వామన మహా పురాణము
బ్రహ్మకృత విష్ణుస్తోత్రం
ఓం (ప్రణవశబ్దస్వరూపివగునో) దేవాధి దేవా! వాసుదేవా! ఏకశృంగ! బహురూపా! వృషాకపీ! సర్వస్రష్టా! సురాసుర శ్రేష్ఠా! సురాసుర నాశక! పీతాంబరధరా శ్రీనివాసా! రాక్షసనిర్మాణ నాశకా! అమితనిర్మాణకర్తా! కపిలా! మహా కపిలా! విష్వక్సేనా! నారాయణా! ధ్రువధ్వజా! సత్యధ్వజా! ఖడ్గధ్వజా! తాళధ్వజా! వైకుంఠా! పురుషోత్తమా! వరేణ్యా! విష్ణూ! అపరాజితా! జయా! జయంతా! విజయా! కృతావర్తా! (పాలభాగాన రెండు సొట్టలు గలవాడా) మహాదేవా! ఆదిలేనివాడా! అంతరహితా! ఆదిమధ్యాంతరహితా! పురంజయా! ధనంజయా! పవిత్రశ్రవణా! పృశ్నిగర్భా (వృశ్నికడుపున పుట్టినవాడా) కమలగర్భా! కమలాయతనేత్రా! శ్రీపతి! విష్ణుమూలా! మూలాధివాసా! ధర్మాధివాసా! ధర్మవాసా! ధర్మాధ్యక్షా! గదాపాణే! లక్ష్మీధరా! వేదధరా! వనమాలా ధరా! ధరణీధరా! పద్మనాభా! విరించీ! ఆర్షిపేణా! మహాసేనా! సేనాధ్యక్షా! బహుస్తుతా! బహుకల్పా! మహాకల్పా (బాగా అలంకృతుడైన వాడా) కల్పనాముఖా! అనిరుద్ధా! సర్వగ! సర్వాత్మా! ద్వాదశ! సూర్యాత్మకా! చంద్రరూపా! కాలరూపా! వ్యోమాత్మకా! జీవరూపా! రసాత్మకా! పరమాత్మా! సనాతనా! ముంజకేశా! హరికేశా! గుడాకేశా (నిద్రను జయించినవాడా) కేశవా (కేశములు గలవాడా) నీలా! సూక్ష్మా! స్థూలా! పీతా (పసుపు రంగు) రక్తా! శ్వేతా! శ్వేతద్వీపాధివాసా! రక్తాంబర ప్రియా! ప్రీతికరా! ప్రీతివాసా! ప్రీతియే నివాసమైనవాడా)! హంసా! నీలవాసా! (నీలవస్త్రధరా) సీరధ్వజా (నాగలి పతాకగా కలవాడా) సర్వలోకాధివాసా! కుశేశయా! అధోక్షజా (దిగువ అంగాన్నుంచి పుట్టిన వాడా) గోవిందా (ఇంద్రియాలకు ఆనందం ఇచ్చువాడా) జనార్ధనా! జనులను మర్దించువాడా! మధుసూదనా! వామనా నీకు నమస్సులు! నీవు వేయి తలలు గలవాడవు. వేయి కన్నుల స్వామివి. వేయి పాదాలు గల ప్రభువవు. తామర పుష్పానివి. మహా పురుషుడవు. వేయి చేతుల దేవుడవు. వేయి రూపాల స్వామివి! నిన్ను దేవతలు సహస్ర వదనుడవని కీర్తిస్తారు. అట్టి నీకు ప్రణామాలు.
ఓం రూపా! నీకు నమస్కారము. విశ్వదేవేశా! విశ్వస్రష్టా! విశ్వాత్మకా! విశ్వరూపా! విశ్వసంభవా! నీ నుంచియే ఈ విశ్వం ఆవిర్భవించింది. బ్రాహ్మణులు నీ ముఖాన్నుంచి పుట్టారు. బాహువులనుంచి క్షత్రియులు, ఉరువులనుండి వైశ్యులు, చరణాలనుండి శూద్రులు ఉద్భవించారు. నీనాభి నుండి అంతరిక్షం, నోటి నుండి ఇంద్రాగ్నులు, కన్నుల నుండి సూర్యుడు, మనస్సు నుంచి చంద్రుడు జన్మించారు. నీ ప్రసాదం వల్ల నేను కలిగాను. నీ కోపం నుంచి త్రినేత్రుడు, ప్రాణాల నుండి మాతరిశ్వుడు, శిరస్సు నుండి దివి పుట్టినవి. చెవుల నుండి దిక్కులు, చరణాల నుండి ఈ భూమి కలిగాయి. ఓ స్వయంభూ! చెవుల నుండి దిశలు, తేజస్సు నుండి నక్షత్ర గణం జనించాయి. సాకార నిరాకార వస్తు జాలమంతా నీ వల్ల ఉద్భవించినదే. కనుక నీవు విశ్వాత్మకుడవు. ఓం స్వరూపా! నీకు నమస్కారము. పుష్పాల హాసం నీవే. వికటాట్టహాసం నీవు, పరముడవు, ఓంకార రూపివి నీవు. వషట్కారం, స్వాహాకారం, వౌషట్కారం, స్వధాకారం నీవే. వేదమయుడవు నీవు, తీర్థ మయుడవు (యజ్ఞం చేయు). యజమానుడవు. నీవు యజ్ఞం. నీవే సర్వం నడపునది. నీవే మఖభోజివి. శుక్రం నీవల్లనే కలుగును. భూమి, భువము, స్వర్గము, స్వర్ణము, గోవులు, అమృతము అన్నీ యిచ్చునది నీవే. ప్రణవస్వరూపా! బ్రహ్మకు మూల కారణం నీవు. బ్రహ్మమయుడవు నీవు. నీవు యజ్ఞానివి. వేద కాముడవు. వేద్యుడవు. యజ్ఞ ధారకుడవు. మహా మత్స్యమూర్తివి. మహాసేనుడవు. మహా శిరుడవు. నరకేసరివి. హోతవు. హోమానికి లక్ష్యానివి, హవ్యానివి. హూయమానుడవు. అశ్వమేధయజ్ఞానివి. హోత (పురోహితుడు)వు. పవిత్రం చేయువాడవు. పవిత్రుడవు. పూజ్యుడవు. దాతవు. చంపబడు వాడవు. హరింపబడు వాడవు. హరించువాడవు నీవే. ప్రణవరూపా! నీవు నీతివి. నేతవు. ప్రథముడవు (అగ్ర్య) విశ్వధాముడవు. శుభాండుడవు. ధ్రువుడవు. అరణివల్ల జనించిన (అగ్ని) వాడవు.
ఓ మహాత్మా! నీవు ధ్యాన స్వరూపివి. ధ్యేయుడవు, తెలిసికోదగిన వాడవు, తెలివిని యజ్ఞం చేయువాడవు, దానానివి, భూమావాచ్యుడవు (సమృద్ధివి), చూడదగినవాడవు, బ్రహ్మవు, హోతవు, ఉద్గాత (యజ్ఞంలో సామగానం చేయువాడు)వు, కదలే వారిలోని కదలికవు, జ్ఞానులలోని జ్ఞానానివి, యోగిజనులలో యోగానివి, మోక్షగాములకు లభించే మోక్షానివి, శ్రీమంతులలోని సంపదవు, గ్రహింపబడువాడవు, రక్షకుడవు, పరముడవు, నీకు నమస్సులు. దేవా! సోమ సూర్యులు నీవు. (యజ్ఞ) దీక్ష దక్షిణలు నీవు. నీవు నరుడవు, త్రినేత్రుడవు, మహానేత్రుడవు, ఆదిత్యులను సృజించువాడవు, దేవోత్తముడవు, పవిత్రుడవు, శుక్రుడవు, శ్రావణ భాద్రపద మాసములు నీవు. ఆశ్వయుజము, పుష్యం, మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖ మాసముల, రూపాన విరాజిల్లే కాలానివి. సంక్రమణానివి. విక్రమం, పరాక్రమానివి. అశ్వగ్రీవుడవు, మహామేధం (యజ్ఞం) నీవే. నీవు మంగళకరుడవు. హరీశ్వరుడవు, శంభుడవు, బ్రహ్మేశ్వరుడవు, సూర్యుడవు (మిత్రా వరుణుడు), వసిష్ఠుడవు, ముందటి వంశరూపివి, సకల భూత గణానికి ఆదివి, మహాభూతానివి, మహాత్కార్యాలు చేయువాడవు, కర్తవు, సర్వపాప విమోచకుడవగు త్రివిక్రమ దేవుడవు, ప్రణవరూపా నీకు నమస్సులు!!!
పులస్త్యుడు ఇలా అన్నాడు: ఓ నారదా! పద్మభవుడు ఈవిధంగా స్తుతించిన మీదట పరమాద్భుత కర్ముడగు విష్ణుడు ప్రసన్నుడై పితామహునితో వరము కోరుకోమన్నాడు. అందులకా బ్రహ్మ ప్రీతియుతుడై ఓ విభో! ఇప్పుడు నాకు చూపిన ఈ పుణ్యావహమైన రూపంతో నా భవనంలో సదా నివసింపుమని ప్రార్థించాడు. అంత నాదేవశ్రేష్ఠుడగు మురమధనుడు తధాస్తని అదే వామన రూపంతో స్వయంభువుడగు బ్రహ్మ గావించు పూజలందుకుంటూ విరించి గృహంలో ఉండిపోయాడు. అచట అప్సరోమణులు గుంపులు గట్టి నాట్యాలు చేస్తుంటారు. దేవగాయకులు మధురగీతాలు పాడుతుంటారు. విద్యాధరులు వివిధాలయిన మంగళవాద్యాలు మ్రోగిస్తుంటారు. దేవ దానవ సిద్ధులు గుములు గట్టి ప్రభువును స్త్రోత్రం చేస్తూంటారు. ఆ విధంగా పరమేశ్వరుని ఆరాధించి సురాధిపతియగు పితామహుడు కల్మషరహితుడయ్యాడు. స్వర్గంలో సహస్ర యోజన పరిమితమైన వామనుడుగా విష్ణుడు ఆవిర్భవించగా ఇంద్రుడు కూడా విరించి చేసినట్లా మురహరునకు దేవ సంఘ హితార్థం సకలోపచార పూజలుచేశాడు. ఓ నారదా! ఈ విధంగా దేవకార్యం సిద్ధింప జేయుటకు మహాత్ముడగు వాసుదేవుడొనర్చిన అద్భుత కర్మను నీకు తెలియచెప్పినాను. ఇక రసాతలానికి వెళ్లిన దాతలలో శ్రేష్ఠుడగు దైత్యేశ్వరుడు చేసిన కార్య వివరణ వినుము.
పులస్త్యుడిలా అన్నాడు. రసాతలానికి వెళ్లిన దైత్యేశ్వరుడు బలి శుద్ధ స్ఫటికమణి సోపానాలతో వివిధ మణులతో చక్కని నగరం నిర్మించుకున్నాడు. ఆ నగరం మధ్యన వజ్రాల అరుగులతో, ముత్యాలతోరణాల ద్వారాలతో, విశ్వకర్మ నిర్మించిన విశాలమైన భవనంలో నివాసం చేస్తూ వివిధాలైన దేవ మానుష భోగాలను వింధ్యావళి అను ధర్మపత్నితో కలిసి అనుభవించాడు. ఆయన వేయిమంది భార్యలలో ఆ వింధ్యావళి ప్రధానురాలు. ఆమెతో కలిసి అలా ఆవిరోచనసుతుడు సుతలంలో సకలభోగాలు అనుభవిస్తూండగా ఒకపరి ఆ పాతాళానికి రాక్షస తేజోహారి అయిన సుదర్శన చక్రం వచ్చింది. ఆ రాక్షసనగరంలో చక్రం ప్రవేశించగానే సముద్ర క్షోభకు సమానమైన గొప్ప తుముల ధ్వని వ్యాపించింది. అది విన్నంతనే ఆ బలి దైత్యుడదరి పడి ఖడ్గం దూసి ఏమిటీ ఉపద్రవమని ప్రశ్నించాడు. అతని భార్య వెంటనే అతనిని శాంతింపజేస్తూ ఖడ్గం కోశంలో పెట్టండి. ఈ ధ్వని దైత్యచక్ర సంహారియగు విష్ణుదేవుని చక్రానిది. మహాత్ముడగు వామనదేవుని ఈ దివ్యాయుధం మనకు పూజనీయం అని కర్తవ్య మెరిగించి, చేతిలో అర్ఘ్యపాత్ర తీసికొని భర్తతో బయలుదేరింది. ఇంతలో విష్ణు చక్రం వారలను సమీపించగా నా దైత్యనాథుడు అంజలి ఘటించి భక్తియుక్తుడై సుదర్శనుని పూజించి ఇలా స్తోత్రం చేశాడు.