వామన మహా పురాణము
ఉమామహేశ్వర విహారం
నారదా! ఉమకూడ అట్లు వరాన్ని పొంది తిరిగి మందరగిరికి వచ్చి భర్తయైన శివునకు మ్రొక్కి వినయంగా నిలబడినది. అంత పార్వతితో కలిసి దేవాదిదేవుడు వేయి సంవత్సరాలు కామోప భోగాలు అనుభవించాడు. అలాశివుడు కామక్రీడల్లో మునిగి ఉండగా ముల్లోకాలు క్షోభించి పోయాయి. సముద్రాలు ఘూర్ణిల్లాయి. దేవతలంతా భయకంపితులై ఇంద్రునితో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి నమస్కరించి ఈ సంక్షోభానికి కారణమేమని అడిగారు. ఆయన, శివుడు పార్వతితో మహామైథున క్రీడలో మునిగి యున్నాడు. ఆ తీవ్రతకు లోకాలన్నీ కంపించి పోతున్నాయనిచెప్పి మౌనం వహించాడు. అంతట దేవతలు ఇంద్రునితో “దేవపతీ! త్వరపడుము. శివ పార్వతుల మైథునకర్మ ముగియు లోపల మనము అక్కడకు వెళ్ళవలె. అది పూర్తి అయి బాలకుడు జన్మించినచో అతడు నీ యింద్రాధిపత్యాన్ని హరించి వేస్తాడని భయ పెట్టారు. దేవతల మాట వినగానే ఇంద్రుడి వివేకం విచక్షణా జ్ఞానం నశించి, భయం చోటు చేసుకుంది. అతడు ఆక్షణమే దేవతలను అగ్నిని వెంటబెట్టుకొని మందరగిరి శిఖరాన డేరా వేశాడు. శివుని భవనంలోకి వెళ్ళేందుకు ధైర్యంచాలక చాలాసేవు తమలో తాము ఆలోచించుకుని చివరకు అగ్నిని పంపించారు. అగ్ని శివుని ఇంటిప్రాంగణం వద్దకు వెళ్ళిచూస్తే నందీశ్వరుడు ద్వారం వద్ద నిలచి ఉన్నాడు. దానికి భయపడి అగ్ని కర్తవ్యం అలోచిస్తూ ఉండగా ఒక పెద్ద హంసల గుంపు ఈశ్వర భవనంలో నుంచి బయటకు వస్తూ కనిపించింది. ఇదే తరుణమని ఎంచి అగ్ని ఒక హంసరూపం ధరించి నంది కన్నుగప్పి లోపలకు ప్రవేశించాడు. అక్కడ యింకా సూక్ష్మరూపంలో త్రినేత్రుని జటామండలం మీద ఎగురుతూ శివుడికి వినపడునట్లు మెల్లగా దేవతలు ద్వారం వద్ద వేచియున్నారని చెప్పాడు. అంతట వెంటనే పార్వతిని వదలి శివుడు అగ్నితోకలిసి ప్రాంగణంలోకి వచ్చాడు. నారదా! అలా బయటకువచ్చిన హరునిచూచి దేవతలు సంతోషించారు. అందరూ భూమికి తలలు ఆనించి దేవతలందరూ. - ప్రభూ మమ్ముల కరుణింప నెంచుచో మీఈమైథునక్రీడను చాలించండి అని విన్న వించారు. అందులకా దేవదేవుడు అట్లేయని అంగీకరించి, అయితే ఉద్రిక్తమైన నాయీ శుక్లాన్ని మీలో ఎవరు పరిగ్రహిస్తారని ప్రశ్నించాడు.
శంకరుని ప్రశ్నకు ఇంద్ర చంద్ర సూర్యుడు మొదలైన దేవతలు ఊబిలో కూరుకొని పోయిన ఏనుగుల్లాగ హతాశులయ్యారు. దేవతల దైన్యాన్ని చూచి అగ్ని ముందుకు వచ్చి “శివా నీ శుక్లాన్ని నేను భరిస్తాను, వెంటనే వదులుమనెను. దాహం గొన్నవాడినోట్లో నూనెపోసినట్లు శంకరు డా శుక్లాన్ని అగ్నినోట వదిలాడు. శివతేజాన్ని అగ్నిపానంచేయగానే దేవతలు స్వస్థులై తమతమ నెలవులకు వెళ్లిపోయారు. దేవతలు వెళ్లిన తర్వాత శివుడు లోనికి వెళ్లి పార్వతితో దేవీ! దేవతలందరు వచ్చి ఎంతో కష్టంతో అగ్నిని లోనికి పంపి నన్ను బయటకు పిలిపించు కున్నారు. నీ గర్భం నుంచి పుత్రుడు కలుగకుండా నన్ను నివారించి వెళ్ళిపోయారని చెప్పాడు. అది విన్నంతనే కోపంతో నిప్పులు గ్రక్కుచు పార్వతి దేవతల్లో ఎవరికీకూడ ఇకముందు భార్యలవల్ల పుత్రులు కలుగరాదని భయంకరంగా శపించింది. నాకు ఔరసుడు కలుగకుండా కుట్రపన్నిన దుష్టులు అపుత్రకులుగా ఉండి పోతారని శాసించింది. అలా దేవతలకు శాపమిచ్చి గౌరి శౌచాలయంలోకి వెళ్ళి మాలినిని పిలిచి స్నానానికి ఏర్పాట్లు చేయమన్నది. మాలిని పరిమళ భరితమైన ఉద్వర్తన (నలుగు పిండి) ద్రవ్యంలో ఆ దేవి బంగారు వన్నెగల కరచరణాదులకు నలుగుపెడుతూ ఉండే పార్వతి తన స్వేదం (చెమట) ప్రభావాన్ని గురించి అలోచించసాగింది. నలుగుపెట్టి మాలిని స్నానం చేసేందుకు లోపలకు పోయింది. ఆమె పోగానే తనవంటి నుండి రాలిన నలుగు పిండితో గజముఖము, నాలుగు చేతులు, వెడల్పు ఛాతీ గలిగి పురుషాకృతి గల బొమ్మను చేసి నిలబెట్టింది. ఇంతలో ఆమె చెలికత్తె మాలిని వచ్చి ఆమెకు శిరస్నానం చేయిస్తూ మధ్యలో తనలోతాను నవ్వుకొనడం సాగించింది. అది చూచి పార్వతి ఎందుకే నీలో నీవు మాటిమాటికి అలా నవ్వుకుంటున్నావు? అని అడిగింది. అందుకు మాలిని నవ్వుతూ అవునమ్మా నీకు కొడుకుకలుగుతాడని శివుడు గణాధిపతి నందితో అంటూంటే విన్నాను. అందుకే ఇలా నవ్వుతున్నా. దేవతలు ఆయనను కొడుకును కనకుండా నివారించారు కదా!”