వామనావతారం

ఈ వృత్తాంతమును మహామునులకు తెల్పి లోమహర్షణుడిలా చెప్పాడు - మహర్షులారా! సకల కామదాయియయిన వరం పొందిన వెంటనే అదితి గర్భంలో దేవ దేవుడు క్రమంగా పెరగడం మొదలుపెట్టాడు. పదవ నెలలో ప్రసవ సమయాన భగవంతుడగు గోవిందుడు వామనాకృతితో జన్మించాడు. ప్రభువు అవతార సమయాన దేవతలకు దేవమాతకు సకల దుఃఖాలు తొలగిపోయాయి. వాయువులు సుఖస్పర్శతో వీచాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. సకల జీవులలోను ధర్మాసక్తి పెరిగింది. మానవులకు శరీర బాధలు తొలగిపోయాయి. భగవంతుడు జన్మించిన వెంటనే లోకపితామహుడైన బ్రహ్మ అచ్చటికి వచ్చి ఆయనకు జాతకర్మాదులు చేశాడు.