వామన మహా పురాణము
ఇంద్రుని బ్రహ్మలోక సందర్శనం
నారదా! తన త్రిలోకాధిపత్యం రాక్షసుల పాలైపోగా మొగము వ్రేలవేసికొని దేవతలతో కలిసి యింద్రుడు బ్రహ్మసదనానికి వెళ్లాడు. అక్కడ పద్మోద్భవుడైన బ్రహ్మను, ఋషి సమూహాన్ని తన తండ్రి అయిన కశ్యప మహర్షిని, చూచి వారలందరకు తలవంచి ప్రణామాలు గావించి ఇలా విన్నవించాడు. “పితామహా! నా రాజ్యాన్నంతనూ బలిదైత్యుడు బలపూర్వకంగా అపహరించాడు. “అదివిని చతుర్ముఖుడు “అదిఅంతా నీ స్వయంకృతా పరాధ ఫలితమే”ననగా శక్రుడు - భగవాన్ నేను చేసిన దోషమేమో సెలవియ్యండి.” అనగా అచటనేయున్న కశ్యపుడు - “అది భ్రూణహత్యా పాపం. దితిగర్భస్థ పిండాన్ని నీవు ముక్కలు గావించిన పాపఫలం” అని మందలించగా ఆ పురందరుడు - ప్రభూ! ఆమె అశుచిగా ఉన్నందుననే గర్భనాశం సంభవించిందని బదులుచెప్పగా కశ్యపుడు అశౌచంవల్ల గర్భానికి దాసత్వంకలిగింది. అయితే నీవు ఆ దాసుణ్ణి కూడా వజ్రంతో సంహరించావుగా” అనగా ఖిన్నుడై బ్రహ్మతో ఇంద్రుడు ఇలా మొర పెట్టాడు. ప్రభో! అపరాధం జరిగింది. ఆ పాపానికి పరిహారం ప్రాయశ్చిత్తం సెల వియ్యండి.” ఇంద్రుని ప్రార్థన విని బ్రహ్మ, కశ్యపుడు, వసిష్ఠుడు, యింద్రునకూ అతనితో బాటు జగత్తుకూ మేలు కలుగునట్లు హితం చెప్పారు. “సహస్రాక్షా! శంఖ చక్రగదాధరుడూ పురుషోత్తముడు అగు మాధవుని శరణు వేడుకొనుము. ఆయన నీ శ్రేయస్సుకై తగిన ఉపాయం చెప్పగలడు!” గురు జనుల ఆహితవచనం విని ఇంద్రుడు స్వల్పకాలంలో అధిక అభ్యుదయం సాధించుట ఎక్కడ వలనుపడునో తెలుప మనగా ఆమహర్షులు అది మర్త్యలోకంలోనే సాధ్యమని చెప్పారు. అలా బ్రహ్మ, కశ్యప, వశిష్ఠులు చెప్పిన సలహా వినిన తక్షణమే ఇంద్రుడు భూలోకానికి చేరుకున్నాడు. కాలింజర క్షేత్రానికి ఉత్తరాన హిమవత్పర్వతానికి దక్షిణాన, కుశస్థలికి తూర్పున వసుపురానికి పశ్చి మానగల ఆ పవిత్ర క్షేత్రంలో పూర్వరాజవరుడైన గయుడు సదక్షిణాకంగా నూరు అశ్వమేధ యజ్ఞాలు, నరమేధ యజ్ఞాలు నూరు, వేయి, రాజసూయ యాగాలు గావించాడు.
అంతేకాదు ఆ గయుడా ప్రదేశాన దేవతలకు అసురులకు దుష్కరమైన మహామేధ మనే యజ్ఞంచేశాడు. ఆకాశరూపి, మురమర్దనుడునైన అవ్యక్తరూపి విష్ణువు ఆప్రదేశాన గధాధరుడుగా వెలశాడు. ఆప్రదేశం భయంకరమైన పాప వృక్షాలను కూల్చే కుఠారంగా ప్రసిద్ధి గాంచింది. వేద శాస్త్ర వర్జితులైన ద్విజులుగూడ ఆప్రదేశాన్ని సేవించి బ్రహ్మతో సమానులౌతారు. ఒక్క పర్యాయమైనా అక్కడ శ్రద్ధగా పిండదానంతో పితృ పూజ చేస్తే అది మానవులకు అక్షయమైన మహామేధ యజ్ఞ ఫలాన్నిస్తుంది. దేవ ఋషి కన్య అయిన మహానది, జలరూపంలో హిమగిరి వైపు ప్రవహిస్తూ ఆ ప్రదేశాన, తన దర్శన స్నాన జల ప్రాశనాదులచే జగత్తులోని పాపాలన్నింటినీ క్షాళనం చేస్తూంటుంది.