వామన మహా పురాణము
కురుక్షేత్రంలోని సప్తవనాలు, నవ నదులు
ఆ మాటలను వినిన ఋషులు పౌరాణిక శ్రేష్ఠా! మాకిప్పుడు సప్తవనాలు, నవ నదులు తీర్థాలు వానిలో స్నానంచేస్తే వచ్చేఫలం, ఏఏ తీర్థాలను ఏఏ విధానసేవిస్తే యేయేఫలం కలుగుతుందో ఆవివరమంతా చెప్పండి అనిప్రశ్నించారు. అందుకు లోమ హర్షణుడిలా చెప్పటం మొదలు పెట్టాడు. ఓ ఋషులారా! కురుక్షేత్ర మధ్య భూమిలో ఏడువనాలున్నవి. వాటి పేర్లు పవిత్రాలు. అవి సర్వ పాపాలను హరిస్తాయి. పవిత్రమైన కామ్యకవనం, అదితివనం, వ్యాసవనం, ఫలకీవనం, సూర్య వనం, మధువనం శీతవనం-యివన్నీ సర్వకల్మషాలను హరిస్తాయి. ఇక నదుల వివరం వినండి. సరస్వతి, వైతరణి ఆపగా, గంగ, మధుస్రవ, వాసు, కౌశికి, దృషద్వతి హిరణ్యవతి ఈ నవనదులు పరమ పవిత్రాలు, సకల పాప నాశకాలు. వీనిలో సరస్వతి తప్ప మిగిలినవన్నీ వర్షాకాలంలో ప్రవహిస్తాయి. వర్షాకాలంలో గూడ వీటి ఉదకానికి రజస్వల దోషమంటదు. అవి పవిత్రమైన జలాలు. అందుకు కారణం అక్కడ ఉన్న పుణ్యతీర్థాలే సుమా!
మునులారా! యిక ప్రేమతో మహిమాన్వితమైన తీర్థ స్నాన ఫలం వినండి. వానిని స్మరించినా లేక సమీపించినా సర్వకల్మషాలు నశిస్తాయి. మొదట యాత్రికుడు రంతుకానికి వెళ్ళి మహాబలుడైన ద్వారపాలకుడు యక్షునకు మ్రొక్కి, తీర్థయాత్ర ప్రారంభించాలి. అక్కడ నుంచి అదితివనానికి వెళ్ళాలి. అక్కడనే ఆదేవమాత కఠోరమైన తపస్సుచేసి వామనుని పుత్రునిగా పొందింది. అచట స్నానంచేసి అదితి దర్శనం చేసినచో సర్వదోష రహితుడు, శూరుడు శత సూర్యకాంతి గల విమానం మీద తిరుగునట్టి పుత్రుడు కలుగును. అక్కడ నుంచి సవనమనే ప్రసిద్ధి చెందిన విష్ణుస్థానానికి వెళ్ళాలి. అక్కడ ఎల్లవేళల హరిసన్నిహితుడై యుంటాడు. అక్కణ్ణుంచి విమల తీర్థంలో మునిగి విమలేశ్వరుని దర్శించినచో నిర్మలమైన స్వర్గం, రుద్రలోకం పొందవచ్చు. శ్రీహరిని బలరాముని ఒకేచోట ఆసీనులగుట చూచినచో కలిదోషాలు వదలి ముక్తి పొంద వచ్చును. అచట నుంచి ముల్లోకాలలో విఖ్యాతి గాంచిన సరిప్లవ తీర్థానికి వెళ్ళి స్నానం చేసి వేదాలచే పరివేష్టితుడైన బ్రహ్మదేవుని దర్శించాలి. బ్రహ్మ, వేదాల అనుగ్రహం వల్ల పవిత్రమైన స్వర్గం పొందవచ్చును. అచట నుండి కౌశికి సంభవ తీర్థంలో సంగమం అయ్యేచోట, సంగమ జలాల్లో స్నానం చేస్తే మానవుడు పరమపదాన్ని పొందుతాడు. తర్వాత పాపాలు పోగొట్టే ధరణి తీర్థంలో మునిగినచో నరుడు క్షాంతికలవాడై ఉత్తమ పదం పొందుతాడు. ఆ తీర్థంలో స్నానం చేసినంతనే ఆ ధరణి మాత ప్రాణుల సర్వాపరాధాలు క్షమిస్తుంది. అక్కణ్ణుంచి దక్షాశ్రమంలో దక్షేశ్వర మహాదేవుని దర్శిస్తే అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని నరుడు పొందుతాడు. తర్వాత శాలూకినీ తీర్థంలో స్నానంచేసి అచట వేంచేసిన హరి హరులను భక్తితో పూజిస్తే పాపరహితులై ఇష్టమైన లోకాలను పొందుతారు. అచటనుంచి సర్పిద్దధి అనే ప్రసిద్ధమైన నాగతీర్థంలో మునిగినచో సర్ప విషభయాలుండవు. విప్రోత్తములారా! అచట నుంచి రంతుక ద్వారపాలుని వద్దకు వెళ్ళి ఒక రాత్రి గడిపి ఆ పవిత్ర తీర్థంలో స్నానం చేసి జాగ్రత్తగా రెండవద్వారపాలుని పూజించాలి. తర్వాత బ్రాహ్మణులను భుజింపజేసి ద్వార పాలునకు మ్రొక్కి యక్షేశ్వరా! నా అపరాధాలు క్షమించుము. నీ ప్రసాదం వల్ల సర్వ కిల్బిషాలు తొలగి నేను కోరిన సిద్ధి లభించున ట్లొనరింపుమని అతనిని ప్రసన్నుని గావించు కొనవలెను. అక్కడ నుంచి రాక్షసులకు భయంకరంగా రుద్రుని చేత నిలుపబడిన అయిదు సరస్సుల పంచనద తీర్థంగా లోక ప్రసిద్ధి గాంచిన తీర్థానికి వెళ్ళాలి. అక్కడ త్రిలోకఖ్యాతి పొందిన కోటి తీర్థం ఉంది. రుద్రుడు కోటి తీర్థాలను అచట సమావేశపరిచాడు. ఆ పవిత్ర తీర్థంలో స్నానంచేసి కోటీశ్వరమహాదేవుని దర్శించినచో అయిదు యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది.
అచటనే సర్వదేవతలచే ప్రతిష్ఠింపబడిన వామనదేవుని సన్నిధిలో స్నానంచేసి మానవుడు అగ్నిష్టోమ యజ్ఞఫలం పొందగలడు. జితేంద్రియుడు శ్రద్ధాన్వితుడు అగువాడు అశ్వని తీర్థం సేవించి రూపసంపదను యశస్సును పొందగలడు. విష్ణువుచే కీర్తింపబడిన వారాహతీర్థంలో మునిగి శ్రద్ధాళువు పరమపదాన్ని పొందుతాడు. బ్రాహ్మణోత్తములారా! అక్కడ నుంచి పవిత్రమైన సోమతీర్థం వెళ్ళాలి. అచటనే చంద్రుడు తపస్సుచేసి రోగ విముక్తుడయ్యాడు. అచటి తీర్థంలో మునిగి సోమేశ్వరస్వామి దర్శనం చేసినవారలు రాజసూయ యాగఫలం పొందుతారు. వారల వ్యాధులు సర్వదోషాలు తొలగి చిరకాలం చంద్రలోకంలో నివసిస్తారు. అక్కడే ఉన్న భూతేశ్వర, జ్వాలామాలేశ్వరులు లింగాలను అర్చించిన వారికి పునర్జన్మ ఉండదు. ఏకహంస తీర్థంలో మునిగిన వారలకు వేయిగోవుల దానమిచ్చిన ఫలం కలుగుతుంది. అచట నుండి వెళ్ళి కృతశౌచ క్షేత్రంలో తీర్థసేవచేసి నరుడు శుచియై పుండరీక యజ్ఞఫలం పొందుతాడు. అటనుండి ముంజవట తీర్థంలో ముంజవటేశ్వరుని అర్చించి, ఒక రాత్రి ఉపవసించినచో గాణపత్యము ప్రాప్తించును. అచటనే మహాగ్రాహి యక్షిణి తీర్థమున్నది. అచట స్నానం, ఉపవాసంచేసి యక్షిణీ దేవతను ప్రసన్నురాలిని గావించుకొనుచో ఘోరపాపాలన్నీ నశించును. ఆ ప్రదేశం కురుక్షేత్రం యొక్క పుణ్య వర్ధక ద్వారంగా ప్రసిద్ధిచెందింది. దానికి ప్రదక్షిణంచేసి బ్రాహ్మణ సమారాధనచేయాలి. అటనుండి జమదగ్నిపుత్రుడు పరశురాముడు ప్రతిష్ఠించిన పుష్కరతీర్థంలో పితృదేవతలను అర్చించిన రాజు అశ్వమేధఫలం పొంది ధన్యుడౌతాడు. అచ్చోట కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వానికి ప్రసన్నులై దేవతలు కోర్కెలన్నీ సిద్ధింపజేస్తారు. అచట నుండు ద్వారపాలుడు, కపిలుడనే మహాయక్షుడు పాపులకు విఘ్నాలు కలిగించి వేధిస్తాడు. ఉదూఖలమేఖల అనే అతని భార్య మహాయక్షిణి ఎల్లప్పుడు దుందుభిమ్రోగిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఒక పర్యాయం ఆమె పాప దేశంలో పుట్టి కుమారునితో వచ్చిన ఒక స్త్రీనిచూచి రాత్రివేళ దుందుభిని మ్రోగిస్తూ ఇలా అన్నది. యుగంధర తీర్థంలో పెరుగు తిని, అచ్యుత తీర్థంలో ఉపవాసంచేసి, అట్లే భూతాలయ తీర్థంలో స్నానంచేస్తే నీ కొడుకుతో జీవించగలవు. ఈ విషయం నీకు పగటివేళ చెప్పుచున్నాను. రాత్రికాగానే నిన్ను తప్పక భక్షిస్తాను. ఆ మాటలకు భయపడి ఆ స్త్రీ దీనస్వరంతో నన్నెలాగయినా కాపాడు మని వేడుకొనగా దయతలచి ఆ యక్షిణి ఉపాయం చెప్పింది. సూర్యగ్రహణ సమయంలో ఎప్పుడైనా యిచటి సన్నిహితతీర్థంలో మునిగినచో పవిత్రురాలవై స్వర్గానికి పోగలవు.