శంకరుడు సుదర్శనాన్ని, వాసుదేవుడు శూలాన్ని ధరించిన వృత్తాంతం

నారదుడు పులస్త్యుని మాటవిని ఇలా ప్రశ్నించాడు. బ్రహ్మర్షీ! శంకరుడు సుదర్శనాన్ని వాసుదేవుడు శూలాన్ని ఎందుకు ధరించారు దయచేసి చెప్పండి. అందులకు ఆ పులస్త్యుడు యిలా చెప్పసాగాడు నారదా! ఈ ప్రాచీన గాథ చెబుతాను వినుము. దీనిని పూర్వం విష్ణువు భవిష్య మనువుకు చెప్పాడు. ఒకప్పుడు జలోద్భవుడనే మహాదైత్యేంద్రుడు భయంకరమైన తపస్సుచేసి బ్రహ్మదేవు నారాధించాడు. అయన సంతోషించి, దేవాసురులకు అవధ్యుడుగాను, స్వంత ఆయుధాలచేత ఎవరిచేతను చంపబడ కుండునట్లును, బ్రహ్మర్షుల శాపాలు వానికి తగులకుండు నట్లును, నీటిలో నీటిగుణాన్ని అగ్నిలో అగ్నిగుణాన్ని కలిగియుండునట్లూ అసాధ్యమైన వరాలు ఆ దుష్టుడికి ఇచ్చాడు. అంతటితో మదించి ఆ దానవుడు దేవర్షులను రాజులను అందరూ బాధిస్తూ భూమిమీద తిరగడం మొదలుపెట్టాడు. యజ్ఞాది ధర్మ కార్యాలు ధ్వంసం చేయసాగాడు. వాడి బాధలు పడలేక దేవతలు మానవులు రాజులు విష్ణుని పాలికి వెళ్ళి మొరబెట్టుకోగా ఆయన వారిని వెంటబెట్టుకొని హరుని నివాసమైన హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ హరిహరులిరువురు ఆలోచించుకొని ఎలాగైనా దేవతలకు ఋషులకు మేలు చేసేందుకైనా వాడిని సంహరించ నిశ్చయించుకున్నారు. తమతమ ఆయుధాలను పరస్పరం మార్చుకున్నారు. ఆ జలోద్భవుని సంహరించేందుకు భయంకర రూపాలు ధరించి వాడిని వెతకసాగారు. అలా హరి హరులిరువురు ఆయుధాలు మార్చుకుని తనను పరిమార్చుటకై ఘోర రూపాలతో బయలుదేరడం వారలు అవధ్యులు కావడం తెలుసుకొని ఆదానవుడు భయకంపితుడై జలాల్లో మునిగి కూర్చున్నాడు. ఆ దేవశత్రువు నీళ్లలో కరిగిపోవడం తెలుసుకుని తీయని జలాలుగల ఆ విశాలా నది ఉభయ తీరాల్లో కనపడకుండా అదృశ్యులై నిలిచారు. కొంతవడి జలోద్భవుడు మెల్లగా నీటినుండి బయటకు వచ్చి బెరుదుచూపులతో నలువైపులా చూస్తూ హరిహరులు వెళ్లి పోయారని నిశ్చయించుకుని దుర్గమమైన హిమాద్రి శిఖరాని కెగబ్రాకి కూర్చున్నాడు. అలా వాడు నాగరాజు శిఖరాన తిరుగాడడం చూచి శంకర నారాయణు లిరువురు మహా వేగంతో పరుగెత్తి తమ ఆయుధాలతో వాడి శరీరాన్ని ఛేదించారు శంఖ చక్రధారులకూ, విష్ణుశూలాఘాతానికి దేహం చిల్లులు పడిపోగా బంగారుకాంతి గల శరీరంతో, అకాశాన్నుంచి తెగిపడే ఉజ్వలనక్షత్రంలాగా ఆ దుష్టుడా శైలశిఖరాన్నుండి గతప్రాణుడై పడిపోయాడు. ఆ విధంగా లోకకంటకుడైన ఆ దుష్టుని సంహరించేందుకు శివుడు చక్రాన్నీ విష్ణువు శూలాన్నీ ధరించవలసి వచ్చింది. ఆ సంఘటన శివుని పాదాఘాతంవల్ల శిశిరగిరి నుంచి ఉద్భవించిన పాపనాశిని వితస్తానదీ పరిసరాలలో జరిగింది. ప్రహ్లాదుడు ఆ ప్రదేశాన్ని దర్శించి దేవాది దేవులయిన ఆ హరిశంకరులను పూజించి భక్తితో ఉపవాసం గావించి శివకేశవులచేత రక్షితుడైన ఆ నగాధిరాజు హిమవంతుని చూచుటకు వచ్చాడు. ఆగిరీశుని విధ్యుక్తంగా అర్చించి బ్రాహ్మణులకు దానాలొసగి విశాలమైన హిమాలయ పాద ప్రదేశానగల భృగుతుంగ క్షేత్రానికి వెళ్లాడు. అచ్చట దేవశ్రేష్ఠుడైన విష్ణువునకు శంకరుడు చక్రాయుధాన్ని ప్రదానంచేయగా దానిశక్తిని పరీక్షింపదలచి విష్ణువు దాన్ని ప్రయోగించి, శివుణ్ణే మూడు ముక్కలుగా ఖండించాడు.