వామన మహా పురాణము
పులస్త్యునికి నారదుని ప్రశ్న
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్ ।
నారాయణునకు ఉత్తముడగు నరునకు సరస్వతీ దేవికి వ్యాసభట్టారకునకు నమస్కరించి జయ కావ్యమును (పురాణము లేక ఇతిహాసము) చదువవలెను.
త్రైలోక్యరాజ్య మాక్షిప్య బలేరింద్రాయ యో దదౌ
శ్రీధరాయ నమస్తస్మై ఛద్మ వామనరూపిణే ।
ముల్లోకముల వ్యాపించిన రాజ్యమును వామనుడను మాయావేషముతో బలి నుండి లాగికొని ఇంద్రునకొసగిన శ్రీధరునకు నమస్కారము.
జ్ఞానులలో శ్రేష్ఠుడును, తన ఆశ్రమమున సుఖోపవిష్టుడైన వాడును అగు పులస్త్య మహర్షిని నారదుడు వామనునకు సంబంధించిన పురాణమును గురించి ప్రశ్నించెను.
బ్రహ్మర్షీ! సర్వసమర్థుడై యుండియు పురాసమయమున విష్ణువు మరుగుజ్జు రూపమును ఎందుకు ధరించెను.
దైత్య శ్రేష్ఠుడగు ప్రహ్లాదుడు పరమ వైష్ణవుడైనను దేవతలతో ఎందుకు యుద్ధం చేశాడు? ఈ సంశయము నన్ను పీడిస్తున్నది. దీనిని తొలగించుడు అని ప్రార్థించాడు. అంతేగాకుండా దక్షపుత్రియగు సతీదేవి శంకరునకు ప్రియమైన అర్ధాంగి అయినదిగదా, ఆ శుభాంగి తన శరీరమును వదలి పర్వతేశ్వరుడగు హిమవంతుని ఇంట మరల ఎందుకు జన్మించింది? మరల దేవదేవుడగు శంకరుని ఏల పరిణయము చేసుకున్నది? ఈనా సందేహములను సర్వజ్ఞుడవగు నీవు తొలగింపుము. ద్విజశ్రేష్ఠా! అనేకవిధాలైన వ్రతములుచేసే విధానాలను, తీర్థక్షేత్రాల మాహాత్మ్యమును, దానాల మహిమను దయతో నాకు తెలియజేయుము.
అని ఈ విధముగ ప్రశ్నించిన తపోనిధి నారదునితో మునిశ్రేష్ఠుడైన చక్కనివాక్కులు గల పులస్త్యుడు ఇట్లు అనెను.
ఓ మునిసత్తమా! నీవు కోరినట్లుగా మొదటి నుండి క్రమంగా వామన పురాణమును సమగ్రముగ చెప్పెదను. సావధానుడవై వినుము.