వామనుని యజ్ఞవాటికా ప్రవేశం

పులస్త్యుని వచనము - నారదా! ఈ లోపున వామనాకృతి ధరించిన భగవానుడు బలి యజ్ఞశాలను సమీపించి మేఘగంభీర స్వరంతో ఇలా అన్నాడు. ఈ యజ్ఞంలో ఓంకార పూర్వకాలయిన వేదాలన్నీ తపోధనులు రూపాన నెలకొని ఉన్నవి! ఇక అశ్వమేధమా! యజ్ఞాలన్నింటిలోను తలమానికం బలి దానవేంద్రుడో, యజ్ఞ కర్తలందరిలోనూ ఉత్తముడు!

ఆ మాటలు వినగానే జితేంద్రియుడగు దానవేంద్రుడు అర్ఘ్య పాత్రతో భగవానుడు నిలబడినచోటుకు వెళ్లి అర్ఘ్యపాద్యాదులతో భరద్వాజ మహర్షి సమేతంగా ప్రభువు నర్చించి, యజ్ఞశాలలోనికి తీసికొని వచ్చాడు. ప్రవేశ ద్వారాన మరల యథావిధిగా కూర్చుండబెట్టి పూజించి చేతులు జోడించి వినయంతో ఓమానదా! ప్రభూ! మీకు నేనేమియివ్వవలెనో ఆజ్ఞాపించం డని అర్ధించాడు. అంత నాఅవ్యయుడగు దేవశ్రేష్ఠుడు దానవేశ్వరుని చూచి చాలా సేపు పకపక నవ్వి భరద్వాజ ఋషిని చూస్తూ ఇలా అన్నాడు నా గురువునకు గురువైన యీ మహనీయుడు అగ్ని (యజ్ఞాగ్ని) పరిగ్రహింపచేశాడు. ఆ అగ్నిని యితరుల భూమిపై నుంచరాదు. అందులకై ఓ దానవేశ్వరా! నా శరీర ప్రమాణానికి సరియైన మూడడుగుల నేల నాకొసగుము. ఇదియే నా యాచన. మురమర్దనుని మాటలు విని ఆ బలి భార్యను తనయుడగు బాణుని చూస్తూ ఇలా అన్నాడు: ప్రేయసీ! చూచావా! ఈవామనుడు ఆకారంలోనే కాక బుద్ధిలో కూడ వామనుడే సుమా! కనుకనే మూర్ఖుడై మూడడుగుల చోటు యాచించాడు. నిజమే. విధాత సామాన్యంగా అల్ప బుద్ధులగువారికీ, భాగ్య దూరులగువారికీ, భూరి భోగభాగ్యాలు ఇవ్వడు. ఇదిగో అల్పాన్ని యాచించే ఈ విష్ణువునకు వలెనే! భాగ్యం వక్రించిన వానికి విధి ప్రదానం చేయడు. నాలాంటి దాతను ఈ పొట్టివాడు మూడడుగులు యాచించడం అంతే కదా! అని ఆ మహనీయుడగు దైత్యపతి శ్రీహరితో మళ్లీ ఇలా అన్నాడు. విష్ణో! అడగవయ్యా, గజాలా, అశ్వాలా, రథాలా, భూమియా, దాసీ జనమా, సువర్ణ రాసులా - ఏమి కావాలో కోరుకో. దాతనైన నేను త్రిలోకాధి పతిని! యాచించే నీవో విష్ణుడవు! ఈ అల్పాన్ని కోరడం మనకు యిద్దరకూ సిగ్గుపడవలసిన విషయం కాదా? రసాతలమా, ఈ ధరణీ మండలమా, భువస్వర్లోకాలా, ఏమి కావాలో అడగ వయ్యా వామనా! తప్పక యివ్వ గలను.