వామన మహా పురాణము
మహేశ్వరుని మహావ్రతం
నారదు డిట్లనియె, అంబిక, సందీ, ఇర్వురే అంధకాసురునితో ఏల పోరాడిరి? ఆ సమయాన శంకరుడెచట నుండెను? పులస్త్యుడిట్లు చెప్పెను. మునీ! వెయ్యేండ్లు మోహంలో మునిగి నందున అప్పటినుండి శివుని వీర్యం క్షీణమై ఆయన తేజస్సును కోల్పోయాడు. తన శరీరంలోని అంగాలు అలా బలం కోల్పోవడం గమనించిన ఆ శివుడు లెస్సగా ఆలోచించి తపోచర్యకు పూనుకున్నాడు. అలా దీక్షబూని, పార్వతిని సమాధానపరచి నందిని ఆమెకు కాపుగా నియమించి ఆ మహేశ్వరుడు భూమిమీద తిరుగసాగాడు. మహాముద్రాకృతిలో మెడను నిలిపి, మహాసర్పాల కుండలాలూ కంకణాలూ నడుముకు మానవాస్థికల మేఖలు ధరించి కుడి చేతిలో కపాలం ఎడమ చేతిలో కమండలం పట్టుకొని ఎక్కడా ఒకరోజుకన్నా ఎక్కువ కాలం ఉండకుండా, చెట్లక్రిందా గిరులలో సానువులలో నదులవెంటా తిరుగ మొదలెట్టాడు. అలా గడ్డలు కాయలు నీరు వాయువు భక్షిస్తూ ముల్లోకాల్లో తొమ్మిదివందలేండ్లు పర్యటించాడు. అనంతరం నోటిలో తాంబూల విడెము పెట్టుకొని ప్రాణవాయువును నిరోధించి రమణీయమైన హిమ వంతంమీద నొక సమతల ప్రదేశంలో ఆ యతి నిలచిపోయాడు. అంతట ఆ తమల పాకులనూ జటా మండలాన్ని చీల్చుకొని ఆ వెలుగులు జిమ్మే పరమేష్ఠి కపాలం భూమ్మీద పడి పోయింది. విడెము క్రిందబడటంతో గిరి శిఖరం బ్రద్ధలై అక్కడ సమతలభూమి ఏర్పడి పవిత్రమైన కేదారమనే తీర్థం ఉద్భవించింది. మహర్షే అంత నా వృషకేతనుడు ఆ తీర్థానికి పాపాలు పోగొట్టి పుణ్య వృద్ధి గావించి మోక్షసాధకమగునట్లుగా వరప్రదానం చేశాడు. ఓ తీర్థ రాజమా! ఏ మనుజులు ఆరునెలల కాలం నియమంతో మధు మాంసాదులు, ఇతరులు వండిన భోజనాదులు వర్జించి బ్రహ్మచర్యంతో, నీ పవిత్ర జలపానం చేస్తూ దీక్ష నెరపుదురో వారల హృదయ కమలాల్లో నా లింగం స్థిరంగా ఉంటుంది. ఇది సత్యము. తిరిగి వారల బుద్ధి పాపకార్యాలకు పోదు. వారల పితృదేవతలకు అక్షయ శ్రాద్ధఫలం లభిస్తుంది. స్నాన దాన తప హోమ జపాదు లొనరించు వారలకు అక్షయ ఫలము లభిస్తుంది. మృతులగు వారలకు తిరిగి పుట్టుకఉండదు. అలా శివునిచేత వరంపొంది ఆకేదారం అతి పవిత్ర క్షేత్రమై ఆ త్రినేత్రుని వచనానుసారం మానవులను పవిత్రుల గావిస్తూ దేవతలను తృప్తిపరుస్తూ విరాజిల్లుతోంది.