వామన మహా పురాణము
తపతీ సంవరణోపాఖ్యానం
ఇంకా పులస్త్యుడు ఇలా చెప్పాడు: శ్రీవిష్ణువు మాటలు విని ఇంద్రుని నేతృత్వంలో ఆ దేవతలు చేతులు జోడించుకొని ఆయన నిలా ప్రశ్నించారు. “ఓ దేవదేవా! ఆ కురుక్షేత్ర మంటే ఏమిటి? పృథూదక తీర్థమెలా ఆవిర్భవించింది. వానిని గురించి మాకు వివరింప వలసినది. పితరులను శ్రద్ధాభక్తులతో పూజింపదగిన ఆ పుణ్యతిథి మహాతిథి ఏనాడు సంభవించునో తెలియజేయుము!” దేవతల ప్రశ్నలు విని కైటభమర్దనుడైన మురారి పవిత్రమైన కురుక్షేత్ర గాథను, మహాతిథిని ఇలా వివరించాడు. కృతయుగ ఆరంభంలో సోమవంశోద్భవుడైన ఋక్షుడను రాజు మహాపరాక్రమశాలి కలడు. అతడి పుత్రుడు సంవరణుడు. చిన్నతనాన్నే ఋక్షుడు అతనిని రాజునుచేశాడు. అతడు కూడ బాల్యం నుండీ నాకు భక్తుడుగా ధర్మనిరతుడై రాజ్యం చేయు చుండెను. వరుణ పుత్రుడైన వసిష్టుడాతని పురోహితుడు. ఆ రాజు అతని వద్ద సాంగోపాంగంగా వేదాధ్యయనం చేశాడు. ఒక అనధ్యయన దినాన ఆ రాజు రాజకార్యాలన్నీ వసిష్ఠునకు వదలి వేటకై వెళ్ళెను. వైభ్రాజమనే అరణ్యంలో వేటాడుతూ ఒంటరిగా ఆ రాజు అందలి వివిధ పుష్పపరి మళాలతో తృప్తిపడక చాలాసేపు విహరించాడు. ఆ వనాంత ప్రదేశం బాగా వికసించిన కోకనద, కల్హార, పద్మ, కమల, ఇందీవర కుముదాది వివిధ జల పుష్పాలతో నిండి ఉంది. అచట నిరంతరం దేవ కామినులు అప్సరసలు క్రీడిస్తూ కనిపించారు. ఆ సుందరుల మధ్య నాయకమణిలాంటి ఒక అందాలబరిణలాంటి కన్యను చూచి రాజు వెంటనే కామ పీడుతుడైనాడు. ఆ బాలకూడ దర్శన మాత్రాన్నే మన్మథబాణాలకు గురియై రాజుమీద మరులుగొన్నది. ఆ క్షణంలో మోహాతిశయంతో రాజుమూర్ఛ చెంది గుర్రం మీదనుండి క్రిందబడిపోయెను. అది చూచి కామ రూపిణులైన ఆ గంధర్వ స్త్రీలు ఆయన మీద నీళ్ళు చిలకరించి సేదదేర్చిరి. మోహంతో మూర్ఛిల్లిన ఆ బాలికను గూడ సేదదేర్చి అప్సరసలు ఆమె తండ్రి ఇంటికిచేర్చి తియ్యని మాటలతో శాంతింపజేశారు. స్పృహ వచ్చిన రాజు, గుర్రము నెక్కి మేరు శిఖరానికి వెళ్ళే కామచారియగు దేవతవలె తన రాజధాని అయిన ప్రతిష్ఠానపురానికి చేరుకున్నాడు.
గిరిప్రదేశాన తపతిని కండ్లతో చూచినది మొదలా రాజు నిద్రాహారాలు మాని వేశాడు. ఆ విషయం అంతా గ్రహించిన తపోనిధి వరుణ పుత్రుడు, రాజు మనోగతం తెలిసినవాడై వెంటనే గగన మండలానికి ఎగిరి రథం మీద ఆసీనుడైన సూర్యభగవానుని దర్శించి ప్రణామం చేశాడు. సూర్యుడుగూడ ఆవసిష్ఠునకు ప్రతినమస్కారం చేసి, సగౌరవంగా తన రథంమీద కూర్చుండ బెట్టుకున్నాడు. ప్రకాశించుచున్న జటలతో సూర్యుని ప్రక్కన కూర్చున్న ఆ మహర్షి రెండవ సూర్యునివలె తేజరిల్లెను. అర్ఘ్యపాద్యాలతో సూర్యుడాయనను పూజించి వచ్చిన కారణమడుగగా ఆవరుణాత్మజుడిలా అన్నాడు. “మహాతేజస్వివైన ఓ దేవేశ్వరా! రాకుమారుడగు సంవరణునకై నీపుత్రికను అర్థింపవచ్చితిని. ఆమెను ఇవ్వటానికి నీవే తగినవాడవు. అన పలుకగా తన ఇంటికేతెంచిన ఆ విప్రోత్తమునకు, సూర్యుడు తనకుమార్తెయగు తపతిని. సంవరణునకు భార్యగా, అప్పగించెను. ఆమెను తీసికొని వసిష్ఠుడు తన పుణ్యాశ్రమానికి చేరుకొనగా ఆ తపతి తను చూచిన రాకుమారుడు గురుతురాగానే చేతులు జోడించుకొని ఇట్లనెను.
ఆ దేవర్షితో తపతి ఇలా అన్నది-భగవన్! నేనొక పర్యాయం అప్సరసలతో పరిచారికలతో కూడి ఒక కుమారుని చూచి ఖేద పడ్డాను. దేవతుల్యుడగు అతని లక్షణాలు చూడగా అతడొక రాజకుమారునిగ తోచెను. చక్ర గదా అని చిహ్నాలతో అతని పాదాలు అందంగా ఉన్నయి. ఏనుగు తొండముల వంటి జంఘలు ఊరువులు, సింహం లాంటి సన్నని నడుము త్రివళులు, శంఖంలాంటి మెడ, పుష్టంగా లావుగా బలిష్టంగా ఉన్న ఆజానుబాహులు కమల చిహ్నాలతోకూడిన అరచేతులు, ఛత్రంలాంటి శిరస్సు, నల్లని వంపులు తిరిగిన కేశాలు, మాంసలమై సమంగా ఉన్న కర్ణ నాసికలు, పొడవైన వ్రేళ్ళు, తెల్లని దంతాలు అన్నీ సలక్షణంగా ఉన్నాయి. అతడు ఆరింటిలో ఉదారవీర్యుడు. మూడింటిలో గంభీరుడు, మూడింటిలో ప్రలంబుడు, ఐదింట రక్తవర్ణుడు. ఆ రాకుమారుడు నాలుగింట కృష్ణుడు (నలుపు), మూడింట అవనతుడు, రెండింట పరిమళుడు. అతని పది లక్షణాలు పద్మాలను పోలియుంటవి. ఓ బ్రహ్మర్షీ! అలాంటి సుందరుడైన రాజకుమారుని నేనిదివరకే భర్తగా వరించియున్నాను. ప్రభో! సర్వగుణ సంపన్నుడైన అతనికే నన్నిచ్చి వివాహంచేయండి. ఒకరిని వరించిన స్త్రీని మరొకరికి ఇచ్చుట అనుచితమని పెద్దలవాక్యము. తపోధనా! నన్ను క్షమించుము అని వినయంగా మునిని ప్రార్థించింది.
“సూర్యపుత్రిక మాటలు వింటూనే ఆ మహర్షి ధ్యానంలో మునిగి ఆమెకూడ మోహితురాలని తెలిసికొని సంతోషించి యిలా అన్నాడు “బిడ్డా! నీవు అరణ్యంలో చూచి కామించినవాడు నిజంగా రాజపుత్రుడే. అతడే ఋక్షుని కుమారుడు సంవరణుడు. నా ఆశ్రమానికి వస్తూ ఉంటాడు.” అని చెప్పాడు. అప్పుడు ఆ రాజపుత్రుడా విప్రోత్తముని ఆశ్రమానికి వచ్చి మహర్షికి తలవంచి ప్రణామంచేసి కూర్చున్నాడు. అచటనే ఉన్న పద్మవిశాలాక్షి తపతినిచూచి తాను పూర్వం చూచిన సుందరాంగియని తలచి ఆమె ఎవ్వరని వరుణాత్మజుని అడిగెను. అపుడా వసిష్ఠుడు “రాజా! ఈమె సూర్యపుత్రి. తపతి’ ‘ అను కన్యగా విఖ్యాతిగాంచినది. నీ కొరకై సూర్యుని అర్థించి, ఈమెను నా ఆశ్రమానికి తీసికుని వచ్చితిని. కాబట్టి నీవు వెంటనే విధిపూర్వకంగా ఈ తపతీ కన్య పాణిగ్రహణం చేయుము” అని ఆదేశించెను. సంవరుణుడు మహదానందంతో విధ్యుక్త విధానాన ఆ సుందరిని పెండ్లియాడెను. దేవేంద్ర సమప్రభావుడు, మనోభిరాముడుఅగు ఆ నృపతిని ఆ సూర్యకుమారి పెండ్లాడి, దేవలోకంలో ఇంద్రునితో విహరించే దివ్యకాంతలాగ ఉత్తమ భవనాల్లో నివసించి సుఖించింది. అని చెప్పి