వామన మహా పురాణము
ప్రహ్లాదకృత హరిస్తుతి
అయోని, జగద్యోని, దేవదేవుడు, జగత్తుకు ముందు పుట్టినవాడు, మొదలులేని వాడు, విశ్వానికి మొదలయినవాడు వరదాతలలో శ్రేష్ఠుడు శ్రీహరి, పరావరేశ్వరుడు అందరకు పరమగతి యగువాడు, సమస్తమైన మానము (కొలత)లకు ప్రమాణం ఈరేడు లోకాధిపతులకు అధిపతి అయిన ఆ జగన్నాథుడు ఊహకందని ప్రభువు. విశ్వస్థితి (వ్యవస్థ) నుద్ధరించుటకై సామాన్యునివలె గర్భస్థుడైనాడు! ప్రభువులకు ప్రభువు, పరములకు పరముడు తుద నడిమి చివర అంటూ లేని భగవంతుడు, తన కలాంశతో ముల్లోకాలను సనాథంచేయుటకై అదితి గర్భంలో అవతరించాడు! ఓ దైత్యపతీ! రుద్రుడు బ్రహ్మ ఇంద్రుడు సూర్య చంద్ర మరీచ్యాదులు ఏ అప్రమేయుని స్వరూపం తెలియజాలకున్నారో ఆ వాసుదేవుడు తన అంశతో అవతరించాడు. వేదవిదులెవ్వని నాశరహితుడని చెప్పుదురో, జ్ఞానాగ్ని దగ్ధపాపులెవనిలో లయమందుదురో, ఎవనిలో లయించిన వారు మరల జన్మించరో అట్టి వాసుదేవ పరమాత్మకు ప్రణామములు. అనంతమైన జీవరాసు లెవని నుండి సముద్రంలో లేచే కెరటాలులాగా నిరంతరం ఉద్భవిస్తూ ఉంటాయో, మరల యే దివ్యతత్త్వంలో అవన్నీ లయమైపోవునో అట్టి అచింత్య స్వభావుడగు వాసు దేవునకు నమస్సులు. ఎవనిరూప బలప్రభావాలు, ప్రతాపశౌర్యాలు సర్వబ్రహ్మాదులుకూడ తెలియలేరో అట్టి పరమపురుషుడగు వాసుదేవునకు ప్రణామాలు.
ఎవడు కన్నులకు రూపగ్రహణశక్తిని చర్మమునకు స్పర్శశక్తి, నాలుకకు రసగ్రాహిత్వం ముక్కుకు వాసనచూచుశక్తినీ ప్రదానంచేస్తూ తాను ఆఘ్రాణ చక్షుః శ్రవణాలు లేకుండా ఉంటాడో పరమార్థ దృష్టితో చూస్తే ఎవడు స్వయంప్రకాశియో, సర్వేశ్వరుడో, యుక్తిచేత తెలియ దగిన శరణ్యుడో పాపరహితుడో అట్టిపూజనీయుడగు శ్రీహరికి పరమ ప్రభువుకు నమస్కరించుచున్నాను. ఏ శక్తి సంపన్నుడీ భూమినంతనూ ఒక్క పంటితో ఎత్తినాడో, సకల సృష్టినీ ధరించుచున్నాడో, మరల ఈ జగత్తునంతనూ తనలోకి చేర్చుకొని యోగనిద్రలో ఉంటాడో అట్టి పూజ్యుడగు విష్ణుదేవునకు ప్రణామం చేస్తున్నాను. మాతృగర్భంలో కలాంశతో ప్రవేశించిన మాత్రాననే మహాదైత్య యోధుల తేజస్సునంతటినీ ఎవడు హరించివైచెనో, అట్టి అనంతునకు ఈశ్వరునకు సంసారవృక్షాన్ని ఛేదించే కుఠారరూపి అయిన ప్రభువుకు నమస్సులు. ఓ రాక్షసేంద్రులారా! అలాంటి జగత్ప్రభువైన దేవదేవుడు తన పదునారవ కలాంశతో దేవమాత అదితి గర్భగతుడైనాడు. అతడే మీ తేజోబలాలను హరించియున్నాడు.