వామన మహా పురాణము
మంకణుని చరిత్ర
ఋషులు ప్రశ్నించారు: మంకణకు డెలా సిద్ధుడయ్యాడు? ఆయన ఎవరి కుమారుడు? ఆ మహర్షి నృత్యం చేస్తుంటే శివుడేల నివారించాడు? అందులకు లోమహర్షణు డిలా చెప్పాడు. మంకణముని కశ్యపమహర్షి మానసపుత్రుడు. ఒకనాడాయన వల్కలాలతో స్నానం చేయటానికి ఉద్యుక్తు డయ్యాడు. బ్రాహ్మణులారా! అప్పుడచటకు సుందరులు ప్రియదర్శనలు కోమలాంగు అయిన రంభాది అప్సరసలు కూడ వచ్చి ఆయనతోబాటు స్నానంచేయసాగారు. వారలనుచూచి మనస్సు చలించినందున ఆ ముని వీర్యం నీటిలో జారిపడగా నాతపస్వి దానినొక కలశంలో పట్టివేశాడు. కలశంలోని వీర్యం ఏడుభాగాలయి అందులో నుండి సప్తమరుద్గణాలు వాయువేగ, వాయుబల, వాయుహా, వాయుమండల, వాయుజ్వాల, వాయురేత, వాయుచక్రులను మహావీర్యవంతులు ఉద్భవించారు. ఆ ఋషికి పుట్టిన ఆ ఏడుగురు కుమారులు ఈ చరాచర జగత్తును ధరించియున్నారు. సిద్ధపురుషుడైన అ మంకణకుడు పూర్వ మొకసారి కుశాగ్రంతో చేయికోసు కున్నట్లు ఆ వ్రణంలో నుండి శాకరసం స్రవించినట్లు విన్నాను. చేతినుండి కారుచున్న ఆ శాక రసాన్నిచూచి ఆయన ఆనందంతో నాట్యంచేయసాగాడు. ఆ నాట్యోద్ధతికి స్థావర జంగమాలన్నీ నాట్యం చేయ సాగాయి. ఆయన తేజస్సుకు జగత్తంతా నాట్యం చేయడంతో బ్రహ్మాది దేవతలు తపోధనులయిన ఋషులందరు కలిసి మహాదేవుని దర్శించి ఇలా ప్రార్థించారు. ప్రభూ! ఈ మునిని నృత్యం చేయకుండా నివారించండి. అంతట శివుడు హర్షాన్మత్తు డయిన మునిని చూచి దేవహితం కోసమై ఇలా ప్రశ్నించాడు. ఓ మునిసత్తమా! ఓ బ్రాహ్మణోత్తమా! ధర్మపథాన నడచుచున్న నీకింతటి హర్షాతిరేకం కలుగుటకు కారణమేమిటో చెప్ప వలయును.
మంకణ ఋషి ఇలా అన్నాడు. భగవాన్! నాచేతినుండి కారుచున్న శాకరసాన్ని చూడటం లేదా? దానినిచూచియే ఆనందంతో గంతులువేస్తున్నాను. ఆమాటకునవ్వి పరమేశ్వరుడు ఇలా అన్నాడు. ఓ రాగమోహితుడ వైన మునీ! ఇందులో నాకేమీ ఆశ్చర్యం కనిపించుట లేదు! అని ఆమాట చెప్పి ఆ మహాతేజస్వి యైన దేవదేవుడు తనవ్రేలి చివర భాగంతో బొటనవ్రేలిని ప్రహరించాడు. అంతట అందులోనుంచి తెల్లని మంచులాంటి భస్మం బయటకు వచ్చింది. అదిచూచి సిగ్గుపడి ఆ మంకణుడు పరమేశ్వరుని పాదాలమీద వ్రాలి ఇలా ప్రార్థించాడు. ప్రభూ! శంకరా! నిన్నుమించిన దేవుడున్నాడని నేననుకోను. చరాచర జగత్తులో శూలపాణినగు నీవే శ్రేష్ఠుడవు. ఈ బ్రహ్మాదిదేవతలంతా నిన్నాశ్రయించి బ్రతుకు చున్నారు. ఓ అనఘా! దేవ శ్రేణిలో అగ్రస్థానం నీదే. ఈ జగత్తునంతను సృష్టించి నడపుతున్న వాడవు నీవే. నీ అనుగ్రహం వల్లనే దేవతలంతా ఎవరివల్లా ఎలాంటి భయంలేకుండా మనుగడ సాగిస్తున్నారు. ఈ విధంగా స్తుతించి అఋషి పరమేశ్వరుని పాదాలు పట్టుకొని ఇలా అన్నాడు. భగవాన్! నీ దయవల్ల నా తపస్సు నశింపకుండుగాక. అలా అనుగ్రహించుము. అందులకు ఈశ్వరుడిలా అన్నాడు. నీతోబాటు ఈ ఆశ్రమంలో నేనుకూడా ఎల్లప్పుడూ ఉంటాను. సప్తసారస్వత క్షేత్రంలో స్నానంచేసి నన్ను అర్చించిన వానికి ఇహలోకంలోనూ పరలోకంలోకూడా లభించని దేమీ ఉండదు. శివాను గ్రహంవల్ల అలాంటి అదృష్టవంతులు సర్వోన్నతపదం పొందుతారు. సారస్వత స్వర్గసౌఖ్యాలను అనుభవిస్తారు.