వామన మహా పురాణము
వామనపురాణ ఫలశ్రుతి
పులస్త్యుడిలా అన్నాడు. బ్రహ్మర్షీ నారదా! పుణ్యతమమైన ఈ వామన పురాణాన్ని నీకు సాకల్యంగా వినిపించాను. దీనిని శ్రద్ధా భక్తులతో వినినా, పఠించినా, కీర్తించినా విష్ణుపద ప్రాప్తి కలుగుతుంది. గంగానదీ జలాల్లో మునిగినందున పాపాలు తొలగునట్లుగానే ఈ పురాణ శ్రవణం వల్ల సకల దురితాలు నశిస్తాయి. ఈ వామన పురాణాన్ని చదివించుకుని విన్నందువల్ల, అటువంటి వారికి వ్యాధులు కలుగవు. విషప్రయోగాలు, మంత్ర ప్రయోగాలు బాధించవు. వారలకే కాక వారి వంశంలో సున్న వారెవ్వరికీ ఎలాంటి బాధలు కలుగవు. ప్రతిదినం విష్ణు దేవుని పూజించి, నమస్కరించి, భక్తిపూర్వకంగా దీనిని విన్నచో సమస్త పాపాలు నశించి దక్షిణలతో సహా అశ్వమేధయాగం చేసినంత సంపూర్ణ ఫలం లభిస్తుంది. గో, భూ, సువర్ణ, రథ, గజ, తురగాలు దానం చేసిన ఫలం దక్కుతుంది.
పురుషులుగాని, స్త్రీలుగానీ కనీసం, ఒక శ్లోకంలో ఒక పాదాన్నైనా భక్తితో వింటే పృథివిలో పవిత్రులు, పుణ్యాత్ములు అవుతారు. నైమిశారణ్య పుష్కర క్షేత్రాల్లో స్నానం చేస్తే, ప్రయాగలో మాఘస్నానాలు చేస్తే భాగీరథిలో కోకాముఖక్షేత్రంలో స్నానం చేస్తే కలిగే పుణ్య ఫలం అనన్యచిత్తంతో వామన పురాణం వింటే కలుగుతుందని విప్రులు వక్కాణిస్తారు. నారదా! ఇక నా దృఢ విశ్వాసం వినుము. ఈ మహా పురాణ శ్రవణం వల్ల రాజసూయ యాగంచేసిన ఫలంవస్తుంది. భూలోకంలో దీనిని విన్నవారలకు దేవలోకంలో సౌత్రామణి క్రతువుచేస్తే ఏ మహత్సుఖం కలుగుతుందో అది సంపూర్ణంగా లభిస్తుందనడంలో సంశయం ఏ మాత్రం లేదు. సూర్యచంద్ర గ్రహణ పవిత్ర పర్వాల్లో రత్న రాసులు దానం చేస్తే వచ్చేఫలం, అగ్నిపూజా నిరతుడగు విప్రవరునకు ఆకలిగొన్న వేళ భోజనం పెడితే వచ్చే పుణ్యం, కరువుకాటకాల్లో ఆకలితో బాధపడే పుత్ర కళత్రసహితుడైన వానికి అన్నంపెట్టిన పుణ్యం, స్త్రీలకు తోడుగా నిలచే వారలకు, దేవ అగ్ని ఋషి బ్రాహ్మణ పితృదేవతల నర్చించేవారలకు, తల్లిదండ్రులకు, జ్యేష్ఠ సోదరులకు, శుశ్రూషచేసి, సహాయపడితే కలిగే సత్ఫలాలన్నీ ఈపవిత్ర పురాణ పఠనం వల్ల తప్పక లభిస్తాయి. పదునాల్గవదైన వామన పురాణాన్ని ప్రముఖమైన (అగ్ర్య) పురాణంగా కీర్తిస్తారు. దీనిని విన్నందున సాధారణ పాపాలే కాక మహాపాతకాలు సర్వమూ నశిస్తాయి. నారదా! ఇది ముమ్మాటికీ నిజం. నమో నమః కారణ వామనాయ! దేవకార్య సిద్ధికై వామన రూపం ధరించిన విభో నీకు నమస్కారం! అంటూ నియమంతో ప్రభువు నామాభివందనం చేయు ధన్యులకు దేవ పూజితుడైన విష్ణుడు మోక్షపదం ప్రదానం చేస్తాడు. ఈ పురాణాన్ని చదివి వినిపించిన సజ్జనులను గో భూ హిరణ్య వస్త్ర అభరణాలతో భక్తితో సత్కరించాలి. ధన లోభం చూపరాదు.
ఇది శ్రీ వామన పురాణం సర్వమూ ముగిసినది
హరిః ఓం తత్ సత్