శివపూజా విధానం

పులస్త్యు డిట్లనియె, ఓ నారదా! అంతట దేవతలందరు మురారి విష్ణు మందిరానికి వెళ్ళి ఆ దేవునకు ప్రణామాలుగావించి జగత్సంక్షోభానికి కారణమేమని ప్రశ్నించారు. అదివిని శ్రీహరి మనమందరము  శ్రీ శంకరుని నివాసానికి వెళ్ళుదము. మహాజ్ఞానియగు నాతడే జగత్తు సంక్షోభకారణం చెప్పగలుగును అన్నాడు. జనార్దనుని సలహా మేరకు ఆయన వెంటరాగా ఇంద్రునితో గలసి దేవతలందరు మందరగిరికి వెళ్ళగా నచట శివ పార్వతులు కాని నందీశ్వర వృషభాలు కాని కనిపించలేదు. అజ్ఞానాంధకారం వల్ల మూర్ఖులై వెర్రి చూపులతో నాశూన్య మందిరాన్ని చూస్తూ నిలచిపోయిన దేతలతో మహాతేజస్వియగు నా విష్ణువు, ఇదేమి ఎదురుగా ఆశీనుడైన మహాదేవుడు మీకు కనిపించడం లేదా! అని ప్రశ్నించాడు. అందుకు దేవతలు తమకా గిరిజానాథుడు కనిపించడం లేదు. తమ దృష్టి ఏ కారణాన నశించిందో తెలియదని వాపోయారు. అప్పుడు శ్రీహరి మీరు మహా పాపిష్టులు. శివద్రోహం చేశారు. స్వార్థంతో గ్రుడ్డివారై ఆ భవాని మృడాని గర్భహవనం గావించారు. అందుచేత మీ జ్ఞానం వివేకం ఆ శూలపాణీ హరించాడు. కనుకనే ఎట్టఎదుట ఆయన ఉన్ననూ కళ్ళు తెరచికొని కూడా మీరా ప్రభువును చూడలేకున్నారు. కాబట్టి ఆ పాపపరిహారానికై తప్తకృ చ్ఛ్ర వ్రతం ద్వారా కాయశుద్ధి చేసుకోండి. దేవుని చూడగలుగుటకై ఆ మహనీయునకు అభిషేకం చేయండి. నూట ఏబది కడవల పాలతోను తర్వాత అరవై నాలుగు కుండల పెరుగుతోను, ఆ తర్వాత ముప్పది రెండు కడవల నేయితోను పదహారు కడవలపంచగవ్యం (ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నేయి, ఆవు పేడ, ఆవు పంచితం కలిసిన మిశ్రం)తోను వరసగా ఆ మహాదేవుని అభిషేకించండి. అనంతరం ఎనిమిది కడవల తేనెతో అభిషేకించి కడపటగా పైవాని కన్నింటికీ రెండు రెట్లు కడవల శుద్ధోదకంతో స్వామిని స్నానం చేయించండి. స్నానానంతరం స్వామి దేహానికి రోచన లేపనం (గోరోచనం) నూట ఎనిమిది పర్యాయాలు పూయాలి. కుంకుమ చందనాలతో భక్తి పూర్వకంగా అలంకరించి బిల్వ దళాలు తామరపూలు, ఉమ్మెత్తపూలు, సురచందన మందార, పారిజాత, అతిముక్త కుసుమాలతో అర్చించాలి. అగరు కాలేయం (నల్లగంధ చూర్ణం)తో కలిపి స్వామికి ధూపం వేయాలి. తర్వాత నా హరుని ఋగ్వేదోక్తమైన పదక్రమ విన్యాసంతో శతరుద్రీయ మంత్రజపం చేయాలి. ఇలాచేస్తే మీ పాపాలు తొలగి ఆ స్వామి ప్రసన్నుడై నష్టమైన మీ దృష్టిని తిరిగి అనుగ్రహిస్తాడు. ఇక వేరే దారి ఏదీలేదు. వాసుదేవుని మాటలకు దేవతలు క్రుంగిపోయి ప్రభూ! ఆ తప్తకృచ్ఛ్ర మంటే ఏమో సెలవివ్వండి. దానిని ఆచరించి కాయశుద్ధి చేసుకుంటామని వేడుకున్నారు.