ఇంద్రుడు పాకశాసనుడు పురందరుడు అయిన విధం

అటు పిమ్మట పులస్త్యునితో నారదుడిలా అడిగాడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! మలయ పర్వతం మీద ఇంద్రుడు తన స్వంత పనులెలా నిర్వర్తించు కొనెనో ఆ వివరాలు తెలియచెప్పండి. అందులకు ఆ పులస్త్యుడు ఓ నారదా! మలయ పర్వతానికి వెళ్లి ఇంద్రుడు నిర్వర్తించిన లోకహిత కార్యమూ తన కార్యమూ చెబుతున్నా వినుము. అంధకాసురుడి అనుచరులలో, యుద్ధంలో ఓడిపోయిన మయతారాది రాక్షసులు పాతాళానికి వెళ్లవలెనని ఉత్సహించి వెళ్లుతూ దారిలో సిద్ధులకు నివాసాలయిన గుహలతో లతా సమూహాలతో మదించిన మృగాదులతో అలరారే మలయ పర్వతాన్ని చూచారు. మహాసర్పాలతో చుట్టుకొనబడిన చల్లని చందన తరువులతో మాధవీకుసుమ పరిమళంతో నిండిన ఆ గిరి మీద ఋషులు శివార్చనలు గావిస్తున్నారు. యుద్ధవ్యాయామంతో అలసిపోయిన మయుడు, తార్క్ష్యుడు మొదలయిన రాక్షసులు అచ్చటి చల్లని వాతావరణం చూచి ఆ చెట్ల నీడల్లో కూర్చొని యుండగా, సుగంధంతో కూడిన దక్షిణ వాయువు మెల్లగా వీచినది. ఆ సుఖానికి ముగ్ధులై వారచటనే స్థిరంగా ఉండి పోయారు. లోక పూజ్యులైన దేవతలను ద్వేషించసాగారు. ఆ విషయం తెలిసికొనిన శివుడు ఇంద్రుణ్ణీ దేవతలనూ అక్కడకు పంపాడు. దారిలో ఆ దేవరాజుకు కామధేనువు కనిపించగా అతడా గోమాతకు ప్రదక్షిణం చేసి, అందమైన మలయగిరినీ, అచట ఇష్ట భోగాల్లో మునిగియున్న దానవులందరనూ చూచాడు. వెంటనే ఆ బలారి ఆ రాక్షసులను యుద్ధాని కాహ్వానించగా వారంతా బాణ వర్షం కురిపిస్తూ ఆయన మీద కెత్తి వచ్చారు. అద్భుత దర్శనుడైన ఆ శక్రుడు రథం మీద కూర్చొని, ఓ నారదా! కొండలను మేఘాలు కమ్ముకున్నట్లు ఆ దానవులను తన బాణాలతో కప్పి వేశాడు. అలా మయుడు మొదలయిన రాక్షసులను బాణాలతో ముంచెత్తి, పాకుడనే మహా అసురుణ్ణి వాడిమొనగల్గి గ్రద్ద ఈకలతో అలంకరించబడిన బాణాలతో సంహరించాడు. పాకుడనే దానవుని శాసించినందున ఆయన కానాటి నుండి పాకశాసనుడను పేరు కలిగింది. బాణాసుర పుత్రుడైన పురుడనే మరొక రాక్షస వీరుణ్ణి బాణ పరంపరతో చీల్చి చెండాడి పురందరుడనే బిరుదు కూడ పొందాడు.