వామన మహా పురాణము
కాశీ వర్ణనం
“మహేశ్వరా! బ్రహ్మహత్యా నివారకములు కర్ణమధురములు, శుభకరములునగు నా వచనములు వినుము. ఇక్కడకు తూర్పుగా ప్రయాగక్షేత్రంలో అవ్యయమగు నా అంశ వల్ల జన్మించిన యోగశాయి నిత్య నివాసియై యున్నాడు. అతని దక్షిణ చరణము నుండి సర్వపాపనాశిని శుభదాయిని యగు వరణానది యుద్భవించినది. వామ చరణము నుండి అసియనెడునది వెలువడినది. ఈ రెండు నదులు లోకపూజ్యములు, పవిత్రములు. ఆ రెంటికీ మధ్యనున్న యోగశాయి క్షేత్రము సర్వపాపములు పోగొట్టు పవిత్ర తీర్థము. ముల్లోకములలో శ్రేష్ఠమైనది. స్వర్గమర్త్య పాతాళాలలో అలాంటి క్షేత్రం లేదు. ఈశ్వరా! అక్కడ పరమ పవిత్రమూ మంగళకరమునగు వారాణసీ నగరమున్నది. ఆ ప్రదేశాన భోగులు కూడ నీలో లయము పొందుదురు. ఆ నగరంలోని ఆకసాన్నంటే దేవాయతనాలు రాత్రులందు చంద్ర కాంతినీ, వాని శిఖరాలపై రెపరెపలాడు సుందర పతాకాలు పగటి యందు సూర్యరశ్మినీ నిరోధించు చుండును. వినోద క్రీడలలో పరాజితులైన వారలలోకూడ నచట అలసట గోచరించదు. అందలి కౌశికు (గుడ్లగూబ)లే దోష (రాత్రి) ప్రియలు. ఇతర జనులు కారు. అకులీనత్వం (భూమిలో లీనముగాకుండుట) నక్షత్రాలలోనే, ఈశానా! ఏవంగుణ విశిష్టమైన వారాణసీ పుణ్యాశ్రమంలో సర్వపాప హరుడగు లోలార్కదేవుడు విజయం చేసియున్నాడు. దశాశ్వమేధ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన అచ్చోట నా అంశతో కేశవుడున్నాడు. అచటకు వెళ్ళినంతనే ఓ సురశ్రేష్టా! నీవు పాపవిముక్తుడవు కాగలవు.
గరుడధ్వజుని ఈ పలుకులు విన్నంతనే వృషధ్వజుడాయనకు శిరసాప్రణామం చేసి అతిత్వరగా, తన పాపవిముక్తికై వారాణసి క్షేత్రానికి వెళ్ళెను. పవిత్ర తీర్థాలతో కూడిన ఆనగరిని దర్శించి, అందలి తీర్థాలలో స్నానమాడి, దశాశ్వ మేధాన్ని లోలార్క భగవానుని దర్శించి, సర్వ పాపాల నుండియు విముక్తుడై శంకరుడు కేశవుని చూచుటకై తిరిగి వెళ్ళెను. కేశవునకు ప్రణామం చేసి “హృషీకేశా! నీ దయవల్ల బ్రహ్మహత్య తొలగి పోయినది. కాని ఈ కపాలము నా అరచేతిని వదలకున్నది. ఇందులకు కారణమేమి?” అని అడిగెను.
మహాదేవుని మాటకు విష్ణువు "ఓ రుద్రా! కపాలమోచనోపాయము చెప్పెద వినుము. ఇదిగో నా ఎదుటనే పద్మోత్పలాలతో నిండియున్న ఈ దివ్య సరోవరం పరమ పవిత్ర తీర్థం, దివ్యగంధర్వసేవితం. దీనిలో స్నానం చేసినంతనే నీకు కష్టాల మోచనము కాగలదు. ఆ కారణంగా ఈ తీర్థానికి కపాలమోచన క్షేత్రమనీ, నీకు కపాలి అనీ ప్రసిద్ధి కలుగుతుంది.”
నారదా! సురేశ్వరుడగు కేశవుడు చెప్పినట్లు మహేశ్వరుడా కపాల మోచన తీర్థంలో విధ్యుక్తంగా స్నానమాచరించగా ఆయన అరచేతికంటుకొనియున్న బ్రహ్మ పుర్రె ఊడిపడెను. భగవత్ప్రసాదంవల్ల అది కపాల మోచనమను పేర పవిత్ర తీర్థమాయెను.