వామన మహా పురాణము
వామనమూర్తి దేవమాత ఉదర ప్రవేశం
దేవమాత ఉదరంలో వామనాకృతితో భగవంతుడు ప్రవేశించి నంతనే, ఆ స్వామి చెప్పినట్లే, దైత్యులందరూ తమ తేజస్సును కోల్పోయారు. అలా అసురులందరు తేజోహీనులగుట చూచి బలి, దానవేశ్వరుడైన ప్రహ్లాదునితో ఇలా అన్నాడు. “తాతా! మీరు పరమ జ్ఞానులు. మన రాక్షస వీరులంతా ఇలా తేజస్సు గోలుపడి యుండుటకు కారణమేదో చెప్పండి.” అంతట మనుమని ప్రశ్నవిని ఆ ప్రహ్లాదుడు ముహూర్తకాలం ధ్యానస్థుడై వారల తేజోహానికి కారణమేమా అని ఆలోచించి అందులకు భగవంతుడగు వాసుదేవుడే కారణమని తెలుసుకొని, యోగశక్తితో ఆ సమయాన విష్ణు డెచటనున్నాడా అని అన్వేషించాడు. నారదా! అంతటనా భగవంతుడు నాభికి దిగువ భాగాన సప్తపాతాళాలను శోధించాడు. తర్వాత భూమిని వెదకి పైన ఉన్న లోకాలను పరిక్రమించాడు. మొదట పద్మాకారంలో ఉన్న భూమిని అనంతరం దాని మధ్య భాగాన గల స్వర్ణశైలం మేరు పర్వతాన్ని సకల ఐశ్వర్యాలతో విరాజిల్లు తున్న దానిని దర్శించాడు. దానిపైన అష్టదిక్పాలకుల నగరాలనూ వానికి పై భాగాన బ్రహ్మసదనం వైరాజ్యాన్ని కనుగొన్నాడు. దానికి దిగువ భాగాన ఒక పుణ్యాశ్రమం కనిపించింది. మృగపక్షి సమాకులమైన ఆ ప్రదేశాన్ని సురలు పూజిస్తున్నారు. ఓనారదా! అఆశ్రమంలో అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్న దేవమాత అదితినిచూచి శ్రీహరిని వెదకుటకై అందులో ప్రవేశించాడు. అచట జగత్పిత సర్వభూతవరేణ్యుడైన మాధవుని అదితి గర్భంలో వామనాకృతిలో దర్శించాడు. ఆ పుండరీకాక్షుడు శంఖ చక్ర గదాధారియై సురాసురులచే పరివేష్టితుడై సర్వత్రావ్యాపించి క్రమంగా మరుగుజ్జు ఆకారంలో యోగశక్తి ద్వారా మాతృకుక్షిస్థుడై కనిపించాడు. దైత్యలోక తేజోహరుడుగా ఆ విష్ణుని గుర్తించి ఆ ప్రహ్లాదుడు ధ్యానముద్రను వీడి ప్రకృతిస్థుడైనాడు. అంతట మనసా మధుసూదనునకు ప్రణామం గావించి మహామతియైన ఆ భక్తాగ్రగణ్యుడు తన మనుమడు, విరోచన నందనుడు నగు బలితో యిలా అన్నాడు.
వత్సా! మనందరకూ ఏ దిక్కు నుండి విపత్తు రానున్నదో దేని వలన దైత్యులందరు తేజో హీనులయినారో ఆ వివరమంతా చెబుతున్నా వినుము. నీతో యుద్ధం చేసి ఓడిపోయి, యింద్ర, రుద్ర, సూర్యాగ్ని మొదలగు దేవతలందరు త్రిలోకారాధ్యుడైన శ్రీహరి కడకు పోయి శరణాగతులయ్యారు. ఆ జగద్గురుడు ఆ ఇంద్రాదుల కభయమిచ్చి ఇప్పుడు అదితి గర్భంలో పెరుగుతున్నాడు. ఆయనే మన వారందర తేజాలు అపహరించాడని నా విశ్వాసము. అంధకారం సూర్యోదయాన్ని ఎంతసేపు ఆపగలుగుతుంది? ఓ నారదా! ప్రహ్లాదుని మాటలు వింటూనే కోపంతో పెదవులు కంపించగా భావి కర్మ ప్రచోదితుడై ఆబలి తాతతో యిలా పరుష వచనాలు పలికాడు. “పితామహా! మనవారందరి భయాలకు కారణంగా నీవుచెబుతున్న ఆవిష్ణు వెవరయ్యా? ఆ వాసుదేవుని మించిన బలాఢ్యులు నా రాక్షస గణంలో ఎందరో ఉన్నారు? ఇంద్రాగ్ని రుద్ర మరుద్గణాలకు చెందిన వేలాది దేవతల దర్పాన్ని చూర్ణంచేసి వారలను యుద్ధంలో మన వీరులు మట్టి కరిపించారు. పరుగిడుతున్న సూర్యుని రధ చక్రాన్ని బలవంతంగా ఊడ బెరికి విసరికొట్టిన మహాబలుడు విప్రచిత్తి నా సేనానాయకుడు. అయఃశంకుడు, శివుడు, శంభుడు, అసిలోముడు, విలోమకృత్తు, త్రిశిరుడు, మకరాక్షుడు, వృషపర్వుడు, నతేక్షణుడు, వీరలూ, యింకా ఎందరో ఆయుధ ప్రయోగంలో దక్షులు మన ప్రక్కన ఉన్నారు. వీరిలో ఏ ఒక్కడు పరాక్రమంలోనైనా పదహారవ వంతు కూడా లేని వాడా విష్ణుడు. వాని వల్ల భయమా?” పౌత్రుడాడిన పరుషవచనాలు విన్నంతనే ప్రహ్లాదుడు క్రోధ తామ్రాక్షుడై వైకుంఠుని ఆక్షేపిస్తున్న అతడిని ధిక్కరిస్తూ గర్జించాడు. ఛీ! ఛీ! మూర్ఖా! దుష్టాత్మా! ఎంత పాపిష్టి నాలుకరా నీది? ఓరి బాలిశుడా! శ్రీహరిని నిందించిన నీ నాలుక ఇంకా తెగి ఏల భూమిపై బడదురా? త్రిలోక గురువైన విష్ణు నిందగావించిన నిన్ను సాధులోకమంతా గర్హిస్తుందిరా? నీ దుర్బుద్ధి ఎంతైనా చింతించదగినది నీ వంటి వాని తండ్రిని కన్నందుకు ఎంతో విచారిస్తున్నా. నీ లాంటి కఠోరుడు దేవ నిందకుడు పౌత్రుడగుట నా దౌర్భాగ్యము. నీవు, ఈ రాక్షస గణమంతా, నాకు జనార్దనుని కన్న ప్రియు లెవరూ లేరనే విషయం బాగా ఎరుగుదురు. ఆ శ్రీహరి నాకు ప్రాణాల కన్నా ప్రియతముడని తెలిసి కూడా ఆ సర్వేశ్వరేశ్వరుని ఎలా నిందించగలిగితివి? నీకు నీ తండ్రి పూజ్యుడు, వాని (విరోచనుని)కి నేను తండ్రిగా పూజ్యుడనైన గురువును, ఇకనాకో, ఆలోక గురువు విష్ణువు పూజ్యతమ గురువు! అలాంటి పరమగురువునే నిందించిన నీవింకనూ అధఃపతనంపొందవేమి? నీ మూలంగా ఈ దానవ జాతి అంతా అప్రతిష్ట పాలయింది. నీ వంటి క్రూరుడు వాసుదేవ నిందకుడు రాజుగా ఉండటం వీరల దౌర్భాగ్యం. జగత్పూజ్యుడగు హరిని నిందించిన పాప ఫలంగా నీకు రాజ్య నాశనం కలుగుతుంది. త్రికరణ శుద్ధిగా నాకు కేశవుడే ప్రియతముడైతే నీవు రాజ్యభ్రష్టుడవై పోతావు పో! చతుర్దశ లోకాల్లో ఆదేవుని రూపంకాని వస్తువేదీ లేనట్లయితే నీవు రాజ్య నాశనం అనుభవించి పతితుడవు కమ్ము! సృష్టిలోని సకల భూతజాలానికి శ్రీహరి కన్నా శరణ్యం అంటూ వేరే లేకపోయినట్లయితే నీవు రాజ్యభ్రష్టుడివి కావడం త్వరలోనే నేను చూస్తాను.