వామన మహా పురాణము
శివకృత ముని పరీక్ష
తర్వాత చాలాకాలానికి శివపార్వతు లాకాశమార్గాన పోతుంటే పార్వతివాళ్ళ ఎండిన దేహాలు చూచి దుఃఖించి భర్తను ప్రసన్నుని గావించి ఇలా అన్నది. “ప్రభో! దేవదారు వనంలో ఆ మునులు ఆవిధంగా కష్టపడుతున్నారు. దయచేసి వారల క్లేశాలు తొలగించండి. ఆస్తికులై వేదధర్మ నిష్టతో అస్తిశల్య మాత్రావశిష్టులై ఇంతకాలంగా ఘోరతపస్సు చేసినా ఇంకా శుద్ధులు కాకుండుటకు వీరంతటి దుష్కర్మలు చేశారా? కనికరించి అనుగ్రహించండి. పార్వతిదేవి మాటలు విని ఆ చంద్రమౌళి, పినాకపాణి, అంధకాంతకుడు చిరునవ్వునవ్వి ఇలా అన్నాడు. దేవీ! నీవు ధర్మ సూక్ష్మం ఎరుగక ఇలా అంటున్నావు. వీరింతగా తపించినా ధర్మ మెరుగరు. కామక్రోధాదులు వదలలేని మూఢబుద్ధులు; నీవెరుగవు” అందులకాతల్లి ప్రభూ! తపోవ్రతనిష్ఠులైన వీరిని గురించి అలా అనకండి. అనుగ్రహించి వారలకు దర్శనమొసగి రక్షించండి. నాకు చాలాబాధగా ఉంది అనివేడుకోగా, ఆ దేవదేవుడు నవ్వుతూ “అయితే నీవిక్కడనే ఉండి చూస్తుండు. నేను వెళ్ళి వారుచేసే కఠోరతపస్సు అసలురంగు బైట పెట్టెదను. వారల చేష్టితాలు నీకే అర్థమౌతాయి.” అన్నాడు అందుకు సంతోషించి పార్వతి భర్తతో మంచిది, నడవండి అలాగే వెళ్ళుదాం. నేనుకూడా వస్తానని ఇద్దరూ బయలుదేరారు. కట్టె పుల్లలు ఇనుప ఊచల్లాగ ఉండి వేదాధ్యయనాలు అగ్నికర్మలు అదేపనిగా చేస్తున్న ఆ మునులను చూచి పరమేశ్వరుడు సర్వాంగ సుందరమూ, దిగంబరమూ, వనమాలా భూషితమైన యువాకృతి ధరించి చేతిలో కపాలం పట్టుకొని ఆ మున్యాశ్రమాల వెంట భిక్షాటనం చేయసాగాడు.
తను ఆశ్రమాలవెంట తిరుగుతున్న ఆ అందమైన యువతపస్విని నగ్నంగా చూచుటతో సహజమైన ఉత్కంఠతో ఆ మునుల భార్యలు మోహంలో మునిగిపోయారు. అందరూ ఒకచోట చేరి తమలో తామా సుందరతపస్విని చూచెదమనుచూ కందమూల ఫలాలు తీసికొని భిక్ష పెట్టుటకు బయలు దేరారు. ఆ దేవదేవుడు కూడ ‘తెండు! తెండ” నుచు వారలిచ్చే ఫలాలు స్వీకరించుటకై భిక్షా కపాలాన్ని చూచి భిక్ష తీసికొంటూ మేలుకలుగుగాక! అని నవ్వులొలక బోయసాగెను. ఆయన నవ్వులకు మరింత కామాతిరేకంతో పిచ్చివారై ఆ స్త్రీలు స్వామిని చుట్టు ముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. “ఓయీ తాపస యువకుడా ! ఈ విధంగా దిగంబరత్వంతో వనమాలికలు ధరించి భిక్షాటనంచేసే వ్రతం ఎలాటిది? దాని విధానం ఎక్కడుంది? నిన్ను చూచి మా హృదయాలు కరిగిపోతున్నాయి. మేముకూడ అందచందాలలో నీకు తీసిపోము.” అని ప్రశ్నించారు. ఆ కామార్తల ప్రశ్నవిని శివుడు - సుందరులారా! ఇది చాలరహస్యమైన వ్రతం. దీని విధానం ఫలం పదిమందిలో వెల్లడించ కూడదు. కాన మీరు వెళ్ళిపొండి.” అనగా ఆస్త్రీలు “అలాగైతే ఏకాంత స్థలానికి వెళ్తాం పదండి. అక్కడ మాకు అన్నివిషయాలు చెప్పవచ్చు” నంటూ ఆయన చేయిపట్టుకొనిరి. కొందరు సుందరాంగన లాయన మెడను మోహావేశంతో పెనవేసుకున్నారు. కొందరు కాళ్ళు, పిక్కలు పట్టుకుంటే కొందరాయన నాభిప్రదేశాన్ని చుట్టివేసుకున్నారు. ఈ విధంగా మోహావేశంలో కన్నుగానక ప్రవర్తిస్తున్న తమ స్త్రీల వికారచేష్టలకు మునులు ఆగ్రహోదగ్రులై ఈ దుష్టుని హతమార్చుదము రండు రండంటూ కర్రలూ, రాళ్ళూ తీసికొని ఆయనను ప్రహరిస్తూ ఆయన భీషణ లింగాన్ని నేలపై బడవేశారు. తన లింగం ఊడినేలపైబడిన వెంటనే ఆమహాదేవు అంతర్హితుడై పోయాడు.
పార్వతితో కలిసి రుద్రుడు కైలాసగిరి చేరుకున్నాడు. దేవదేవుని లింగం భూమిపై పడుటతోనే సృష్టి అంతా అతలాకుతలమై పోయింది. భగవానుని వ్యాకులపాటువల్ల ఆత్మజ్ఞానులయిన ఋషుల హృదయాలు క్షోభించాయి. అంతట నా మునులలో బుద్ధిమంతుడయిన అతడొకడు, మనము ఆ మహాత్ముడైన తపస్వి సద్భావాన్ని గుర్తించలేక పోయాము. ఇపుడందరం వెళ్ళి విరించిని శరణువేడుదాము. ఆయనే ఇందులోని రహస్యం తెలిసినవాడు అని సలహా యిచ్చాడు. ఆప్రకారం ఆమునులందరు తమ తొందరపాటుకు, మూర్ఖత్వానికి సిగ్గుపడి, దేవతల చేత పరివేష్టితుడైన బ్రహ్మ సన్నిధికి వెళ్ళి ప్రణతులై తలవంచుకొని నిలబడ్డారు. అలా దుఃఖితులైన ఆ మునులనుచూచి బ్రహ్మయిలా మందలించాడు. “క్రోధం మిమ్ములను కలుషాత్ములను గావించింది. దానికి లోబడి పరమ మూర్ఖులై పోయారు. మూఢబుద్ధులారా! మీరలు ఏ మాత్రం ధర్మకార్య స్వభావాన్ని ఎరుగకపోయారు. పరమక్రూర కార్య మాచరించారు. ధర్మ స్వరూపం, సారతత్వం యిప్పుడైనావిని తెలుసుకోండి. ధర్మస్వరూపం గుర్తించిన విజ్ఞుడు శీఘ్రమే ఉత్తమఫలం పొందుతాడు. ఆ పరమేశ్వరుడు మీ శరీరాల్లోనే, ఆత్మలోనే సదా నిలచి యున్నాడు. మీకంటె భిన్నుడుకాడు. అనాదితత్వమైన ఆ మహాస్థాణువు, పరమ ప్రకాశవంతమైన మణి ఏ విధంగా తాను కప్పబడిన వస్త్రము యొక్క రంగులలోనే పైకి కనపడునో, అదేవిధంగా ప్రాణుల దేహంలో ఉంటూ వారల కర్మ వాసనల అంతరాన్ననుసరించి భిన్న ప్రకృతుల రూపాన కనిపిస్తాడు. ఆయా జీవుల మనోభావాలచేత పరిచ్ఛిన్నుడై ఉంటాడు. అయితే ఆయనకు వారల కర్మవాసన లేమాత్రము అంటవు. వారల కర్మానుసారమే, స్వర్గ నరకాది భోగాలు అనుభవించడం జరుగుతుంది. కనుక ఈ విషయం గుర్తించి బుద్ధిమంతులగువారు జ్ఞాన యోగాది సాధనలద్వారా తమ మనస్సులను పరిశుద్ధంగావించుకోవాలి. చిత్తశుద్ధి అయినవెంటనే అంతరాత్మ తనంతతానే నిశ్చలంగా ఉండిపోతుంది. ఎలాంటి వ్యాకులానికి లోనుకాదు. అలాంటి మానసిక నైర్మల్యం లేనంతవరకు ఎంతకాలం వ్రతోపవాసాలతో శరీరం శుష్కింపజేసుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. ఈ అనుష్ఠానాలన్నీ చిత్తశుద్ధికోసమే ఉద్దేశింపబడినాయి. అలాంటి సత్ప్రవర్తనకు సాధన భూతంగానే, ఆ పరమేశ్వరుడు వర్ణాశ్రమ ధర్మవ్యవస్థ నేర్పరచినాడు. కాగా ఎక్కువమంది ఆ జ్ఞానాన్ని మోహాన్ని గొప్ప విషయంగా భావించి గొప్పవారమను కుంటున్నారు. ఇక మీ విషయమే చూడండి. మీరుండేది ఆశ్రమాల్లో. మీ మనస్సులో తిష్టవేసికొని ఉన్నవో కామక్రోధాలు! నిజమైన జ్ఞానులకు ఇల్లే ఆశ్రమం. జ్ఞానులుకానివారికి ఆశ్రమాలు ఇంటికంటె గూడ నికృష్టమైనవిగా ఉంటాయి. స్త్రీ సంబంధమైన భ్రమలకు లోనైన మీరెక్కడ? నిరీహమైన జీవిత మెక్కడ? క్రోధానికి దాసులైన మీరెక్కడ? ఆత్మజ్ఞాన మెక్కడ? క్రోధాభిభూతుడుచేసే యజ్ఞాలు, ఇచ్చే దానాలు, వేల్చే ఆహుతులు, ఆచరించే తపో వ్రతాదులు బూదిలోపోసిన పన్నీరువలె నిష్ప్రయోజనకరాలు! ఈ జన్మలో అవి ఎలాటి ఫలాన్నీ ఇవ్వవు. కోపిష్టిచేసే పనులన్నీ వ్యర్థచేష్టితాలు!