వామన మహా పురాణము
తప్తకృచ్ఛ విధానం
అందులకు వాసుదేవుడిలా చెప్పాడు. మూడు రోజులు వేడినీరు త్రాగుతూ మూడు రోజులు పాలుత్రాగుతూ మూడు రోజులు నేయిత్రాగి మిగిలిన మూడు నాళ్ళూ వాయు భక్షణం చేస్తూ గడపాలి. తర్వాత రోజూ క్రమంగా పన్నెండు పలాల, నీరు, ఎనిమిది పలాల పాలు ఆరు పలాల నేయి త్రాగాలి. ఇతి తప్తకృచ్ఛ్ర నియమం. నారదా! ఆ విధానాన్ని విన్న దేవతలు ఇంద్రునితో కలిసి కాయశుద్ధికోసం ఆ తపకృచ్ఛ్ర వ్రతం కావించి పాపముక్తులైనారు. అంతట వారందరూ కేశవునితో, భగవాన్ ఆ శంభువు ఎక్కడుండేది. చెబితే క్షీరాదులతో అభిషేకిస్తామని అన్నారు. అందుల కా విష్ణువు ఇదుగో శంకరుడు నాతో కలసి నా దేహంలో ఉన్నాడు. మీకు కనిపించడంలేదా? అని అడుగగా ఆ దేవతలు కనిపించుట లేదు. ఓమధుసూదనా! ఆ మహేశ్వరు డెక్కడున్నాడో నిజంగా చెప్పండని ప్రార్థించారు. అంత ఆ అవ్యయుడైన శ్రీహరి ఆ ఈశ్వర లింగాన్ని, తన హృదయ కమలంమీద శయనించినట్లుగా దేవతలకు చూపించాడు. అంతట సంతోషించి సురలా లింగమూర్తిని విధానం ప్రకారం క్షీరాదులతో నభిషేకించి గోరోచన లేపనం చందనాదులతో అలంకరించారు. బిల్వపత్ర పుష్పాదులతో పూజచేసి భక్తితో అగురు దూపంవేసి మహౌషధులు నైవేద్యంగావించారు. అష్టోత్తర శతనామ జపంచేసి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. పరస్పర విరుద్ధా అయిన సత్వతమో గుణాత్మకులయిన హరిహరులొకటిగా కలియుట ఎలా సంభవమా! అని ఆ దేవతలు తమలో తాము మథనపడునంతలో ఆ ప్రభువు అవ్యయుడు, సర్వాయుధాలు ధరించి సర్వ లక్షణ సంపన్నుడై విశ్వరూపం ధరించాడు. హరిలో గలసిన శివుడు మూడునేత్రాలు, సర్ప పద్మ కుండలాలు, జటాజూటం, గరుడ వృషభ ధ్వజం, సర్పహారాలు, పీతాంబరం, వ్యాఘ్రాజినం, వనమాల, చక్ర ఖడ్గ శంఖ, హల శార్‌ఙ్గ పినాక శూల అజ గవ, ఖట్వాంగ కపాల ఘంటాది (శివకేశవులకు సంబంధించిన) ఆయుధాలు ధరించి నిలచాడు. హరిహరాత్మకమైన ఆ అద్భుతమూర్తిని దర్శించి బ్రహ్మాదులయిన దేవతలందరు ఓ సర్వగతా! అవ్యయా! ప్రభూ! నీకు నమస్కారమని ప్రణామాలు గావించి ఆ ఇర్వురు ఒకటియే అని తెలుసుకున్నారు. ఆవిధంగా ఏకాబిప్రాయంతో ఉన్న ఆదేవతలందరను తీసికొని శ్రీహరి వెంటనే తన ఆశ్రమ స్థానమైన కురుక్షేత్రానికి తీసుకొని వెళ్ళాడు. అచట జలాల్లో స్థాణువుగా నిలచిన శంకరుని ప్రభూ! స్థాణుదేవా! నీకు నమస్సులంటూ కీర్తించి ఉపవిష్టులయ్యారు. అపుడు సురపతి ప్రభూ జగన్నాథా! జగత్తంతా సంక్షోభంలో ఉంది. నీవు నీటినుండి బయటకు వచ్చి వరము అను గ్రహించి మమ్ము ఉద్ధరించుమని అర్థించాడు. దేవేంద్రుని మధుర వచనా లాలకించి ఆ వృషభధ్వజుడూ, సర్వవ్యాపీ నిరంజనుడూ అగు శివుడు బయటకు వచ్చి నవ్వుతూ దేవత లందరకూ నా మనస్సు స్వాగతం చెప్పాడు. దేవతలంతా నా త్రినేత్రునకు నమస్కరించారు.
ఓ ప్రభూ! హరా! ముల్లోకాలు నీ తపోగ్నికి క్షోభించిపోతున్నాయి. కనుక ఈ కఠోర వ్రతాన్ని వెంటనే వదలండి అని దేవతలు కోరగానే ఆయన తన దీక్ష విసర్జించాడు. దేవతలు సంతోషంతో తమ నెలవులకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడ భూమి కంపిస్తూనే ఉంది. అందులకు కారణమేమో అని రుద్రుడు ఆ కురుక్షేత్ర పరిసరాల్లో వెదకగా ఓఘవతీ నదీతీరాన శుక్రుడు కఠోర తపస్సు చేస్తున్నాడు. అంతట భవు డాయనను ఓఉశనసా! ఏ కోర్కెతో జగత్సం క్షోభం కలిగించే ఈ తపస్సు చేస్తున్నావనగా నా శుక్రుడు ఓ త్రినేత్రా! శుభంకరమైన సంజీవని విద్యను తెలుసుకోగోరుతున్నా. అందులకే నీకు ప్రీతికరంగా తపస్సు చేస్తున్నానన్నాడు. అంతట హరుడు ఓ తపోధనా! నేను ప్రసన్నుడనైనాను కనక సంజీవినీ విద్యామర్మం నీవు తెలుసుకో గలుగుతావని వరం ఇవ్వడంతో నా తేజస్వి తన తపోదీక్ష విరమించాడు. అయినప్పటికీ ఇంకా గిరి సముద్రాలతో సహా భూమి కంపిస్తూనే ఉంది. అంతట శివుడు పవిత్రమైన సప్త సారస్వత క్షేత్రానికి వెళ్ళి అక్కడ మంకణ మహాముని ఆనందాతిరేకంతో నాట్యం చేయడం చూచాడు. ఆ మంకణకుడు పిల్లవాడిలాగ చేతులు త్రిప్పుతూ నేలమీద దొర్లుతూ గంతులేస్తూ ఉన్నాడు. ఆ వేగానికి భూమి కంపించి పోతోంది. శంకరు డతనిని సమీపించి నవ్వుతూ, ఓ మహర్షీ! ఎందుకిలా గంతులేస్తున్నావు? నీ ఆనందానికి కారణం నాకు చెప్పమంటూ చేయిపట్టుకొని నిలదీశాడు. ఆ మంకణుడు ఓ విప్రేంద్రా! విను. నా ఆనందానికి కారణం. ఎన్నో ఏండ్లుగా కాయశుద్ధి కోసం నేను చేస్తున్న తపస్సు నేడు ఫలించింది. ఇదిగో చూడు. నాచేతికి గాయమైన చోట రక్తానికి బదులు శాకరసం (ఆకుకూర రసం) కారుతోంది. ఇంతకన్నా ఆనంద మేమి ఉంటుంది? అందుకే ఇలా నృత్యం చేస్తున్నానని చెప్పాడు. అది విని శివుడు మంకణునితో ఓయీ! ఇటుచూడు. నేను వ్రేలితో కొట్టినంతమాత్రాన్నే స్వచ్ఛమైన భస్మం వస్తున్నది. అయితే అందుకు నేనేమీ వళ్ళుమరచి నృత్యం చేయడంలేదే! నిజంగా నీకు మత్తెక్కినట్టుంది అన్నాడు. అదిచూచి చకితుడై సిగ్గుతో తలవంచుకొని శివునకు వందనము చేశాడు అముని. అంతట హరుడు ఓ మునీ! నీవు అవ్యయమైన బ్రహ్మలోకానికిపొమ్ము. ఈ ప్రదేశం కూడ పృథూదకంతో సమానమైన పుణ్యతీర్థంగా విలసిల్లుతుంది. ఈ సారస్వత తీర్థంలో సురాసుర గంధర్వ విద్యాధర కిన్నరాదులు నిత్యం సన్నిహితులై ఉంటారు. ఇది ధర్మానికి పట్టుగొమ్మగా ఉంటూ పాపమలాలన్నింటినీ నశింపజేస్తుంది అని వరమిచ్చాడు. సుప్రభ, కాంచనాక్షి సువేణు, విమలోదకంతోకూడిన మనోహర, ఓఘవతి, విశాల, సరస్వతీ జలాలతో పునీత మైన ఈ సప్తసారస్వత తీర్థం సేవిస్తే సోమపానం చేసిన ఫలం లభిస్తుంది. ఈ సప్త సరస్వతులు ఎప్పుడూ ఇక్కడ ఉంటాయి. ప్రతిఒక్క నదీ సోమయాగఫలం కలుగజేస్తుంది. నీవు కూడ ఇక్కడ మహిమగల మూర్తి స్థాపనం చేసి దుర్లభమైన బ్రహ్మ లోకానికి పోగలవు. శంకరుని ఆదేశం ప్రకారం ఆ తపస్వి, ఆ కురుక్షేత్రంలో మూర్తి స్థాపన గావించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. మంకణుడు వెళ్ళిపోవడంతో భూమి కంపించడం తగ్గి యథాస్థితికి చేరుకుంది. శివుడుగూడ తన నెలవు మందరగిరికి వెళ్ళిపోయాడు. ఓ బ్రహ్మర్షీ! శంకరుడు మందరగిరి వదలి తపస్సుకు ఎందుకు వెళ్ళినదీ నీకువివరించాను. ఆయనలేని సమయంలోనే దుర్బుద్ధి అంధకుడు వెళ్ళడం, పరమేశ్వరితో యుద్ధం చేయడం జరిగింది.