మార్కండేయకృత సరస్వతీ స్తుతి

ప్లక్ష వృక్షంలో ఉండగా ఆమెను చూచిన మార్కండేయ మహాముని శిరసా ప్రణామంచేసి ఆ దేవిని స్తోత్రం చేశాడు. “దేవీ! నీవు సర్వలోక జననివి. మంగళమూర్తివైన దేవమాతవు (దేవారణివి). సదస ద్రూపమైన దంతయూ, మోక్షదాయి అయినదీ, అర్థవంతమైన పదమేదైతే కలదో అదంతయు యోనిలో సర్వం నిహితమైనట్లు, నీలో గర్భితమై ఉన్నది. అక్షరమైన పరబ్రహ్మతత్వం, క్షరాత్మకమైన (మారుతున్న) విశ్వం అంతయు పరాశక్తివగు నీలో ఇమిడియున్నది. దారువు (కొయ్య)లో అగ్నివలె, భూమిలో గంధ (వాసన) గుణంమాదిరి, అనంతమైన జగత్తు, బ్రహ్మతత్వంలో నీలో నిండియున్నది. ఓ దేవీ! ఓంకారంలోని స్థిరాస్థిరమైన త్రివర్ణ మాత్రాక్రమం, ఉన్నది లేదనుభావం, మూడులోకాలు, మూడు వేదాలు, మూడు విద్యలు, త్రేతాగ్నులు, జ్యోతిత్రయం, త్రివర్గాలు, ధర్మాదిత్రయం, త్రిగుణాలు, త్రివర్ణాలు, త్రిమూర్తులు, మూడు ధాతువులు, అవస్థాత్రయం, పితరులు, మాత్రాత్రయం మొదలుగాగల త్రిపుటి అంతా ఓ సరస్వతీదేవీ, నీ రూపమే. పరతత్వం యొక్క విభిన్న దర్శనాలన్నీ సనాతనివగు నీ లీలలేనమ్మా!

“ఓ దేవీ! బ్రహ్మవాదులగువారు నిన్ను ఉచ్చరించిన మాత్రాన్నే సోమ, హవిర్ పాకయజ్ఞాలు చేయగలుగుచున్నారు. అర్ధమాత్రా పరిమితమైన నీ పరమపదమట్టిదని నిర్దేశింప రాకున్నది. అది అవికారి, అక్షయమైనది, దివ్యమైనది, సర్వపరిణామరహితమైనది. అట్టి నీ దివ్య రూపాన్ని నేనేకాదు ఇతరులెవ్వరును వర్ణింపజాలరు. నోటికిగాని నాలుకకు గాని తాలువులు పెదవులకుగాని దానిని వర్ణించగల శక్తి లేదు. ఆ నీ రూపమే విష్ణువు, శివుడు, బ్రహ్మ, సూర్య చంద్రాగ్నులు, ప్రపంచానికి ఆశ్రయం విశ్వమే. విశ్వ యొక్క ఆత్మ, సాంఖ్యం, బహుశాఖా విస్తుృతమైన వేదములద్వారా ఆదిమధ్యాంతహీనమనీ, సత్తనీ, అసత్తనీ చెప్పబడినది. ఒకటి అయిగూడ అనేకము. ఒకే భావాన్ని ఆశ్రయించి యున్నది. పేరులేనిది, అయినా ఆరువిధాల అనేక విధాల పేర్కొనబడినది. త్రిగుణాలతో గూడినది నానాశక్తుల తత్వం తెలిసినది. నానాశక్తుల సంపుటి అయినది. సుఖాలన్నింటికి సుఖమైనది. సర్వతత్వ గుణాత్మకమైన మహాసుఖమే నీరూపం, సగుణ నిర్గుణాత్మకమైన ఈ విశ్వాన్నంతా ఓ భగవతీ! ఇలాంటి అద్భుతరూపంతో ఆవరించి యున్నావు! అద్వయ బ్రహ్మగా, ద్వైతబ్రహ్మగా నీవే వ్యవహరిస్తున్నావు! ఈ భూమిమీద గాని, అంతరిక్షంలోగాని యితరత్రాగాని ఉన్నట్టి, శాశ్వత అశాశ్వత స్థూల సూక్ష్మాది వస్తుజాల మంతకు ఆధారము నీవే! రూపు కట్టియు, కంటికగపడకయు, ఒకటిగాను, అనేకంగాను, వ్యస్తంగాను, సమస్తంగాను కనుపించే ఈ అఖిలము ఓదేవీ! నీవగు స్వర వ్యంజనాల సమాహారమే! మనోహర విన్యాసమే!” అని

తన నీ విధంగా స్తుతించిన మహాత్ముడగు మార్కండేయ మహామునితో విష్ణుజిహ్వ అయిన ఆ సరస్వతీ దేవి ఇలా పలికినది. విప్రోత్తమా! నీవెచ్చటకు గొనిపోవుదువో అచ్చటకల్లా నీవెంట అవిశ్రాంతంగా వస్తున్నాను. నడువుము.” అంతట ఆమార్కండేయు డా పరమేశ్వరితో “తల్లీ మొదట బ్రహ్మ సరోవరం అనంతరం రామసరస్సుగా, ఆ తర్వాత మహర్షికురువుచేత దున్నబడి కురుక్షేత్రంగా విఖ్యాతిగాంచిన పవిత్రక్షేత్రం మధ్య నీపావన జలాలతో త్వరితంగా ప్రవహింపు” మనెను.