మహిషాసుర వధ

నారదుడు: మహానుభావా! ఆ కాత్యాయనీ దేవి ఆ మహిషదైత్యుని సకల సైన్యంతో సహా ఎలా సంహరించిందో వివరంగా చెప్పండి. అన్ని శస్త్రాస్త్రాలు కలిగి కూడ కాళ్ళతో ఎలా మర్దించింది? అని అడుగగా అందులకా పులస్త్య మహర్షి ఇలా చెప్పాడు. “నారదా! ఈ పవిత్రమూ పాపభయాప హరమూ అయిన వృత్తాంతం చాలా పురాతన కాలం, కృతయుగం నాటిది. దీనిని శ్రద్ధగా ఆలకించు. ఆ విధంగా క్రోధోన్మత్తుడై నమరుడు చతురంగ బలంతో దేవి మీద లంఘించడంతో ఆమె వాని వైపు తదేక దీక్షగా చూచింది. అంతట ఆరాక్షసుడు ప్రచండమైన బాణాసనాన్ని ఎక్కుపెట్టి ఆ వింధ్యాద్రిని బాణవృష్టితో కప్పి వేశాడు. వాని ఔద్ధత్యం చూచి భగవతి మహావేగంతో తన శ్రేష్టమైన ధనుస్సు ఆకర్ణాంతం వంచింది. బంగారువికారం గల ఆ ధనుస్సును దానవ సైన్యంలో మేఘాలమధ్య ప్రళయ విద్యుత్తువలె వెలిగింది. అంతట ఆదేవి కొందరిని బాణాలతో, కొందరిని ఖడ్గంతో, కొందరను గదతో, కొందరను ముసలంతో, మరికొందరిని డాలుతో సంహరించింది. ఇక ఆ దేవి వాహనమైన కాలమృత్యువులాంటి సింహం వంటరిగానే తన జటలను ఝళిపించి ఎందరో రక్కసులను సంహరించింది. కొందరు రాక్షసులు వజ్రాఘాతాలకు మరణించారు. కొందరి గుండెలు శక్తి తగిలి బ్రద్దలయ్యాయి. కొందరి కంఠాలు నాగలి. వ్రేటులకు చీలిపోయాయి. మరికొందరి తలలు పరశుఘాతాలకు తెగిపోయాయి. గదవ్రేటుల కెందరి తలలో నుగ్గయిపోతే, చక్రజ్వాలల కెందరి సంధిబంధాల మాంసఖండాలో ఊడిపోయినాయి. ఎందరో భయకంపనంతో నేలకొరిగారు. ఇతరులా భయానక సంహారకాండకు బెదరి పారిపోయారు. వారలకాదేవి రౌద్రరూపం, ప్రత్యక్ష కాళరాత్రిగా మృత్యువుగా భాసించింది. తన అనిమొన ఆ విధంగా కకావికలు కావడం, ఆ దేవి చెక్కుచెదరకుండా ఉండడం చూచిన నమరుడు మదించిన ఏనుగునెక్కి దేవి మీదకు లంఘించాడు. ఆమె పైకి శక్తిని విడిచాడు. సింహం మీద త్రిశూలం ప్రయోగించాడు. దేవి కావించిన హుంకారంతోనే ఆ రెండు ఆయుధాలు భస్మమైపోయాయి. అంతలో ఆరాక్షసుడి గజం తనతొండంతో దానవుని గట్టిగా కొట్టగా వాడు ఏనుగుమీద నుంచి క్రిందపడి ప్రాణాలు వదిలాడు. వాడి మృతదేహాన్ని సింహం భగవతికి సమర్పించింది.

విప్రోత్తమా! ఆ దానవుని నడుము పట్టుకొని శ్రీదేవి ఎడమచేతితో గిరగిర త్రిప్పుచు డోలు వాయించినట్లు తాడించింది. వెంటనే వాడి శరీరం డోలుగా మారింది. అది చూచి కాత్యాయని పెద్దగా అట్టహాసం చేయడంతో ఆ నవ్వులో నుంచి రకరకాలయిన అద్భుత భూతాలు బయలుదేరాయి. వానిలో కొన్ని వ్యాఘ్రముఖాలు గలవి కాగా కొన్ని తోడేలు ముఖాలతో ఉన్నాయి. కొన్ని భూతాల ముఖాలు గుర్రాలు, దున్నపోతులు, పందులు, ఎలుకలు, కోళ్ళు, ఆవులు, మేకలు, గొర్రెలులాగా ఉన్నాయి. వాటి కాళ్ళు, కండ్లు రకరకాలుగా ఉన్నాయి. నానావిధాలైన ఆయుధాలు దాల్చిన ఆ భూత గణాలు కొన్ని పాడుతూంటే కొన్ని నవ్వుతున్నాయి. కొన్ని ఆడు కుంటుంటే కొన్ని గుంపులుగా వాద్యాలు మోగిస్తున్నవి. మిగిలినవి, పరమేశ్వరి అంబికను స్తోత్రం చేస్తున్నవి. ఆ భూతగణాలతో కలిసి ఆ దేవి పిడుగుల వర్షం పంటచేలను ధ్వంసం చేసినట్లు ఆ రాక్షస బలాన్ని నాశనంచేసింది. సేనాపతి మరణించి, సేనాముఖం చెదరి పోవడంతో సైన్య పాలకుడైన చిక్షురుడు దేవతలతో యుద్ధానికి తలపడ్డాడు. ఆ మహారథుడు భయంకరమైన ధనుస్సు ఎక్కుపెట్టి వర్షధారలు భూమిని ముంచినట్లు దేవి సైన్యాన్ని బాణాలతో నింపాడు. వాడి బాణాలను తనవాడియైన శరాలతో ఛేదించి ఆ దుర్గ, బంగారు రెక్కలుగల పదహారు ఉత్తమ బాణాలను అందుకున్నది. నాలుగు బాణాలతో చిక్షురుడి నాలుగు గుర్రాలను, ఒక బాణంతో సారథిని, మరొక నారాచంతో రథకేతనాన్ని కూల్చింది. ఒక వాడి బాణంతో ఆ రాక్షసుడి ధనుర్బాణాలను ఖండించడంతో ఆ వీరుడు ఖడ్గం చర్మం ధరించి విజృంభించాడు. నాలుగు బాణాలతో అభగవతి వాటిని కూడ ఖండించగా వాడు శూలం తీసుకున్నాడు. దానిని వేగంగా త్రిప్పుచు, సంతోషంతో ఆడు సింహం మీదకు దుమికే శృగాలం (నక్క) వలె ఆ కాత్యాయని మీదకు లంఘించాడు. అంతట క్రోధంతో ఆ దేవి అయిదు బాణాలువేసి ఆ రాక్షసుని కరచరణాలను తలను ఖండించి వేసినది. దానితో వాడు విగతజీవుడై నేల కొరిగినాడు.

సేనాపతి ఓడిపోగా ఉగ్రాస్యకరాళాస్యులనే మహాసురులిద్దరు కాత్యాయనితో తలపడ్డారు. బాష్కలుడు, ఉద్ధతుడు ఉదగ్రుడు ఉగ్రకార్ముకుడు దుర్ధరుడు దుర్ముఖబిడాలాక్షాదులు అనేకులు మహాబలశాలులైన దానవవీరులు నానాశస్త్రాస్త్రాలు ధరించి దేవి కభిముఖంగా పరుగెత్తారు. ఆ దుర్గ వారలను చూచి అలవోకగా వీణను డమరుకాన్ని చేతగాని నవ్వుతూ వాయించ నారంభించింది. ఆమె వాయించే కొద్ది భూతగణాలన్నీ నవ్వుతూ నృత్యం చేయసాగాయి. ఆ మహాసురులు శస్త్రాలతో కాత్యాయనిని ప్రహరించగా ఆ పరమేశ్వరి ఆ రాక్షసుల కేశాలు పట్టుకొని సింహం మీదనుంచి పర్వత సానువు మీద దూకి, వీణవాయిస్తూ, మద్యం సేవిస్తూ నాట్యం చేయసాగింది. శ్రీదేవి బాహుబలం వల్ల అ మహాదానవుల గర్వం పటాపంచలు కాగా వారంతా ప్రాణాలు కోల్పోయి వివస్త్రలై నేలపైబడిరి. అలా చచ్చిపడిన తన వారలను చూచి మహావీరుడైన మహిషుడు తన కాలిడెక్కలతో తోకతో కాళ్ళతో భూతగణాలన్నింటినీ పారదోలాడు. అశనిఘోషంలాంటి అరపులతోవేడి ఊర్పులతో, ముట్టెతో, వాడికొమ్ములతో శత్రువులను మర్దించి ఆ దుష్టుడు సింహాన్ని చంపేందుకు దాని వెంటబడ్డాడు. అది చూచి అంబిక మనస్సు క్రోధంతో నిండిపోయింది. అంతట ఆరాక్షసుడు తన వాడియైన కొమ్ములతో క్రుమ్మి పర్వత శిఖరాలను, భూతలాన్ని సముద్రాలను మేఘాలను ఛిన్నాభిన్నం చేసి, దుర్గాదేవి మీదకు విరుచుకపడ్డాడు. ఆమె ఆ దుష్టుని పాశంతో బంధించగా వాడు మదమెక్కిన ఏనుగుగా మారాడు. ఆమె దాని తుండాన్ని నరికివేయగా వాడు మళ్ళీ దున్నపోతుగా మారాడు. ఆ భవాని వాడిమీద శూలం విసిరితే అది పొడియై క్రిందపడిపోయింది. అగ్నిదత్తమైన శక్తిని ప్రయోగిస్తే అదికూడ మొక్కబోయి పడిపోయింది. ఓ మహర్షీ! దేవి విష్ణువు ఇచ్చిన చక్రం వాడి మీద ప్రయోగించింది. అయితే అది తన చక్రత్వాన్నే కోల్పోయింది. అంతట ఆమె మండిపడి కుబేరుడు తనకిచ్చిన గదతో ప్రహరించగా అది భగ్నమైంది. వరుణుడిచ్చిన పాశాన్ని కూడ ఆ రాక్షసుడు తన కొమ్ములతో ముట్టెతో గిట్టలతో ముక్కలు చేశాడు. అలాగే దుర్గ యముడిచ్చిన కాలదండం వేయగా అది ముక్కలై పోయింది.

ఇంద్రదత్తమైన వజ్రాయుధం అ మహిషుని తాకి నుగ్గునూచమైంది. దానితో ఆ దుర్గ రెచ్చిపోయి సింహం వదలి మహిషుడి వీపుమీదకు లంఘించింది. మహిషుడు ఆమెను క్రిందకు త్రోసివేయాలని ప్రయత్నించి విఫలుడైనాడు. ఆమె ఆ దున్నపోతు రాక్షసుని తన మెత్తని పాదాలతో, తడిసిన తోలును తొక్కినట్లుగా మర్దించింది. దానితో వాడి బలమంతా నశించింది. అప్పుడు ఆమె వాని శిరస్సును శూలంతో తెగవేసింది. ఆ కళేబరంలోంచి ఖడ్గధారియైన ఒక పురుషుడు బయటకు వచ్చాడు. బయటకు రావడం తోడనే ఆ దేవి తన కత్తితో వాని గుండెలపై బలంగా తాడించి మహా క్రోధంతో వాని జుట్టు పట్టుకొని తన వాడియైన ఖడ్గంతో వాని శిరస్సును ఛేదించి వేసింది. దీనిని చూచిన రాక్షస బలాలలో హాహాకారాలు చెలరేగాయి. అంతట భవాని ప్రమథగణాలచేత చావు దెబ్బలు తిన్న చండముండ మయతారాసిలోమాదులైన రాక్షసవీరులు భయకంపితులై పాతాళ లోకానికి పారిపోయారు. అంతట పరమేశ్వరి విజయాన్ని విలోకించిన దేవత లందరూ, ఘోరముఖీ సౌందర్యరాశీ, సర్వజగద్రక్షకీ అయిన ఆ నారాయణి కాత్యాయనీ దేవిని పలు విధాల స్తుతించారు. ఓ మహర్షీ! ఆ విధంగా సురసిద్ధ సంఘాల ప్రార్థనలు అందుకుంటూ ఆ మహాదేవి, దేవకార్యార్థమై తాను మరల జన్మించగలనని చెబుతూ హరుని చరణాలకడకు చేరుకొన్నది అని తెలిపాడు.