వామన మహా పురాణము
చతుర్వర్ణాశ్రమ వర్ణనం
ఆ వనం మధ్య భాగాన, ఓ నారదా! చతుర్వర్గాలకూ నెలవైన సర్వ జనులచే పూజింపబడే మహా పుణ్యాశ్రమాన్ని ఆ మునులు చూచారు. అక్కడ తూర్పు ముఖంగా మోదుగుచెట్ల గుంపులచే ఆవరింపబడిన ధర్మాశ్రమం ఉంటే పశ్చిమ ముఖంగా చెరకు తోటలతో నిండిన అర్థాశ్రమం నెలకొన్నది. దక్షిణాభి ముఖంగా అరటి అశోక వృక్షాల మధ్య కామ్య ఆశ్రమం, ఉత్తర ముఖంగా శుద్ధ స్ఫటిక శోభతో వెలిగే మోక్షాశ్రమం విరాజిల్లుతున్నాయి. కృతయుగాంతాన ఆ ఆశ్రమంలో మోక్షం నివసించగా త్రేతాయుగాంతాన కామం ఆశ్రమ వాసం చేస్తుంది. ద్వాపరాంతాన అర్థాని కిక్కడ స్థానం లభిస్తే కలియుగ ఆరంభంలో ధర్మం ఆ ఆశ్రమంలో వాసం చేస్తుంది. ఆత్రేయాదులగు మహర్షులా నాలుగాశ్రమాలూ చక్కని జల సమృద్ధితో విలసిల్లే ఆ అఖండ గిరినిచూచి దానిమీద మోజుపడ్డారు. ధర్మాది పురుషార్థ చతుష్ఠయమయుడగుటచే విష్ణు భగవానునకు అఖండతత్వమను పేరు గలిగినది. అందుకు సూచనగా చతుర్భుజుడగు జగన్నాథుడుగా విష్ణువుకు ప్రతిష్ఠకు ముందు నుంచే కలిగి ఉంది. నారదా! ఆ ప్రభువును, ఆ ప్రదేశాన బహుశ్రుతులు యోగాత్ములునగు మునులు ఏకాగ్రచిత్తాలతో బ్రహ్మచర్యదీక్షతో ఆరాధిస్తారు. రాక్షసులకు వెరచి మునులంతా ఆ అఖండ పర్వతాన్ని ఆశ్రయించుకొని ఉంటారు. అశ్మకుట్ట, మరీ చిపులను బ్రాహ్మణులు కొందరు కాళింది నదిలో స్నానం చేసి దక్షిణాభిముఖులై వెళ్లి అవంతి దేశాన విష్ణువు నాశ్రయించి స్థిరపడ్డారు. విష్ణు మహిమవల్ల రాక్షసులు కాదేశంలోకి ప్రవేశించడం దుర్టభము. ఇక వాలఖిల్యాది మునులు దానవుల బాధకు తాళ లేక బ్రహ్మచర్య దీక్షితులై రుద్రుని ఆశ్రయించారు.