వామన మహా పురాణము
భారతవర్షం
ఇక భారత వర్షం-ఇంద్ర ద్వీపం, కసేరుమాన్, తామ్రవర్ణం, గభస్తిమాన్ నాగ ద్వీపం, కటాహం, సింహళం, వారుణం, కుమారం అనే తొమ్మిది ద్వీపాలుగా విభక్తమైంది. వానిలో ఇది దక్షిణోత్తరదిశలో సముద్రంచేత చుట్టబడియున్న కుమారద్వీపం. ఓ వీరుడా! దీనికి తూర్పున కిరాతులు, పడమట యవనులు, దక్షిణాన ఆంధ్రులు, ఉత్తర సీమన తురుష్కులు ఉన్నారు. అక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తదితర జాతులవారు యజ్ఞాలు, యుద్ధాలు, వాణిజ్యం, గోపాలనం మొదలయిన విద్యుక్త ధర్మాలను నిర్వహిస్తూ పవిత్రులై నారు. వారల పరస్పర ఆచరణలు, స్వర్గమోక్ష సంపాదనము, పుణ్య పాపాలు, కర్మాచరణాన్ని అనుసరించి నిర్ణయింపబడుతవి. అక్కడ మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమాన్, ఋక్ష, వింధ్య పారియాత్రములనే సప్తకుల పర్వతాలున్నవి. ఈ ప్రధాన గిరులు కాక వందలు వేల సంఖ్యలో విస్తార వైశాల్యాలు గలిగి రమణీయాలయిన ఇతర పర్వతాలుకూడ ఉన్నవి. కోలాహలం వైభ్రాజం, మందరం, దుర్దురం వాతంధమం వైద్యుతం, మైనాకం, సరసం, తుంగప్రస్థం, నాగగిరి, గోవర్ధనాచలం, ఉజ్జాయనం, పుష్పగిరి, అర్బుదం, రైవతం, ఋష్యమూకం, గోమంతం, చిత్రకూటం, కృతస్మరం, శ్రీపర్వతం, కొంకణం వానిలో కొన్ని. ఈ పర్వత ప్రదేశాలతో కలిసి మ్లేచ్ఛ ఆర్యజన పదాలెన్నో వెలిశాయి. వీనికి జలప్రదానం గావించే శ్రేష్ఠ నదులను గురించి చెబుతున్నాము. జాగ్రత్తగా వినుము. సరస్వతి, పంచరూప, కాళింది, హిరణ్వతి, శతద్రు, చంద్రిక, నీల, వితస్త, ఐరావతి, కుహూ, మధురా, హారరావీ, ఉశీర, ధాతుకి, రసా, గోమతి, ధూతపాపా, బాహుద, దృషద్వతి, నిశ్చిరా, గండకి, చిత్ర కౌశికీ, వధూసరా, సరయూ, లౌహిత్య ఈ నదులు హిమవత్పాద భూమినుంచి ఉద్గమిస్తాయి.
వేదస్మృతి, వేదసినీ, వృత్రఘ్ని, మహీపారా, చర్మణ్వతి, లూపి, విదిశా, వేణుమతి, సిప్ర, అవంతీ అనే నదులు పారియాత్రగిరి నాశ్రయించి యున్నవి. శోణా, మహానది, నర్మద, సురస, కృపా, మందాకిని, దశార్ణ, చిత్రకూట, అపవాహిక, చిత్రోత్పల, తమసా, కరమోద, పిశాచిక, పిప్పలశ్రోణి, విపాశ, వంజులావతి, సత్సంతజ, శుక్తిమతి, మంజిష్ఠా, కృత్తిమా, వస, తదితర నదులు ఋక్షగిరి నుంచి ప్రభవించినవి. శివ, పయోష్ణి, నిర్వింద్య, తాపి, నిషధా వతి, వేణా, వైతరణీ, సినీబాహు, కుముద్వతి, తోయా, మహాగౌరీ, దుర్గంధా, వాశిలా ఈ పవిత్ర నదులు వింధ్యపాదమూలాన ప్రభవించినవి. గోదావరి, భీమరథీ, కృష్ణా, వేణా, సరస్వతి, తుంగభద్ర, సుప్రయోగా, వాహ్య, కావేరి, దుగ్ధోద, నళినీ, రేవా, వారిసేన, కలస్వనా, ఈ మహాతరంగిణులు సహ్యాద్రి కుమారికలు. కృతమాల, తామ్రపర్ణి, వంజుల, ఉత్పలావతి, సినీ, సుదామ, ఇవి శుక్తిమత్పర్వత పుత్రికలు. ఈ నదులన్నీ పరమ పవిత్రాలు, సాగర పత్నులు. రాక్షసవరా! యింకా ఎన్నో వేలాది క్షుద్ర నదులున్నవి. కొన్ని అన్ని ఋతువుల్లో ప్రవహించేవి కాగా యితరాలు వర్షాకాలంలోనే కనిపిస్తాయి. ఇవన్నీ తమకందుబాటు గల ప్రదేశాలకు పుష్కలంగా జలప్రదానం చేస్తాయి.
మత్స్య, కుశట్ట, కుణి, కుండల, పాంచాల, కాశీ, కోసల, వృక, శబర, కౌవీర, సభూలింగ, శక, సమశక. జనపదాలు మధ్యదేశం లోనివి. వాహీక, వాటధాన, అభీర, కాలతోయక, అపరాంత, శూద్ర, వహ్లవ, ఖేటక, గాంధార, యవన, సింధు, సౌవీర, మద్రక, శతద్రవ, లలిత్థ, పారావత, మూషక, మాఠర, ఉదకధార, కైకేయ, దశమజన పదస్థులు క్షత్రియ వైశ్య శూద్ర కులాలవారు వైశ్యుల స్థానంలోను, కాంభోజ, దరద, బర్బర, అంగలౌకిక, చీన, తుషార తదితరులు, జనపదాలకు వెలుపలను ఉందురు. ప్రస్థలులు, ఆత్రేయులు, భరద్వాజులు, దశేరకులు, లంపకులు, తావకులు రామలు, శూలికులు, తంగణులు, ఔరసులు, అలిమద్ర, కిరాత జాతులవారు, తామసులు, క్రమ మాసలు, సుపార్శ్వులు, పుండ్రకులు, కులూతులు, కుహుకులు, ఊర్ణులు, తూణిపాదులు, కుక్కుటులు, మాండవ్యులు, మాలవీయులు వీరంతా ఉత్తరాపథవాసులు.
అంగ, వంగ, ముద్గరవ, అంతర్గిరి, బహిర్గిరి, ప్రవంగ, వాంగేయ, మాంసాద, బలదంతిక, బ్రహ్మోత్తర ప్రావిజయ, భార్గవ, కేశబర్బర, ప్రాగ్జ్యోతిష, శూద్ర, విదేహ, తామ్రలిప్తక, మాల, మాగధ, గోనందులు తూర్పు జనపదాలు. రాక్షసేశ్వరా! పుండ్ర, కేరళ, చౌడ, కుల్య, జాతుష, మూషికాద, కుమారాద, మహాశక, మహారాష్ట్ర, మహిషక, కళింగ, ఆభీర, నైషీక, అరణ్య, శబర, బలింధ్య, వింధ్య, మౌళేయ, వైదర్భ, దండక, పౌరిక, సౌశిక అశ్మక, భోగవర్ధన, వైషిక, కుందల, ఆంధ్ర ఉద్భిద, నలకారక, జనపదాలు దక్షిణ దిశన గలవు. సూర్పారక, కారివన, దుర్గ, తాళీకట, పుళీయ, ససినీల, తాపస, తామస, కారస్కర, రమిన, నాసిక్యాంతర, నర్మద, భారకచ్ఛ, మాహేయ, సారస్వత, వాత్సేయ, సౌరాష్ట్ర, అవంత్య, అర్బుద-ఇవి పశ్చిమానగల జనపదాలు. అక్కడి జనులు కారుష, ఏకలవ్య, మేకల, ఉత్కల, ఉత్తమర్ణ, దశార్ణ, భోజ, కింకవర, తోసల, కోసల, త్రైపుర, చైల్లిక తురుస, తుంబర, వహన, నైషధ, అనూప, తుండికేర, వీతిహోత్ర, ఆవంతి ఓ సుకేశీ! ఈ జనపదాలు వింద్యాద్రి పాదమూలాన ఉన్నవి. ఇక పర్వత ప్రదేశాలలోని జనపదాలు ఇవి-నిరాహార, హంసమార్గ, ఊర్ణ, పుణ్య, కుపథ, తంగణ, ఖశ, కుథప్రావరణ, హూహుక, త్రిగర్త, కిరాత, తోమర, హిమవన్నగ ప్రదేశాలు.
రజనీచరవరా! కుమార ద్వీపంలోని జనపదాలను గురించి విపులంగా చెప్పితిమి. ఇక ఈ ప్రదేశాలలో ఆచరించబడే ధర్మాచారాలను వివరించెదము వినుము.
ఋషుల వచనము: అహింస, సత్యం, అస్తేయం (అచౌర్యం) దానం క్షాంతి (సహనం) దమం(ఆత్మనిగ్రహం) శమం (శాంతి), అలోభిత్వం, పవిత్రత, తపస్సు, ఇవి సర్వవర్ణాల వారికి నిర్దేశింపబడిన ధర్మదేవతకు అంగములు. నాలుగు ఆశ్రమాలకు విహితాలయిన బ్రాహ్మణులకు కూడ అనుష్ఠేయాలు. అని తెలుపగా
సుకేశి: తపోధనులారా! బ్రాహ్మణులు జీవితంలో నాలుగు దశ (ఆశ్రమము)ల యందు ఆచరించాల్సిన ధర్మ విధులు నాకు వివరంగా చెప్పండి. ఇంతవరకు విన్న దానితో నా జ్ఞాన తృష్ణ తీరలేదు అన్నాడు అందుకు జవాబుగా
ఋషులు: ఉపనయనమైన పిదప బ్రహ్మచారి గురుకులావాసం చేస్తూ అక్కడి విధులన్నీ పాటించాలి. వినుము.
వేదాధ్యయనం, అగ్ని సేవనం, స్నానం, భిక్షాటనం, తెచ్చిన భిక్ష గురువుకు నివేదించి, ఆయన అనుజ్ఞతో భుజించుట, ఉత్సాహంతో గురువుగారికి అన్ని విధాల శుశ్రూష చేస్తూ ఆయన ప్రేమకు పాత్రుడు కావడం, గురువు పిలిచినప్పుడు భక్తిశ్రద్ధలతో వెళ్ళి ఆయన చెప్పే పాఠాలు వినడం, ఒకటో రెండో, లేక నాలుగు వేదాలను గురుముఖతః అభ్యసించి, గురువుకు తగిన దక్షిణ ఇచ్చి, ఆయన అనుజ్ఞతో తన ఇష్టప్రకారం గృహస్థాశ్రమాన్ని కానీ, వానప్రస్థ, సన్యాసాశ్రమాన్ని కానీ స్వీకరించడం, లేక గురువు ఇంట్లోనే ఉండి నైష్ఠిక జీవితం గడపడం. ఆయన తర్వాత ఆయన కుమారుని కానీ, కుమారులు లేని పక్షాన ఆయన శిష్యులను కాని ఏమాత్రం గర్వాభిమానాలు లేకుండా సేవించడం, బ్రహ్మచర్యాశ్రమ విధులు. ఈ విధంగా నడుచుకొనే బ్రాహ్మణుడు మృత్యువును జయిస్తాడు. రాక్షసవరా! గృహస్థుగా ఉండ గోరినవాడు గుర్వాశ్రమం వదలి, తనకన్నను భిన్న గ్రోత ఋషిపరంపరకు చెందిన ఉత్తమకుల వధువును భార్యగా స్వీకరించాలి. తన విధ్యుక్త ధర్మానుసారం ధనోపార్జన చేసి, పితృదేవాతిథులను భక్తితో సంతృప్తి పరుస్తూ చక్కని నడవడి కలిగి ఉండాలి అని తెలిపారు.
సుకేశి అప్పుడు, సదాచరణం, మంచి నడవడి అన్నారు గదా. ఆ మంచి నడవడి అనగానేమో దయచేసి వివరించండి అని ప్రార్థించాడు.
దానిపై ఋషులు, నీమీద గల ఆదరంతో నీకు సదాచరణమును వివరించాము. రాక్షసపతీ! దానిని గురించి వివరంగా వినుము. గృహస్థు ఎల్లప్పుడు ఆచారవంతుడుగా ఉండాలి. ఆచార హీనునకు ఇహపరాల్లో గూడ మేలుకలుగదు. సదాచారోల్లంఘన చేయువానికి, యజ్ఞం దానం తపోవ్రతాదుల వల్ల మంచి కలుగదు. దుష్టాచరణం చేయువానికి ఇహపరాల్లో సుఖం కలుగదు. కాబట్టి గట్టిగా ప్రయత్నించి మానవుడు సదాచరణం చేయాలి. సదాచరణ చెడుగును నశింప చేస్తుంది. దానవా! ఆ సదాచరణ స్వరూపాన్ని చెబుతున్నాం. శ్రద్ధగా వినుము. ధర్మం సదాచార వృక్షానికి మొదలు ధనం శాఖలు, కామం పుష్పం, మోక్షం ఫలం. ఇలాంటి సదాచార వృక్షాన్ని సేవించినవాడే పుణ్యాత్ముడు. బ్రాహ్మీముహూర్తాననే నిద్రలేచి దేవస్మరణం ఋషిస్మరణం చేయాలి. తర్వాత శంకర ప్రోక్తమైన ప్రాభాతిక మంగళస్తోత్రం పఠించాలి అని తెలిపారు.