భక్తి గొప్పదా శక్తి గొప్పదా?-వామన పురాణం ఏం బోధిస్తుంది?

ఒకసారి పాతాళంలో నివసిస్తున్న ప్రహ్లాదుని వద్దకు చ్యవన మహాముని వచ్చాడు. ఆ మహామునిని ప్రహ్లాదుడు యథాశక్తి పూజచేసి, వినమ్రుడై నమస్కరించి మహర్షీ ఈ పాతాళలోకానికి తమరాక వలన ప్రయోజనం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. అప్పుడు నర్మదానది ఒడ్డున నకులీశ్వర తీర్థంలో స్నానం కోసం వచ్చిన చ్యవన మహామునిని భయంకరమైన నల్లని రంగుతో ఉన్న మహాసర్పం ఒకటి తనను పట్టుకొని అక్కడకు తీసుకొని వచ్చిన విషయాన్ని ప్రహ్లాదునికి వివరించాడు. అందుకు ప్రహ్లాదుడు మహామునీ మీకు కష్టం కలిగించినందులకు నన్ను క్షమించండి. కానీ ఈ విధంగా మీ దర్శన భాగ్యం కలగటం మీకు అతిథి సత్కారం చేయటానికి అవకాశం కలిగించినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా కాలం నుంచి భూమిమీదగల మహా ప్రభావవంతమైన ఏదైనా తీర్థ ప్రాంతానికి వెళ్ళి జన్మ ధన్యం చేసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉన్నది. అలాంటి తీర్థాన్ని తీర్థ ప్రాశస్త్యాన్ని వివరించి నన్ను కృతార్థుడిని చేయండి అని ప్రార్థించాడు. అ మాటలకు చ్యవనుడు నైమిశారణ్య మాహాత్మ్యాన్ని ప్రహ్లాదునికి వివరించి, ప్రహ్లాదుడు, మహా బలవంతులైన దితిపుత్రులు, దానవులతో కలసి అచ్చటకు వెళ్లాడు. ఆ తీర్థంలో స్నానం చేసిన తరువాత ప్రహ్లాదుడు ఆ అరణ్యంలో ఒక అద్భుత దృశ్యాన్ని చూశాడు. ఒక విశాల శాల (మఱ్ఱి) వృక్షం క్రింద కూర్చొని అనేక రకాలైన అస్త్ర శస్త్రాలను ధరించి ఘోర తపస్సు చేస్తున్న ఇద్దరు జటాజూటధారులైన మునులను చూచాడు. ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూచిన ప్రహ్లాదుడు నిర్విణ్ణుడై వారి దగ్గరకు వెళ్ళి మీరు ఇద్దరూ ఈ ధర్మ వినాశకమైనపని చేయటానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఒక వైపు జటాజూట భారంతో ఉండి కూడా రెండవవైపు అస్త్రశస్త్రాలను ధరించటం ధర్మం కాదు కదా అని అడిగాడు. అందుకు ఆ తాపసులిద్దరూ దైత్యేశ్వరా! సమర్థుడైన వాడు ఏ పని చేసినా, పనికి సార్థకతను కలుగచేస్తాడు. అందువలన నీవు ఈ విషయాన్ని గురించి ధర్మహాని అని భావించవలసిన అవసరం లేదని వివరించారు. ఆ మాటలకు ప్రహ్లాదునికి చాలా కోపం వచ్చింది. ఆయన కోపావేశపూరితుడై, ధర్మానికి సేతువుగా నిలువవలసిన మీరే రాక్షస రాజునైన నాతో ఈ విధంగా మాట్లాడడం మీ అహంభావాన్నే తెలుపుతుంది అని పలుకగా నరనారాయణులనే పేరుగల ఆ ఇద్దరూ మహామునులు, ప్రహ్లాదునికి ఎంత తెలియపలికినా, అహంభావ పరవశుడైన ప్రహ్లాదుడు కోపంతో మీ ఇద్దరినీ యుద్ధంలో ఓడించి తీరుతానని ప్రతిజ్ఞ చేశాడు. యుద్ధంలో ప్రహ్లాదుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రము, మహేశ్వరాస్త్రం వంటి అస్త్ర శస్త్రాలను వారిపైన ప్రయోగించినా, అవి వారిని ఏమీ చేయలేక వెనుకకు తిరిగివచ్చాయి. ప్రహ్లాదుడు ముద్గర, ప్రాస, పరిఘ, శక్తి మొదలైన అనేకాలైన ఆయుధాలను ప్రయోగించాడు. అయినా కూడా వారిలోని ఒకరైన పురాతనుడు, మహాపరాక్రముడు, లోకపతి అయిన నారాయణుని పరాజితుడిని చేయలేకపోయాయి.

అందుచేత నిరాశోపహతుడైన ప్రహ్లాదుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి శరణు వేడాడు. ఆయనను స్తుతించి తన ఓటమికి కారణం తెలుసుకొనగోరాడు. అందుకు విష్ణువు ప్రహ్లాదా, మహాశక్తివంతుడు, ధర్మపుత్రుడైన నారాయణుడు నీకు అజేయుడుగా నిలిచాడు. అంతేగాదు ఆయన పరమజ్ఞాని అయిన బ్రాహ్మణ శ్రేష్ఠుడు. దేవతలందరికి అతడు అజేయుడే కాగలడు అని చెప్పాడు. అప్పుడు వినయ పూర్వకంగా మహా విష్ణువు చెంత ప్రహ్లాదుడు చేతులు జోడించి, మహాదేవా నేను కోపావేశంలో వారిని ఓడించి తీరు తానని ప్రతిజ్ఞను చేశాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ ఏమైపోవాలి అని ప్రశ్నించాడు. అందుకు విష్ణువు భక్తా! శక్తి ఎక్కడ విజయాన్ని పొందలేదో భక్తి అక్కడ గెలవగలదు. శక్తితో నీవు ఆ మహర్షులను గెలువలేకపోయావు. నారాయణ మహర్షిని జయించాలను కొంటే భక్తితో ఆయనను ఆరాధించు’ అని చెప్పాడు.

భగవంతుడైన మహావిష్ణువు ఆదేశం ప్రకారం ప్రహ్లాదుడు బదరికాశ్రమానికి పోయి, తపస్సు చేసి నరనారాయణులనే, ఆ దేవాంశ సంభూతులైన మహర్షులకు ప్రత్యక్షం చేసుకొని, వారి నుంచి వరాలను పొందాడు. వారు వరం కోరుకొనమని చెప్పినప్పుడు మహాను భావా నేను మహాపరాక్రమవంతునిగా గాక, మీ భక్తుని రూపంలో ఈ ప్రపంచంలో కీర్తిని పొందేటట్లు వరం అనుగ్రహించమని కోరుకొన్నాడు. (త్వత్పాద పంకజాభ్యాం ఖ్యాతి రస్తుసదామమ) అందువలన భక్తిలోనే శక్తి గర్భీకృతంగా ఉన్నది. అందువలన శక్తి సంపన్నుడైనవాడు భక్తి ప్రపూర్ణుడుగా కూడా ఉంటే అతడికి అన్ని విధాలా అభివృద్ధి కలుగుతుందని వామనపురాణం బోధిస్తున్నది.