అదితి గర్భధారణ

 ఆ విధముగా అభయమిచ్చి వాసుదేవు డంతర్హితుడు కాగా అదితి గర్భం ధరించినది. కృష్ణుడామె గర్భస్తుడగుటతో భూమి అంతయు కంపించినది. మహాపర్వతాలు కదలిపోయినవి. మహాసాగరాలు సంక్షుభితాలయినవి. ఓ బ్రాహ్మణోత్తములారా! ఆ మహాదేవి అదితి అడుగుపెట్టిన ప్రతిచోట భూమి బాధతో క్రుంగిపోయేది. మరొక వైపు, మధుసూదనుడు గర్భస్థుడు కావడంతో, పరమేష్ఠి వచనాను సారం దైత్యులు తమతేజస్సు క్రమంగా కోలుపోసాగారు.

అని మహర్షులకు వివరించి లోమహర్షణుడు తిరిగి చెప్ప నారంభించాడు. ఓ విప్రులారా! తనవారావిధంగా తేజో హీనులగుటచూచి రాక్షసేశ్వరుడైన బలి తన తాతయైన ప్రహ్లాదుని యిలా ప్రశ్నించాడు. పితామహా! మనవారలైన దైత్యులందరు అగ్నిదగ్ధులయినట్లు తేజస్సు కోల్పోయినారు. ఆకస్మికంగా మనవారు బ్రహ్మదండ తాడితులయినారా ఏమి? అది వారల దురదృష్టమా లేక దైత్యవంశ నాశనానికి విధి ప్రయోగించిన అభిచారకృత్య ప్రయోగమా? ఇందులకు కారణమేమి? అని మనుమడు వేసిన ప్రశ్నవిని ప్రహ్లాదుడు బాగా ఆలోచించి అతనితో నిట్లనియెను. కొండలు కదలాడుతున్నవి. భూమి తన స్థైర్యాన్ని కోలుపోతున్నది. ఉన్నట్టుండి సాగరాలు క్షోభిస్తున్నాయి. దైత్యులు నిస్తేజులవుతున్నారు. సూర్యోదయ సమయాన ఎప్పటిమాదిరి గ్రహాలు తమతమ కక్ష్యలలో నడవడంలేదు. చూడగా ఇది దేవతల కభ్యుదయ కాలమనిపిస్తోంది. ఈ ఉత్పాతాలకు ఏదో పెద్ద కారణమే ఉండాలి. దీనిని మనం తేలికగా త్రోసివేయకూడదు. దానవేశ్వరుడుగు బలితో ఇలా చెప్పి అసురోత్తముడగు ప్రహ్లాదుడు ఏకాగ్రచిత్తంతో మనోజగత్తులో శ్రీహరిని వెదక నారంభించాడు. అలా ధ్యానపరుడైన ఆ ప్రహ్లాదునకు అదితి గర్భస్థుడై వామనాకృతిలోనున్న బాలుడు కనిపించెను. ఆ చిన్న శిశువులలో వసువులు రుద్రాశ్వినులు, మరుత్తులు, సాధ్యులు విశ్వేదేవులు ఆదిత్యులు గంధర్వోరగ రాక్షసులు, విరోచనుడు ఆయన కుమారుడు బలి, జంభ, కుజంభ నరకబాణాది అన్యరాక్షసులు, తనతోబాటు పంచభూతాలు సాగర సరిద్‌ద్వీప సరోవరాలు నరమృగ పక్ష్యాదులు సరీసృపాదులతోకూడిన భూమండలం, విధాతయైన బ్రహ్మ, భవుడు గ్రహనక్షత్రాది జ్యోతిర్మండలం దక్షాది ప్రజాపతులు మొదలు సమస్త విశ్వాన్ని చూచి ఆశ్చర్య చకితుడై వెంటనే ప్రకృతిస్థుడై ఆ ప్రహ్లాదుడు దైత్యరాజు బలితో రాజా! నీవు మీ వారలు తేజోహీనులగుటకు కారణం నేను తెలుసుకున్నాను. దానిని సాకల్యంగా వినుము అన్నాడు.