లింగోద్భవం

సనత్కుమార వచనం: అలా బ్రహ్మ పలికిన మాటలువిని ఋషులందరు ఇప్పుడు జగత్తుకు శ్రేయస్సు ఎలా కలుగుతుందని మరల ప్రశ్నించారు. అందుకు విరించి ఇలా అన్నాడు. మన మందరం వెళ్లి ఆ దయామయుడు త్రిలోచనుడు శూలపాణిని శరణు కోరుదము. ఆయన అనుగ్రహంవల్ల యథాపూర్వస్థితి ఏర్పడుతుంది. అంతట బ్రహ్మతో కలిసి ఆ మునులందరు కైలాసానికి వెళ్ళి ఉమాసహితుడైన శంకరుని దర్శించారు. అప్పుడు లోకపితామహుడగు బ్రహ్మ వరదాయకుడు దేవాదిదేవుడునైన ముల్లోకేశ్వరుడు శివుని యిలా స్తోత్రం చేశాడు.

ఓ అనంతా నీకు నమస్కారం! పినాకధారీ, వరదా, మహాదేవా, స్థాణూ! పరమాత్మా నీకు ప్రణామాలు! భువనేశా! తారకా! సకలజ్ఞాన ప్రదాయకా! నీకు నమస్సులు! దేవా! నీవొక్కడమే పురుషోత్తముడవు. పద్మగర్భా! పద్మేశా! నీకు ప్రణామములు. ఘోరరూపా, శాంతిరూపా, చండ కోపనా! విశ్వేశా! నీకు నమస్కారములు. సురనాయకా! శూలపాణీ! విశ్వభావనా! ప్రభూ! నీ కనేక ప్రణామాలు!

బ్రహ్మ, ఋషులు చేసిన స్తోత్రంవిని మహాదేవుడిలా అన్నాడు. భయపడకండి. లింగం పునఃప్రతిష్ఠితమౌతుంది. నాకు ప్రీతికరంగా నేను చెప్పినట్లు చేయండి. నిస్సందేహంగా లింగ ప్రతిష్ట జరుగుతుంది. నాలింగాన్ని ఎవరు భక్తితో పూజిస్తారో వారలకు అసాధ్యమంటూ ఉండదు. పాపాలు తెలిసిచేసినప్పటికీ, ఎలాంటివైనా లింగార్చన చేసినంతటనే పటాపంచలౌతాయి. సందేహింపకుడు. మీరలు పడగొట్టిన లింగాన్ని వెంటనే తీసుకువెళ్ళి సాన్నిహిత్యమనే మహత్స రోవరంలో ప్రతిష్ఠించండి. అందువల్ల మీ మనోవాంఛితాలన్నీ నెరవేరతాయి. స్థాణువనే పేర దానిని దేవతలంతా పూజిస్తారు.

స్థాణ్వీశ్వరంలో ఉన్నందున నన్నచట స్థాణ్వీశ్వరుడని పిలుస్తారు. స్థాణువును సదా స్మరిస్తే సర్వకిల్బిషాలు తొలగిపోతాయి. ఆ దేవుని దర్శనమాత్రానే పరిశుద్ధ దేహులై మోక్షగాము లౌతారు. పరమేశ్వరుని మాటలువిని బ్రహ్మాది దేవతలతోకూడి ఆ ఋషులు దారువనం నుంచి లింగాన్ని కదలించి తీసికొని వెళ్ళుట కుపక్రమించారు. అయితే వారందరు కలిసి ప్రయత్నించినా ఆ లింగాన్ని కదలించలేకపోయారు. ఇక దారి ఏమని బ్రహ్మను ప్రశ్నించగా ఆయన మీరెంతగా శ్రమించినా దేవదేవుని ఇచ్ఛానుసారం భూపతితమైన లింగాన్ని తీసికొనిపోలేరు. కనుక ఆయననే మరల శరణువేడితే ఆయనే దయతో దానిని తీసికొనిరాగలడు. అంత అందరూ మరల కైలాసానికి వెళ్ళారు. అయితే అక్కడ వారలకు రుద్రు డగుపించలేదు. అప్పుడు బ్రహ్మధ్యానస్థుడై ఆలోచించగా శంకరుడు ఏనుగురూపంలో, ఆయనను స్తోత్రం చేస్తున్న ఆ దేవతలు, ఋషుల మనస్సులలోనే ఉన్నట్టు కనుగొన్నాడు. అంతట బ్రహ్మను ముందుంచుకొని ఆ దేవతలు ఋషులంతా, ఆ దేవుడు స్వయంగా విరాజిల్లే ఆ మహత్సరోవరానికి వెళ్ళారు. అక్కడకూడ ఆ శివుని కానక వారంతా అన్వేషణ సాగించారు. చింతాకులమైన హృదయాలతో ఉండి పోయారు. అప్పుడచట పార్వతీదేవి కమండలధారిణియై ప్రసన్నవదనంతో కనిపించగా ఆమె నందరు స్తోత్రం చేశారు. ప్రీతురాలైన ఆ ఉమామహేశ్వరుని వెదకి వెదకి బాగా అలసిపోయారు. కాబట్టి మీరంతా ముందీ అమృతాన్ని త్రాగండి. అనంతరం శంకరుని జాడ తెలిసికోగలరు అన్నది. ఆ భవాని మాటలకు సంతుష్టులై వారందరచట కూర్చొని ఆపవిత్రమైన అమృత పానం చేశారు. అనంతరం సుఖాసీనులై వారామెను హస్తి రూపంలో అచ్చటికి వచ్చిన ఈశ్వరుడెచట నున్నాడని అడిగారు. అప్పుడామె ఆ సరోవర మధ్యంలో హస్తిరూపాన ఉన్న శివుని చూపించింది. నీటిలో మునిగియున్న ఆ మహాదేవుని చూచి బ్రహ్మను ముందుండుమని ఆ దేవర్షులు

మహాదేవా! నీవు వదలిన త్రిలోకవందనీయమైన లింగాన్ని ఇతరులెవ్వరూ కొని తెచ్చుటకు సమర్థులు కాకున్నారు అని అన్నారు. బ్రహ్మాదుల నివేదనము విని ఈశ్వరుడు వారందరను వెంటబెట్టుకొని దేవదారు వనాశ్రమానికి వెళ్ళి ఏనుగురూపంతో లింగాన్ని తొండంతో అలవోకగా పట్టుకొని తెచ్చి మహర్షుల స్తోత్రపాఠాల మధ్య ఆమహా సరస్సుకు పశ్చిమ దిక్కున నిలిపాడు. అంతట ఆదేవతలు ఋషులంతా తమజన్మలు ధన్యమైనవని సంతోషించి ఆ పరమ శివుని స్తోత్రం చేశారు. బ్రహ్మపురోగాములయిన దేవతలు వాలఖిల్యాది ఋషులు భక్తి ప్రపత్తులతో చేసిన స్తోత్రానికి సంతోషించి ఆ మహాదేవుడు ఆ ఏనుగు రూపాన్ని వదలి ఆ లింగమధ్యంలో సన్నిహితుడైనాడు.