ప్రహ్లాదకృత నారాయణ స్తోత్రం

ప్రహ్లాదుడిట్లనెను. “ప్రభో! మిమ్ము జయింపగల వారెవ్వరు? మీ కంటే అధికు లెవ్వరు? నీవు సాక్షాత్తు నారాయణుడవు, దేవా! నీవే పుండరీకాక్షుడవు! శార్ఙ్గపాణియగు విష్ణుడవు! అవ్యయుడవు, మహేశానుడవు, పురుషోత్తముడవు శాశ్వతుడవు. యోగులు నిన్నే ధ్యానింతురు, మనీషులు నిన్నర్చింతురు. స్నాతకులు నీ నామాన్ని జపిస్తారు. యాజ్ఞికులు యజ్ఞేశ్వరునిగా పూజిస్తారు. నిన్ను హృషీకేశుడనీ చక్రధరుడనీ, ధరాధరుడనీ, మత్స్యమూర్తివనీ, హయగ్రీవుడవనీ, కూర్మ మూర్తివనీ కీర్తిస్తారు. హిరణ్యాక్షుని సంహరించిన భగవంతుడవగు శ్రీ వరాహమూర్తివి నీవే! నాతండ్రిని వధించిన నృకేసరివి గూడ నీవే స్వామీ! హే గరుడధ్వజా! విభో! బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయువు, సూర్యచంద్రులు, జంగమ స్థావరాత్మకమైన ఈ సర్వము నీవే. హే! లక్ష్మీపతీ! భూమి జ్యోతి రాకాశ జల రూపాన వేవేల మూర్తులతో జగత్తునంతటా వ్యాపించియున్న నిన్నెవడు జయింపగలడు? జగద్గురో! సర్వగతుడవు అవ్యయుడవునగు నిన్ను భక్తిచేతనే జయింప నగును. మరే విధంగానైననూ ఎవ్వరూ నిన్ను జయింపలేరు!

అంతట భగవానుడిట్లనెను, సువ్రతుడవగు దైత్యపతీ! నీ స్తోత్రమునకు సంతోషించితిని. అనన్యమైన నీ భక్తిచేతను ఓడింపబడితిని. ఓడిపోయినవారు పరిహారం చెల్లించుకోవలెను. పరిహారరూపాన నీకొక వరం ప్రసాదిస్తున్నాను కోరుకొనుము. అనగా వరదేశ్వరా! ప్రభో! నిన్ను శత్రువుగా భావించి నేను (యుద్ధము చేసి) చేసిన మానసిక, వాచిక శారీరక పాపములన్నింటిని నశింపజేయుము. మహాత్ముడగు నరుని యెడ గావించిన అపరాధము క్షమింపుము, జగత్ప్రభో! అని ప్రహ్లాదుడనెను.

దైత్యేంద్రా! అట్లే అగుగాక, నీ పాప సంక్షయమగు గాక. ఇంకొక వరము కోరుకొనుము. అని నారాయణుడు ఆజ్ఞయిడగా విష్ణో! నా బుద్ధులన్నియు నెల్లవేళలందునూ నిన్నాశ్రయించుకొని యుండుగాక. నీ పూజ అర్చన ఉపాసనలందే లగ్నమై యుండుగాక. అని ప్రహ్లాదుడనెను.

నారాయణ వచనము: “తథాస్తు. మహావీరా! మరొక వరము కోరుకొనుము. కాదనక ఇచ్చెదనని పలుకగా అధోక్షజా! ప్రభూ! నీ దయతో నాకన్నియు లభించినవి. ఎల్లపుడు నీ పాదముల భక్తి నాకనుగ్రహింపుము. అని ప్రహ్లాదుడనెను. అట్లేయగుగాక. అంతేకాదు. నా ప్రసాదం వల్ల నీవు అజరామరుడవై చిరకాలం వర్ధిల్లగలవు. రాక్షస శార్దూలా! వెంటనే నిజావాసమునకు వెళ్ళి కర్మరతుడవు కమ్ము. మత్పరాయణుడవైన నిన్ను కర్మ బంధములు అంటవు. శాశ్వతంగా దైత్యరాజ్యానికధిపతిపై స్వకులోచితమైన ధర్మాచరణము గావింపుము” అని నారాయణుడనెను.

జగన్నాథుని మాటలు విని “ప్రభో! ఒక పర్యాయము వదలిన రాజ్యాన్ని మరల ఎట్లు గ్రహించగలను? ధర్మమూర్తీ!” అని ప్రహ్లాదుడిట్లనెను. అందులకు భగవంతుడు “అట్లగుచో రాక్షస జాతికంతకు హితోపదేశకుడవుగా ఉండి దైత్య దానవులను కాపాడుము” అనెను. నారాయణునిచే అనుజ్ఞాతుడై ఆ దైత్యేశ్వరుడు స్వామికి మ్రొక్కి సంతోషముతో నిజమందిరమునకు వెళ్ళెను.

తిరిగివచ్చిన ప్రహ్లాదుని దైత్యదానవులు, అంధకుడు సంభావించి రాజ్యమును మరల స్వీకరించమనిరి. కాని ఆ మహాజ్ఞాని అందుల కంగీకరింపడయ్యెను. నారదా! గడ్డిపోచవలె సకల దానవ రాజ్యాన్నీ పరిత్యజించి అంధకుని సన్మార్గమున నడపుచు రాక్షసులకు మార్గదర్శియై, ఆ మహనీయుడు నిరంతరము అప్రమేయుడగు శ్రీహరిని ఆరాధించుచు మహాయోగియైవర్ధిల్లెను.

నారదా! ఈ విధంగా పురాసమయాన దానవేంద్రుడగు ప్రహ్లాదుడు పురుషోత్తముడగు నారాయణునిచే పరాజితుడయ్యు, రాజ్యత్యాగం కావించి తన చిత్తవృత్తులన్నియు నా భగవంతునిపై నుంచి ధన్యుడాయెను.” అని పులస్త్యుడు పలికెను.