక్తిపాణులై శిఖికేతనాలతో అ కనిపించే షణ్ముఖులున్నారే, వారు అరవైఆరు కోట్లు. స్కందులనే పేరుగల ఆ వీరులు కుమారులు. ఆరు తలలు కల వీరలు శాఖులు. వీరి సంఖ్యకూడా అంతే. ఇక నావిశాఖుడు, నైగమేయులనబడే వారలు కూడ, షడాననులు, అరవై ఆరు కోట్ల సంఖ్యలలో ఉన్నారు. శంకరా! అనిలబడిన ఉత్తమ ప్రమథులు ఏడువందల కోట్లమంది, వారందరకూ అదేసంఖ్యలో మాతృకలున్నారు. ఇక భస్మారుణ శరీరాలతో మూడు కన్నులూ శూలాలు ధరించిన శైవులనే ఈ గణనాయకులు నీ భక్తులు. భస్మంతోనే ప్రహరించి శత్రునాశం చేసే పాశుపత గణాధిపతులరుగో, నీ సహాయార్థం వచ్చినవీరలు లెక్కకుమించిఉన్నారు. కాలముఖులనే భయంకరులైన నీభక్త గణాలు అరుగో జటాధారులై పినాకాలు పట్టుకొని వచ్చారు. ఎర్రని కవచాలు ధరించి ఖట్వాంగాలతో యుద్ధంచేసే ఉత్తమ వ్రతధారులైన నీ భక్తగణాలు ఇరుగో, యుద్ధం చేయుటకు వచ్చారు. ఓ జగద్గురూ! అరుగో మౌనధారులై ఘంటా ప్రహారాలు చేసే దిగంబరులైన నిరాశ్రయులనబడే గణనాయకులు వచ్చారు. కమలాలలను బోలిన రెండున్నర కన్నులతో, శ్రీవత్సలాంచనాలు ధరించి పక్షులమీద కొందరు గణాధిపతులు వచ్చారు. మరికొందరు వృషభకేతనాలతో వచ్చారు. వారు మహా పాశుపతులు, చక్రశూల ధరులు, వారు భైరవు (శివు)ని, విష్ణువును అభేదబుద్ధితో అర్చిస్తారు. శూలబాణచాపాలు ధరించి వీరభద్రుని పురస్కరించుకొని వచ్చిన ఈ గణాలు, నీ రోమాల నుంచి ఉద్భవించారు. వీరలూ, ఇంకనూ వందలూ వేల సంఖ్యలలో ఎందరో గణాల వారలు ప్రభో! నీకు సహాయం చేయుటకు వచ్చారు. వీరలకు తగిన ఆదేశాలు ఇవ్వండి.
అలా ఆ గణాల వారందరు ఆ వృషభధ్వజుని సమీపించి ప్రణామాలు గావించారు. వారందరను ఆ హరుడు చేతితో సంభావించి సైగచేసి కూర్చుండజేశాడు మహా పాశుపతులను చూచి స్వయంగా లేచివెళ్ళి ఆలింగనం చేసుకొనగా వారలాయనకు నమస్కారాలు గావించారు. శివుని ఆ విచిత్రమైన ప్రవర్తనచూచి గణాధిపతులంతా చాలా ఆశ్చర్యపడి సిగ్గుతో ముడుచుకొని పోయారు. అలా సిగ్గుపడిన గణాలను చూచి నందీశ్వరుడాదిగా గల యోగులు నవ్వుతూ సకల గణాధిపుడైన ఆ శవాల పాణుని చూచి ఇలా అన్నారు: “దేవా మీరొకమహాపాశుపతులను మాత్రమే కౌగిలించుకొని ఆదరించడం చూచి ఇతరులంతా ఆశ్చర్యచకితులయ్యారు. అందుచేత త్రైలోక్యాభినందనీయాలైన విశేష రూపజ్ఞాన వివేకాది లక్షణాలు వారిలో ఏమేమి గలవో అన్నీ వివరించండి.