అంధకాసురుని కథ

ఆ ప్రళయగర్జన చెవుల పడటంతో మహిషతారకులు, విరోచన జంభకుజంభులు అదరిపడి, ఇదేమి పిడుగుపాటువలె ఉన్నదని వితర్కించుచూ అందరూకలిసి అంధకుని వద్దకు వెళ్ళారు. నారదా! అలాఅంధకుని సమీపించి ఆ దానవవీరులంతా ఉద్విగ్నులై ఆ ధ్వనిని గురించి ఆలోచించసాగారు. వారలా సంప్రదించు కుంటుండగా భూలోకాన్నుంచి పాతాళకేతువనే సూకర ముఖుడు, బాణం దెబ్బతగిలి తూలుకుంటూ భయ కంపితుడై, దైత్యరాజైన అంధకాసురుని సమీపించి దీన వదనంతో ఇలా అన్నాడు. “రాక్షసప్రభో! నేను భూలోకంలో గాలవ ఋషి ఆశ్రమాన్ని ధ్వంసంచేసే సంకల్పంతో పందిరూపందాల్చి వెళ్ళి దానిని పాడుచేయసాగాను. ఇంతలో ఎవడో మానవుడు బాణంతో నామెడ ఎముకను గట్టిగా బద్దలు కొట్టాడు. నేనా చావు దెబ్బకు భయపడి పారిపోగా ఆతడు నావెంటపడినాడు. గుర్రపు డెక్కల ధ్వనులమధ్య, “నిలు! నిలు!” మనుచూ ఆవీరుడు వెంబడించాడు. అంతట భయంతో దక్షిణ సముద్రం చివరకు పరుగుతీసి, కొంచెం వెనుదిరిగి వారెవ్వరో అని పరికించాను. రకరకాల వేషాలు ధరించి ఎందరో మనుష్యులు, వాళ్ళలో కొందరు మేఘాల్లాగ గర్జిస్తూంటే మరికొందరు ప్రతిగర్జనలు చేస్తున్నారు. ఇంకా కొందరు ఈరోజు తప్పకుండా ఆ మహిషాసురుణ్ణి చంపేస్తాం, ఆ తారకాసురుణ్ణి మట్టి కరిపిస్తాం అంటూ కేకలు పెడుతున్నారు. ప్రభూ! వాళ్ళ సింహనాదాలకు బెదరి పోయి ప్రాణాలరచేతిలో పెట్టుకొని భూలోకాన్నుంచి ఒక పెద్ద బిలంలో పడిపోయాను. నావూరు హిరణ్యపురాన్ని వదిలిపెట్టాను. అయినా ఆ వీరుడు నన్ను కూడ వెంటాడుతున్నాడు. మీ అండకు చేరాను, నా ప్రాణాలు రక్షించండి దొరా!”