సరోవర మహాత్మ్యం

ఓ మహామునీ! స్థాణుతీర్థం, అక్కడి వటవృక్ష మాహాత్మ్యం సాన్నిహిత్య సరోవరోత్పత్తి దానిని మట్టి (దుమ్ము)తో పూడ్చటం, ఆ సరోవర మహిమ అక్కడి లింగాల దర్శన స్పర్శల వల్ల కలిగే ఫలం, అన్నీ విశదంగా వివరించండి. అందుకు లోమహర్షణుడిలా చెప్పసాగాడు. మునులారా! మీరందరూ దేనిని విన్నంతనే  వామనదేవుని కృపవల్ల ముక్తి కలుగుతుందో అలాంటి ఉత్తమమైన వామనపురాణాన్ని శ్రద్ధగా వినండి. స్థాణువట సమీపాన, వాలఖిల్యాది మునులు బ్రహ్మపుత్రులైన మహనీయులతో ఆసీనుడైన బ్రహ్మ మానస పుత్రుడు సనత్కుమారుని సమీపించి మార్కండేయ ముని ఒకపరి వినయంగా అభివాదనంచేసి, ఆ సరోవరం యొక్క విస్తారం, మహిమలు, ఉనికీ వివరించవలసినదిగా అర్థించాడు. సర్వశాస్త్ర కోవిదుడవైన బ్రహ్మకుమారా! సర్వపాపాలు క్షాళనంచేసే సరోవర మహిమ నాకు తెలుపగోరెదను. ఏఏ తీర్థాలు ప్రత్యక్షంగా ఉన్నవి, ఏ తీర్థాలు గుప్తంగా ఉన్నవి? స్థాణువుకు అతిదగ్గరగా ఉన్న అతిపవిత్ర లింగాలు ఎవ్వి? దర్శన మాత్రాన ముక్తి ప్రదాలైన ఆలింగాలను గురించీ, పవిత్ర వటవృక్షదర్శన పుణ్యం, దాని ఉత్పత్తీ, తీర్థప్రదక్షిణ స్నానాల ఫలం వివరించండి. అచట ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండే దేవతల నారాధించిన కలుగు ఫలం దేవాధిదేవుడైన స్థాణువు సరోవరం మధ్య ఉండుట, శక్రుడా తీర్థాన్ని మట్టితో పూడ్చుట, అ స్థాణు తీర్థమహిమ, చక్రతీర్థ సూర్యతీర్థ సోమతీర్థాల మహిమా విశేషాలు వివరించండి. మహామునీ! బ్రహ్మ ముఖతః తమరు తెలుసుకున్న వివరాలతో ఈశ్వరుని గుహ్య స్థానాలు విష్ణు స్థానాలు సరస్వతీ వృత్తాంతం దేవాదిదేవుని మహిమ మొదలైనవి సవిస్తరంగా తెలుపగలరని మార్కండేయ మహర్షి ఆయనకు విన్నవించాడు.

లోమహర్షణుడిలా అన్నాడు. మార్కండేయముని మాటలు విన్న వెంటనే బ్రహ్మాత్ముడైన ఆ మహాముని, తీర్ధములందు అతిశ్రద్ధకలవాడై ఎంతో భక్తితో తనపర్యంకాసన ముద్రవీడి పరమ శివునకు నమస్కరించి తాను పూర్వం బ్రహ్మవలన విన్నదంతయు చెప్ప నారంభించాడు. ఓ మహామునీ! వరదుడు కల్యాణకరుడునగు మహేశ్వరునకు నమస్కరించి మున్ను నేను బ్రహ్మవలన వినినట్టి తీర్థముల ఉత్పత్తి ప్రకారం వినిపించెదను. పూర్వం భయంకరమైన జల ప్రళయమేర్పడి స్థావరజంగ మాత్మకమైన జగత్తంతా నశించిపోయింది. సకల జీవసృష్టికి మూలమైన పెద్ద అండం (గ్రుడ్డు) ఒకటి పుట్టింది. అండంలో ఉన్న బ్రహ్మ వేయి యుగాలపాటు నిద్రించి మేలుకొన్నాడు. లోకమంతా శూన్యంకావడంచూచి ఆయన రజోగుణమోహితుడై సృష్టిచేయ నాలోచించాడు. సృష్టి గుణం రజస్సు, స్థితిగుణం లయంకాగా ఉపసంహారకాలంలో తమోగుణం ప్రవర్తిస్తుంది. ఇక ఈ సకల జీవులను వ్యాపించియున్న ఆ పరమపురుషుడగు భగవానుడో సకల గుణాలకు అతీతుడు. అతడే బ్రహ్మగా ఈశ్వరుడుగా గోవిందుడుగా పిలువబడే సనాతనుడు. పరతత్వాన్ని గుర్తించినవానికి సకలం తెలిసి ఉంటుంది. అతడే సర్వజ్ఞుడు. అలా ఆత్మతత్వాన్ని తెలిసికొన్న మహనీయులకు ఈ తీర్థాలు ఆశ్రమాలు ఏవీ అవసరంలేదు. వారు ముక్తులు. సంయమమనే పవిత్ర తీర్థాలతో, సత్యం శీలం సమాధులనే పవిత్రో దకాలతో శోభించే ఆత్మయే పవిత్రమైనది. అందులో స్నానంచేసిన పుణ్యుడు పవిత్రుడౌతాడు. అంతేకాని అంతరాత్మ శుద్ధి నీటి వల్ల కలుగనేరదు. కనుక ఆత్మజ్ఞాన సుఖంలో నిమగ్నమై ఉండుటే మానవుడొనర్చవలసిన ప్రధాన కర్తవ్యం. అదే తెలియ వలసిన ఏకైక వస్తువని, దానిని పొందిన వాడు సమస్తమైన కోరికలను వదలి వేయుననీ సాధువులు చెబుతారు. బ్రాహ్మణుడగువానికి సర్వసమతా భావాలు ఏకత్వం శీలం వదల కుండుట హింసాత్యాగం క్రోధరాహిత్యం ఉపరతి (అసంగం) అనే గుణాలే నిజమైన ధనం. దానిని బోలినధనం మరొకటి లేదు. ఓ బ్రాహ్మణోత్తములారా! సంక్షేపంగా మీకు బ్రహ్మ స్వరూపాన్ని గురించి చెప్పాను. దీనిని తెలుసుకున్నవాడు నిస్సందేహంగా పరమ బ్రహ్మను పొందుతారు.