కామదహనం

మహేశ్వరుడట్లు మరల తిరుగుటచూచి కుసుమాయుధు డాయనను మరల ప్రహరించుటకై ధనుష్పాణియై ఎదుట నిలచెను. వానిని చూచినంతనే కోపంతో కనుల నిప్పులు రాల్చుచు శివు డాతనిని నఖశిఖ పర్యంతము వీక్షించెను. తేజస్వియైనను మదనుడా వేడిమికి ఓర్వలేకపోగా అతని పాదముల నుండి నడుమువరకు గల భాగము దగ్ధమయ్యెను. పాదములట్లు తగులబడగా మదనుడు తన ధనస్సును వదలివేయగా అది అయిదు ఖండములాయెను. బంగారం వలె మెరయుచున్న దాని ముష్టిబంధము సువాసనలు వెదజల్లే సంపంగి వృక్షమాయెను. రత్నము పొదిగిన దాని సుందర నాహస్థానం, కేసర వనంలో చక్కని వకుళ (పొగడ) చెట్టుగ మారెను. మునీ! ఇంద్రనీలమణులు పొదిగిన ఆ ధనుస్సు కోటి (అగ్రం) తుమ్మెదలతో నిండిన అందమైన పాటల తరువైనది. నాహస్థానానికి పైన చంద్రకాంతమణులు పొదిగిన పిడి (ముష్టి) చంద్రకాంతివలె తెల్లనైన అయిదురేకల మల్లెపూవయ్యెను. పిడిపైన, వంపు దిరిగిన చివరలకు దిగువ పగడములతో అలంకరించ బడిన దొంతరలుగల వివిధ (వన) మల్లికలయినవి. నారదా! ఈ విధంగా పరమేశ్వరుని ద్వారా మంచి వాసనలు వెదజల్లే మల్లె మొదలయిన పుష్పాలు సృష్టించ బడినాయి. శరీరం తగలబడడం చూచి మన్మథుడు తన బాణాలను గూడ పారవైచెను. వాని నుండి వేలాది ఫలవృక్షాలు పుట్టినవి. శంకరుని కృపవల్ల దేవతలందరకు రుచికరములగు మామిడి మొదలయిన పలురకముల ఫలములేర్పడినవి. ఇట్లు మన్మథుని దగ్ధంచేసి తన శరీరాన్ని అదుపులో నుంచుకొని శివుడు పుణ్యార్జనకై కైలాసమున తపస్సు కొరకై వెళ్ళిపోయెను. ఈ విధంగా పురాసమయాన దేవశ్రేష్ఠుడగు శివుడు ధనుర్బాణాలతో సహా మదనుని దగ్ధము కావించగా ధానుష్కుడు ఆటినుండియు అనంగుడని పిలువబడెను.