పృథూదక తీర్థమహాత్మ్యం

దేవదేవుడిలా అన్నాడు, ఆవిధంగా పృథూదక క్షేత్రం పాపభయనివారకం. కాన దేవతలారా! సన్నిహిత తీర్థం వరకు సూచించబడిన ఆ మహాతీర్థానికి మీరు వెళ్ళండి. మృగశిర నక్షత్రంలో సూర్యచంద్ర బృహస్పతులు చేరిన పవిత్ర తిథి అక్షయ అనిపించు కుంటుంది. అక్కడ ప్రాచీన సరస్వతీ తీరానికి వెళ్ళి భక్తితో శ్రాద్ధ కర్మ నిర్వర్తించి పితరులను ఆరాధించండి. మహావిష్ణువు చెప్పిన హితోక్తులు విని ఇంద్ర పురోగాములై దేవతలు కురుక్షేత్రంలోని పావన పృథూదక తీర్థానికి వెళ్ళారు. అక్కడ స్నానం చేసి దేవతలు బృహస్పతిని ప్రార్థించారు. “మహాత్మా మృగశిరా నక్షత్రంలో ప్రవేశించి ఈ తిథిని పవిత్రం కావించండి. సూర్యుడు చంద్రుడు కూడ అందులో ప్రవేశించారు. గురుదేవా! ఇక దేవతల కార్యమంతా మీమీద ఆధారపడిఉంది. అందులకు బృహస్పతి నాకు ఈ సంవత్సరాధిపత్యం ఇస్తేనే మీరు చెప్పినట్లు చేయువాడ”ననగా దేవతలందుల కంగీకరించారు. వెంటనే బృహస్పతి మృగశిరలో ప్రవేశించాడు. ఆషాఢంలో మృగశిరా నక్షత్రయుక్త అమావాస్యనాడు దేవేంద్రుడు ప్రీతిపూర్వకంగా కురుక్షేత్రంలో పితరులకు, తిలమధుహవిష్యాన్నంతో చేసిన పిండ ప్రదానం చేశాడు.