వామన మహా పురాణము
యజ్ఞ పలాయనం
యజ్ఞాగ్నులు చల్లారినంతనే యజ్ఞ దేవత దివ్య మృగరూపము ధరించి దక్షిణతో సహా గగనవీథికెగసిపోయెను. అట్లు పరుగిడుచున్న యజ్ఞాన్ని చూచి కాలరూపియగు మహేశ్వరుడు పాశుపతాస్త్రం సంధించి దాని వెంటబడెను. ఆ సందర్భమున శంకరుడు "యజ్ఞశాలాంతమున జటాధరుడుగా నర్ధభాగమును, మిగత సగభాగము ఆకాశమున కాలరూపిగను విఖ్యాతు డయ్యెను" అని పులస్త్యుడు దక్షయజ్ఞ ధ్వంసము వివరింపగా! నారదుడు: బ్రహ్మర్షీ! శంకరుడు గగన వీధిలో కాలరూపిగ నగుపించునని చెప్పితిరి. ఆ స్వరూప లక్షణ స్వభావములు గూడ విశదముగ సెలవీయవలెను.
అందులకు పులస్త్యుడు, నారదా! అత్రి పురాంతకుడు లోక కళ్యాణ కాంక్షతో కాలరూపియై గగనము నాక్రమించెను. ఆ కాలరూపి స్వరూప లక్షణములు వినుము.
అశ్వినీ, భరణీ, కృత్తిక మొదటి పాదముతో కూడి మేషరాశితో కలిసిన కుజ క్షేత్రం ఈ కాళేశ్వరుని శిరస్సు. శేషించిన కృత్తిక మూడు పాదములు రోహిణి, మృగశిర రెండు పాదములు, వృషరాశితో గూడిన శుక్ర క్షేత్రము ఆయన ముఖము. బుధ క్షేత్రం మిథునరాశి, మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్రా, పునర్వసు ప్రథమ పాదత్రయము-ఆ మహాదేవుని భుజములు. చంద్ర క్షేత్రం కర్కాటక రాశి, పునర్వసు అంతిమచరణం పుష్యమి, ఆశ్లేష నక్షత్రములు కలిసి అవ్యోమకేశుని ఇరుపార్శ్వములు, రవి క్షేత్రం సింహరాశి, మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గునీ నక్షత్ర ప్రథమ చరణముల సమాహారమే ఆ మహాకాలుని హృదయము. నారదా! బుధుని రెండవ గృహము, కన్యారాశి, కలిగి శేషించిన ఉత్తర ఫల్గుని పాదత్రయము, హస్త, చిత్రా నక్షత్ర పాదద్వయ పరివ్యాప్తమైన భాగమాకాలుని జఠర భాగమని తెలియుము. శుక్రుని రెండవ యిల్లు తులారాశి, చిత్రా నక్షత్రము తృతీయ చతుర్థ పాదములు, స్వాతి, విశాఖ నక్షత్ర పాదత్రయముతో గూడిన గగన పథమాయన నాభిస్థానము. కుజ గ్రహద్వితీయ గృహము, వృశ్చికరాశి, విశాఖ చతుర్థ పాదము అనూరాధా జ్యేష్ఠతారలు ఆ కాలరూపి గుహ్యాంగము, బృహస్పతి క్షేత్రం, ధనూరాశి, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ప్రథమ చరణములు ఇవి ఈశ్వరుని ఊరువులు. (తొడలు); ఓ మునీ! శనిగృహం, మకరరాశి, ఉత్తరాషాఢ రెండు మూడు నాల్గు చరణాలు, శ్రవణం ధనిష్ఠాచరణద్వయము ఆ పరమేశ్వరుని జానువులు (మోకాళ్లు); సూర్యుని రెండవ గృహం, కుంభరాశి, ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు, శతభిషం పూర్వాభాద్ర మూడు పాదములు గల భాగం ఆ స్వామి జంఘలు (పిక్కలు); బృహస్పతి రెండవ గృహం, మీన రాశితో గూడి పూర్వాభాద్ర చివరపాదము, ఉత్తరాభాద్ర రేవతీ నక్షత్ర పరివ్యాప్తమగు వియత్పథము మహేశ్వరుని చరణ ద్వయము. ఈ విధంగా అనంతమైన కాలరూపం ధరించి ఆ త్రినేత్రుడు కోపంతో యజ్ఞ మృగాన్ని బాణాలతో ప్రహరించాడు. ఆ బాణాల తాకిడికి సమస్త బాధలు వదలి ఆయజ్ఞ మృగము తారకలతో కలసి ఆకాశంలోనే నిలచి పోయెను" అని వివరించగా
నారదుడు: బ్రహ్మర్షీ! రాశులు పండ్రెండు కలవని తాము సెలవిచ్చిరి. ఆ రాశుల స్వరూప లక్షణములు విశదముగా సెలవీయుడు అని అడిగెను.