వర్షఋతువులో సతీ పరమ శివులు

వేసవి గడిచిన తోడనే మేఘములు గుంపులతో దిక్కుల చీకట్లు వ్యాపించగ వర్షాకాల మేతెంచెను. దిక్కులు జనసంచార శూన్యములయ్యెను. అది చూచి దాక్షాయణి తన భర్తతో ప్రేమ పురస్సరముగ “మహేశ్వరా! గుండెలు బ్రద్దలగునట్లు తీవ్రమైన చలిగాలులు వీస్తున్నవి. మేఘములు గర్జించుచున్నవి. మెరుపులు మెరయుచున్నవి. నెమళ్ళు ఆడుచు కేకారవములు సేయుచున్నవి. ఆకసము నుండి తెరిపి లేకుండ జలధారలు పడుచున్నవి. బలాక పక్షుల వరుసలు మేఘముల వెంట పరుగులిడుచున్నవి. గాలి తూపులకు కదంబ, సర్జ, అర్జున, కేతకీవృక్షములు పుష్పములు రాల్చుచున్నవి. మేఘ గంభీర గర్జనలు విని తమతమ నెలవులు వదలి వెళ్ళు యోగులకు వలెనే హంసలు కూడ సరోవరాలను వదలి పోవుచున్నవి. అటు చూడుడు. నల్లని మొగిళ్ళ మధ్య మెరుపు తీగలెంత మనోహరముగ ప్రకాశించుచున్నవో! ఓ చంద్రశేఖరా! ఉన్నట్టుండి నదులన్నియు వేగాన్ని పుంజుకున్నవి. ఆకాశాన్ని నీలి మబ్బులావరించినవి. సర్జ వృక్షాలు పుష్పాలతో, కడిమి చెట్లు మొగ్గలతో, బిల్వతరువులు ఫలాలతో, నదీ నదాలు జలాలతో, సరోవరాలు పద్మ పత్రాలతో, పుష్పాలతో నిండియున్నవి. శంకరా! ఇలాంటి భయంకరమూ దుఃసహమైన కాలాన ఈ కొండకొమ్మున, నేను నిర్భయంగా సుఖించుట కనువైన గృహము నిర్మించుము అని కోరెను.