బలికి ప్రహ్లాదుని శాపం

బలియిలా అన్నాడు - తాతా! మనకు భయోత్పాతకుడైన ఆ హరి ఇంతకూ ఎవడు? ఆ వాసుదేవుని మించిన బలాఢ్యులు నావద్ద ఎందరో ఉన్నారు. విప్రచిత్తి, శిబి, శంకు అయఃశంకు, అశ్వశిరుడు, హయశిరుడు, భంగకారుడు మహాహనువు, ప్రతాపి, ప్రఘసుడు, శంభువు కుక్కురాక్షుడు దుర్జయుడు ఇంకా ఎందరెందరో మొనగాళ్ళు దైత్యదానవులున్నారు. వీరందరు మహాబలవీర్య సంపన్నులు, భూమి భారాన్నంత మోయ సమర్థులు. వీరిలో ఏ ఒక్కరి సగంబలానికి గూడ కృష్ణుడు సరిపోలడు.

మనుమడి మాటలు వింటూనే దైత్యసత్తముడు ప్రహ్లాదుడా వైకుంఠపతిని దూషిస్తున్న బలిని చురచుర చూస్తూ ఇలా గర్జించాడు. దైత్యదానవులకు వినాశకాలం సమీపించినది. కనుకనే నీకీ విపరీత బుద్ధి దాపురించినది. నీవంటి పాప సంకల్పుడైన రాజనామధారి తప్ప ఆ దేవదేవుని, జగద్విభుని, అజుడు మహాభాగుడుగు వాసుదేవుని గూర్చి ఇలాంటి వాక్యాలు మరెవ్వడూ నోట రానీయడు. నీవు చెప్పుచున్న ఈ దైత్య దానవులు, బ్రహ్మాది దేవతలు, జంగమ స్థావరాంతాలైన విభూతులు, నీవు, నేను, గిరివననదీ సముద్ర ద్వీపాదులతో కూడిన చరాచర జగత్తంతయూ, ఆ విశ్వవంద్యుడూ సర్వవ్యాపీ అయిన పరమాత్మ యొక్క అల్పాంశం నుండి ప్రభవించినది. నీవు తప్ప ఆ దేవదేవుని గురించి యిలా ఎవడు మాట్లాడగలడు? సర్వనాశనం దిశగా పరుగిడుతున్న అవివేకివీ, దుర్భుద్ధివీ, అహంకారివీ, గురుజనశాసనాతిక్రముడవుఅగు నీవు మాత్రమే ఇలా నోటికి వచ్చినట్లు వదరగలవు నేనెంత దౌర్భాగ్యుడను! నీవంటి దేవావమానిని కన్న అధమునకు తండ్రినని పించుకున్నాను. అనంతమైతన సంసారపాశ సంఘాలను తెగటార్చే కృష్ణునిపట్ల భక్తి విషయం అలావదలి వేద్దాం. నాపట్ల నైనా నీకు కించిత్తు గౌరవం ఉండవద్దా: నాయీ దేహం కన్నా నాకు కృష్ణుడే ప్రియుడనే విషయం లోకమంతా ఎరుగును, నీకు గూడ తెలుసు. శ్రీహరి నాకు ప్రాణాలకంటె ఎక్కువన్న విషయం తెలిసి కూడ నా పెద్దరికాన్ని మంటగలిపి ఆ మహనీయుని నిందించావు. ఓ బలీ! రాక్షసా! విరోచనుడు నీకు గురువు. వానికి తండ్రి అయిన నేను గురువును. జగత్తుకంతకూ గురుడైన ఆ నారాయణుడు అలాంటి నాకు గురువు. అలాంటి సర్వ గురువులకు గురులైన హరిని నీవు నిందించావు. కాబట్టి నీ వైశ్వర్య పదవి నుంచి భ్రంశం పొందుతావు! బలిరాజా! ఆ జనార్దనుడు సర్వలోకాధినాథుడు నేను నీకు గురువును కనుక, నీవు నన్నవమానించరాదు. ఈ మర్యాదలనన్నింటినీ కాలదన్ని ఆ జగద్గురువును నిందించిన నీవు శాపార్హుడవు. నీ వాడిన నిందావాక్యాలు నాకు తలగొట్టిన దాని కన్నా ఎక్కువ అవమానకారణాలు. కాబట్టి నీవు రాజ్య భ్రష్టుడవై పతనం పొందగలవని ఇదిగో శపిస్తున్నాను. ఈ సంసారసముద్రం దాటటానికి కృష్ణుని మించిన నావలేదు. ఇక నేను అచిర కాలాన్నే నీవు రాజ్యాన్ని కోలుపోవుట చూడగలను. అని ప్రహ్లాదుడు పలికిన క్రోధపూర్ణవచనాలు విని ఆ దైత్యేశ్వరుడాయనను ప్రసన్నుని గావించు కొనుటకై మాటిమాటికి మ్రొక్కి ఇట్లనెను. పితామహా! ప్రసన్నులుకండు! మోహోపహతుడనైన నాపై కోపించకుడు. దేహబల గర్వంతో అలా మాటాడినాను. దైత్యో త్తమా! మూర్ఖత్వం నావివేకాన్ని నశింపజేసింది. నేను పాపిని, దుర్మార్గుడను. నన్ను మీరు శపించుట మంచిదే. మీరు చెప్పినట్లు నా అవినయం వల్ల రాజ్య నాశాన్నీ కీర్తి నాశనాన్ని పొంది విషణ్ణుడనగుట నాకు యుక్తమే. త్రైలోక్యరాజ్యాధికారం యితర ఐశ్వర్యాలు సంపాదించుట కష్టమైన పనికాదు. కాని తమబోటి గురుజనులు లభించుట ఎంతో కష్టము. కనుక తాతా! నన్ను కరుణించి కోపించకుము. నీ కోపాగ్నిలో దగ్ధుడనై రాత్రింబ వళ్ళు పరితపిస్తుంటాను.